గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో రాజకీయ పార్టీలు హోరాహోరీ పోరాటం చేసింది కేవలం 50 డివిజన్లలో విజయం కోసమేనా? మరో 50 డివిజన్లలో పార్టీల గెలుపు చిత్రం క్లియర్ గానే ఉందా? అనే ప్రశ్నలకు ప్రభుత్వ నిఘా వర్గాల నుంచి ఔననే సమాధానం వస్తోంది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తిరుగులేని విజయం ద్వారా భవిష్యత్ రాజకీయాలపై గట్టి పట్టు సాధించేందుకు ప్రధాన పార్టీలు తీవ్రంగా ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. డబ్బు, మద్యం, కానుకల వంటి ప్రలోభాలు ఇందులో భాగమనే విషయం బహిరంగమే. నిన్న రాత్రి వరకు కూడా వివిధ పార్టీలు ఈ ప్రక్రియను కొనసాగించినట్లు వార్తలు వచ్చాయి.
అయితే జీహెచ్ఎంసీ లోని మొత్తం 150 డివిజన్లలో ఎంఐఎం ప్రాబల్యం గల పాతబస్తీలోని సుమారు 40 స్థానాలను మినహాయిస్తే, ప్రధాన పార్టీల మధ్య పోరాటం జరుగుతోంది ఇక 110 స్థానాల్లో మాత్రమేనని ప్రభుత్వ నిఘా వర్గాలు చెబుతున్నాయి. ఇందులో యాభై డివిజన్లలో ‘పిక్చర్’ క్లియర్ గానే ఉందంటున్నారు. ప్రధాన రాజకీయ పక్షాల్లోని ఓ పార్టీ 30 డివిజన్లలో, మరో పార్టీ 20 డివిజన్లలో విజయం సాధించడం చాలా స్పష్టంగానే కనిపిస్తోందంటున్నారు. మరో యాభై స్థానాల్లో మాత్రమే రెండు ప్రధాన పార్టీల మధ్య నువ్వా? నేనా? అనే తరహాలో పోరాటం జరుగుతోందని నిఘా వర్గాల కథనం.
గట్టిపోటీ ఏర్పడిన 50 డివిజన్లలో 5-7 శాతం ఓట్ల తేడాతోనే విజయం తలకిందులయ్యే అవకాశం ఉందనేది ఆయా వర్గాల అభిప్రాయం. ఇక మిగిలిన పది స్థానాల్లో స్వతంత్ర, ఇతర చిన్నా, చితకా పార్టీల అభ్యర్థుల ప్రభావం ఉందంటున్నారు. మరో ప్రధాన పార్టీ పరిస్థితి మరీ దయనీయంగా ఉందని ప్రభుత్వ నిఘా వర్గాలు చెబుతున్నాయి. ఉప్పల్ నియోకవర్గంలో గల ఒకే ఒక స్థానంలో ఆ పార్టీ అభ్యర్థి కార్పొరేటర్ గా గెలిచే అవకాశాలు ఉన్నాయంటున్నారు. పాతబస్తీలోని పలు ప్రాంతాల్లో ఓ పార్టీకి చెందిన వారు లౌక్యంతో స్వతంత్ర అభ్యర్థులుగా తలపడుతున్నారట. దీని ప్రభావం కూడా ఎంఐఎం విజయావకాశాలపై కొంతమేర ఉండవచ్చంటున్నారు. మొత్తంగా గ్రేటర్ మున్సిపల్ ఎన్నికల పోలింగ్ కొద్ది గంటల క్రితం ప్రారంభమైంది. సాయంత్రానికి పలు సంస్థల నుంచి ఎగ్జిట్ పోల్స్ వెల్లడయ్యే అవకాశం ఉంది.