జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఓటింగ్ శాతం దారుణంగా పడిపోయింది. గత ఎన్నికల్లో 45.25 శాతం ఓటింగ్ నమోదుకాగా, ఈసారి సాయంత్రం నాలుగు గంటల వరకు 29.76 శాతం ఓటింగ్ మాత్రమే నమోదైంది. సాయంత్రం ఆరు గంటల వరకు క్యూలో గల వారందరికీ ఓట్లు వేసే అవకాశం ఉంది. దీంతో మొత్తంగా ఓటింగ్ శాతం ఎంతమేరకు నమోదవుతుందనే అంశం తేలాల్సి ఉంది. సాయంత్రం నాలుగు గంటల వరకు నమోదైన అత్యల్ప ఓటింగ్ శాతం మాత్రం ప్రధాన రాజకీయ పక్షాలను తీవ్రంగా కలవరపెడుతోంది. ఈ పరిణామాలు ఎవరికి మేలు చేస్తాయి? మరెవరికీ నష్టంగా మారనున్నాయనే అంశంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఓటింగ్ శాతం పెరిగితేనే విపక్షాలకు లాభమనే వ్యాఖ్యలు వినిపిస్తుండగా, పాలకవర్గాలపై ప్రజలకు అనాసక్తి ఏర్పడడం వల్లే ఓటింగ్ శాతం తగ్గిందని, ఇది విపక్షాలకే మేలు చేస్తుందనే వాదన మరోవైపు వినిపిస్తోంది. ఈ ఎన్నికల్లో హోరాహోరీగా తలపడినట్లు ప్రచారంలోగల అధికార టీఆర్ఎస్, బీజేపీ పార్టీలకు పడిపోయిన ఓటింగ్ శాతం ఏ విధంగా ఉపకరిస్తుందనే అంశాలపైనా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ పథకాల్లో ఎక్కువగా లబ్ధిపొందుతున్న సామాన్య ప్రజలే ఎక్కువగా ఓట్లు వేశారని, ఈ పరిణామం సహజంగానే అధికార పార్టీకి లాభిస్తుందంటున్నారు. అయితే ప్రభుత్వంపై అనాసక్తి, అయిష్టత కారణంగానే అనేక మంది ఓటింగ్ కు దూరంగా ఉన్నారని, విపక్షాలకే పరిస్థితి ఆశాజనకంగా ఉంటుందని మరికొందరు పేర్కొంటున్నారు.
ప్రభుత్వ ఉద్యోగ వర్గాలు, ముఖ్యంగా టీచర్లు, ఆర్టీసీ ఉద్యోగులతోపాటు, ఇతర ప్రభుత్వ రంగ సంస్థల వేతనజీవులు ఎక్కువగా ఓట్లు వేశారని, దీన్ని బట్టి పరిస్థితిని అవగతం చేసుకోవచ్చని హైదరాబాద్ లోని సీనియర్ జర్నలిస్టు మిత్రుడొకరు వ్యాఖ్యానించారు. అదేవిధంగా బీజేపీకి పడే ఓట్లు ‘క్రమపద్ధతి’లో పడుతాయని, తమ సానుభూతిపరుల ఓట్లను పొందడంలో బీజేపీ ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తుందనే విషయాన్ని మరువరాదని ఆ జర్నలిస్టు మిత్రుడు ప్రస్తావించారు. ఇదే అంశంపై హైదరాబాద్ కు చెందిన బీజేపీ నాయకుడొకరు మాట్లాడుతూ, ఓటింగ్ శాతం తగ్గినమాట వాస్తవమైనప్పటికీ, అది పాతబస్తీలో మాత్రమే తగ్గిందని, దానివల్ల తమకు జరిగే నష్టమేమిటని ప్రశ్నించడం గమనార్హం. మొత్తంగా తగ్గిన ఓటింగ్ శాతం కారణంగా గెలుపు, ఓటములపై ప్రధాన రాజకీయపక్షాలు మాత్రం కలవరపాటుతో లెక్కలు వేసుకోవడంలో నిమగ్నమయ్యాయి.