నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య కొద్దిసేపటి క్రితం కన్నుమూశారు. ఆయన వయస్సు 64 సంవత్సరాలు. గత కొన్ని రోజులుగా ఆయన తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. తొలుత కరోనా బారిన పడినప్పటికీ, ఆ తర్వాత జరిపిన మెడికల్ టెస్టుల్లో ఆయనకు నెగిటివ్ రిపోర్ట్ వచ్చింది. కానీ ఊపిరితిత్తుల సమస్య వెంటాడింది. ఈ పరిస్థితుల్లోనే హైదరాబాద్ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కొద్దిసేపటి క్రితం నోముల నర్సింహయ్య తుదిశ్వాస విడిచారు.
ప్రస్తుతం నాగార్జునసాగర్ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న నోముల 1999, 2004 ఎన్నికల్లో లో సీపీఎం పార్టీ అభ్యర్థిగా నకిరేకల్ నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తర్వాత 2009 ఎన్నికల్లో భువనగిరి ఎంపీగా ఓటమి చెందారు. అయితే 2013లో టీఆర్ఎస్ లో చేరిన నోముల 2014 ఎన్నికల్లో నాగార్జున సాగర్ నియోజకవర్గం నుంచి జానారెడ్డిపై పోటీ చేశారు. అప్పటి ఎన్నికల్లో విజయం దక్కకపోయినా, 2018 ఎన్నికల్లో అదే జానారెడ్డిపై నోముల నర్సింహయ్య ఘన విజయం సాధించారు.