ప్రధాని మోదీ పర్యటనలో సీఎం కేసీఆర్ కు శ్రీముఖం
బహుషా టీఆర్ఎస్ నేతలు కించిత్ కూడా ఊహించి ఉండకపోవచ్చు. ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనలో తమ పార్టీ చీఫ్, ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఇటువంటి షాకింగ్ సీన్ సాక్షాత్కరిస్తుందని అస్సలు అంచనా వేసి ఉండకపోవచ్చు. రాజకీయ ప్రత్యర్థుల అంచనాకు అనుగుణంగా ఎత్తులు వేస్తే అది బీజేపీ ఎలా అవుతుంది? కేసీఆర్ ఎత్తుగడలకు చిత్తయ్యే కొన్ని ఇతర పార్టీల మాదిరిగానే వ్యవహారం ఉండేది.
దేశ ప్రధాని నరేంద్ర మోదీ మరికొద్ది గంటల్లోనే హైదరాబాద్ చేరుకోనున్నారు. శామీర్ పేట సమీపంలోని భారత్ బయోటెక్ సంస్థను సందర్శించి, అక్కడ డెవలప్ చేస్తున్న ‘కోవాగ్జిన్’ కరోనా వ్యాక్సిన్ ను పరిశీలిస్తారు. దాదాపు గంట సేపు ప్రధాని మోదీ అక్కడే గడుపుతారు. జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచార పర్వం తుది అంకానికి చేరుతున్న పరిణామాల్లో ప్రధాని పర్యటన ఖరారు కావడం బీజేపీ శ్రేణులను సంబురానికి గురిచేసిందనేది కాదనలేని వాస్తవం.
ప్రధాని రాష్ట్ర పర్యటనకు ముందే జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచార సభలో సీఎం కేసీఆర్ పాల్గొనే కార్యక్రమం ఖరారైంది. అయితే సరిగ్గా దాదాపు సభ జరిగే సమయానికే ప్రధాని పర్యటన ఖరారు కావడం రాజకీయ వర్గాల్లో తీవ్ర ఆసక్తిని కలిగించింది. ఈ అంశంలో భిన్న ప్రచారం, విశ్లేషణలు సాగుతున్న పరిస్థితుల్లోనే సీఎం కేసీఆర్ కు ప్రధాని కార్యాలయం అనూహ్య ‘షాక్’నిచ్చినట్లు తాజా వార్తల సారాంశం.
సీఎం కార్యాలయ వర్గాల కథనం ప్రకారం… దేశ ప్రధాని రాష్ట్రానికి వచ్చినపుడు ఆ రాష్ట్ర ప్రజల తరపున గవర్నర్, ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రులు విమానాశ్రయం వద్దకు వెళ్లి స్వాగతం పలుకుతారు. జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచార సభలో పాల్గొనాల్సి ఉన్నప్పటికీ, ఈసారి కూడా ప్రొటోకాల్ ప్రకారమే వ్యవహరించాలని సీఎం కేసీఆర్ భావించారు. ఈరోజు మధ్యాహ్నంకల్లా సీఎం హకీంపేట విమానాశ్రయానికి చేరుకుని ప్రధానికి స్వాగతం పలుకుతారని రాష్ట్ర ప్రభుత్వం ప్రధానమంత్రి కార్యాలయానికి సమాచారం ఇచ్చింది.
కానీ, ప్రధానిని స్వాగతించేందుకు సీఎం రావలసిన అవసరం లేదని, ఐదుగురికి మాత్రమే అనుమతి ఇస్తున్నామంటూ ప్రధాని కార్యాలయం నుంచి ప్రత్యేక సమాచారం పంపడం సంచలన చర్చనీయాంశంగా మారింది. గతంలో ఎప్పుడూ, ఎన్నడూ ఇలా జరగలేదని, ఎందుకిలా చేశారో అర్థం కావడం లేదని సీఎంవోలోని సీనియర్ అధికార వర్గాలు నివ్వెరపోతున్నాయట. ప్రధాని పర్యటనలో స్వాగతం పలికేందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి, మేడ్చల్ కలెక్టర్ శ్వేతా మహంతి, సైబరాబాద్ సీపీ వీసీ సజ్జన్నార్, హకీంపేట ఎయిర్ ఆఫీస్ కమాండెంట్లకు మాత్రమే విమానాశ్రయానికి రావడానికి పీఎంవో కార్యాలయం అనుమతిచ్చింది.
ఈ పరిణామాన్ని టీఆర్ఎస్ పార్టీ కరదీపిక ‘నమస్తే తెలంగాణా’ పత్రిక చూస్తూ ఉర్కుంటుందా? ‘మోదీ.. గిదేంది?’ అంటూ ప్రశ్నిస్తూ వార్తా కథనాన్ని కుమ్మేసింది. ఈ పరిణామాన్ని ‘తెలంగాణా ఆత్మగౌరవానికి ఢిల్లీ అమర్యాద’గా అభివర్ణిస్తూ వార్తా కథనంలో ఉప శీర్షీకరించింది. ‘హైదరాబాద్ కి వస్తున్న ప్రధానమంత్రికి స్వాగతం పలకడానికి కేసీఆర్ ను వద్దనడం అంటే, తెలంగాణ సమాజాన్ని అవమానించినట్టే…తెలంగాణ ఆత్మగౌరవంపై దెబ్బ కొట్టిన ఢిల్లీ పెద్దలకు తగిన బుద్ది చెబుదాం… ఆనాడు సీఎం అంజయ్యను రాజీవ్ గాంధీ అవమానించినట్టు, ఈనాడు మోడీ మన కేసీఆర్ ను అవమానిస్తున్నాడు… మన కేసీఆర్ … మన తెలంగాణ.. మన ఆత్మగౌరవం’ అంటూ టీఆర్ఎస్ కార్యకర్తలు సోషల్ మీడియాలో నినదిస్తున్నారు.
కానీ, కొసమెరుపు ఏమిటంటే… ప్రధానికి స్వాగతం పలికేందుకు అనుమతి లభించిన అయిదుగురిలో రాష్ట్ర గవర్నర్ కూడా లేకపోవడం. ‘ సీఎం కేసీఆర్ కు మాత్రమే కాదు, గవర్నర్ కు కూడా అనుమతి లేదు’ అని బీజేపీ సోషల్ మీడియా యాక్టివిస్టులు కౌంటర్ ఎటాక్ స్టార్ట్ చేశారు. మొత్తంగా ప్రధాని పర్యటన తెలంగాణాలో రాజకీయ చర్చకు దారి తీసినట్లు కనిపిస్తోంది.