బండి సంజయ్… బీజేపీ తెలంగాణా అధ్యక్షుడు. కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడు. రాష్ట్ర వ్యాప్తంగానే కాదు, దేశ వ్యాప్తంగా ఆసక్తిని కలిగిస్తున్న జీహెచ్ఎంసీ ఎన్నికల్లో సంజయ్ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్న నేత. ఎన్నికల ప్రచారం సందర్భంగా సంజయ్ చేసే సంచలన వ్యాఖ్యల వెనుక అర్థముందా? పరమార్థముందా? అనే చర్చ సంగతి కాసేపు వదిలేయండి. సంజయ్ చేస్తున్న వ్యాఖ్యలు మాత్రం జీహెచ్ఎంసీ ఎన్నికల రాజకీయాన్ని మాత్రం తనచుట్టే తిప్పుతున్నాయ్.
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మేయర్ పదవి చేపట్టగానే పాతబస్తీపై ‘సర్జికల్ స్ట్రైక్స్’ చేస్తామని సంజయ్ వ్యాఖ్యానించగానే, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సహా ఆ పార్టీకి చెందిన అనేక మంది నాయకుల అతన్నే ‘టార్గెట్’ చేస్తూ ప్రతి వ్యాఖ్యలు చేశారు. ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ కూడా సంజయ్ చేసిన వ్యాఖ్యలపై విరుచుకుపడ్డారు.
అంతకు ముందు వరద బాధితులకు రూ. 10 వేల సాయం నిలిపివేతపై తాను ఎన్నికల సంఘానికి ఎటువంటి లేఖ రాయలేదని, తన సంతకాన్ని ఫోర్జరీ చేశారని సంజయ్ గట్టిగా వాదించారు. భాగ్యలక్ష్మి టెంపుల్ కు వస్తానని, అక్కడే ప్రమాణం చేద్దామని సీఎం కేసీఆర్ కు సవాల్ విసిరారు. సవాల్ చేసి చడీ, చప్పుడు లేకుండా సంజయ్ మిన్నకుండలేదు. సినీ ఫక్కీలో చెప్పిన సమాయానికి భాగ్యలక్ష్మి టెంపుల్ కు చేరుకున్నారు. అమ్మవారి దర్శనం చేసుకున్నారు. ప్రత్యేక పూజలు చేశారు. ‘ఏరీ సీఎం కేసీఆర్ రాలేదేం?’ అని ప్రశ్నించారు.
ఆ తర్వాత మరో ఘటన. ఎన్టీఆర్, పీవీ నరసింహారావు ఘాట్లపై ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ చేసిన వ్యాఖ్యలపైనా సంజయ్ తనదైన శైలిలో బదులిచ్చారు. ఆ ఇద్దరు మహనీయుల ఘాట్లకు తాను రక్షణగా ఉంటానని చెబుతూ, చెప్పిన ప్రకారం అక్కడికి వెళ్లి నివాళులు అర్పించారు. సంజయ్ తాజాగా ఏమంటున్నారు? జీహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం దానంతట అదే కూలిపోతుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణాలో మధ్యంతర ఎన్నికలు ఖాయమని, సీఎం కేసీఆర్ జైలుకు వెళ్లడం ఖాయమని కూడా వ్యాఖ్యానించారు. తాను చెబుతున్నానని, రాసిపెట్టుకోవాలని, ప్రభుత్వం కూలడం ఖాయమని, ఆ తర్వాత జరిగే మధ్యంతర ఎన్నికల్లో బీజేపీ గెలుపొందుతుందని సంజయ్ పేర్కొన్నారు.
ఇప్పుడీ వ్యాఖ్యలు తెలంగాణా రాజకీయాల్లో హాట్ టాపిక్. సంజయ్ చేసే సంచలన వ్యాఖ్యలకు తాడూ, బొంగరం ఉండదని టీఆర్ఎస్ నాయకులు ప్రతిగా వ్యాఖ్యలు చేయవచ్చు. మొన్న దుబ్బాకలో గెల్చిన రఘునందన్ రావు సహా ఆ పార్టీకి ఉన్నది మహా అయితే ఇద్దరు ఎమ్మెల్యేలు, ఈ మాత్రం సంఖ్యకే ప్రభుత్వం కూలుతుందా? అని లెక్కలు వేసుకోవచ్చు. సంజయ్ వ్యాఖ్యలతో సర్కార్ కూలుతుందా? అది సాధ్యమయ్యే పనేనా? అనే ప్రశ్నలు కూడా ఉద్భవించవచ్చు. కానీ జీహెచ్ఎంసీ ఎన్నికల ‘పిక్చర్’ మొత్తం తనమీదే ఫోకస్ చేసుకోవడంలో మాత్రం సంజయ్ పక్కాగా సఫలమవుతున్నట్లే కనిపిస్తోంది.
సీఎం కేసీఆర్ నుంచి ఎంఐఎం అధినేత అసదుద్దీన్, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డిలే కాదు, రేవంత్ రెడ్డి లాంటి నాయకుల నోట్లో నానుతున్నది కూడా బండి సంజయ్ కుమార్ అనేది కాదనలేని వాస్తవం. సరిగ్గా ఏడాదిన్నర క్రితం సంజయ్ సాధారణ కార్పొరేటరే కావచ్చు. కానీ ఆ తర్వాత ఎంపీ, వెనువెంటనే బీజేపీ తెలంగాణా అధ్యక్ష పదవి పగ్గాలు చేపట్టడం, తన సంచలన వ్యాఖ్యలతో జీహెచ్ఎంసీ రాజకీయాన్ని యావత్తూ తనచుట్టూ తిప్పుకోవడంలో సంజయ్ సక్సెస్ అనే చెప్పాలి.
పనిలో పనిగా సంజయ్ ఈ ఎన్నికల ప్రచారంలో ఇంకా ఏమన్నారో తెలుసా? ‘మద్యంతాగి ప్రభుత్వాన్ని నడపడం రాష్ట్రానికి ప్రమాదకరం. చొరబాటుదార్ల ఓట్లతో గెలవాలని చూడడం దేశానికి ప్రమాదకరం.’ అన్నారు. సంజయ్ ను దగ్గరగా చూసిన కొందరు జర్నలిస్టులు ఆయన చేసే వ్యాఖ్యలపై ఏమంటున్నారంటే… సంజయ్ ఇటువంటి వ్యాఖ్యలు అన్యాపదేశంగా చేయరట. రాత్రంగా ఆలోచించి, రాసుకుని, వల్లెవేసి మరీ సందర్భానుసారం వ్యాఖ్యానిస్తారట. కొందరు నేతలు భావిస్తున్నట్లు సంజయ్ తక్కువగా అంచనా వేసే నాయకుడు మాత్రం కాదనేది అయనను బాగా గుర్తెరిగిన జర్నలిస్టుల భాష్యం. కరడుగట్టిన ఆర్ఎస్ఎస్ కార్యకర్త సంజయ్ కు పార్టీ పగ్గాలు అప్పగిస్తూ, బీజేపీ కోరుకున్నదీ, తెలంగాణాలో కనిపిస్తున్న తాజా రాజకీయ ముఖ చిత్రం ఒక్కటేనా…? ఇదీ ఇప్పుడు అసలు చర్చ.