బీజేపీ బలపడితే… టీఆర్ఎస్ చెరువులోని చేపలు గట్టు దాటడం ఎవరూ ఆపలేరంటున్న తెలంగాణా ఉద్యమకారుడు
ప్రజల్లో రోజురోజుకు నమ్మకాన్ని, గౌరవాన్ని కోల్పోతున్న ‘కేసీఆర్ ప్రాభవ క్షీణత’ను గమనించిన బీజేపీ సరైన సమయంలో తెలంగాణా రాష్ట్రాన్ని ‘ప్రయోగశాల’ గా మార్చుకుని, అదునుచూసి దెబ్బకొట్టే రాజకీయ వ్యూహపు కార్యాచరణకు శ్రీకారం చుట్టినట్లు తేటతెల్లంగా గోచరిస్తున్నది. ఆ అవకాశాన్ని అందించింది కేవలం కేసిఆరే !! 2014 ఎన్నికల్లో ప్రజలు తిరుగులేని విజయాన్ని అందించినా కూడా… పిచ్చి ఆలోచనలతో వేరే పార్టీలనుండి గెలిచిన వాళ్ళని రకరకాల పద్దతులతో పార్టీ మార్పించి చేర్చుకోవటంతో, ఆయన అనైతిక విధానాలు అర్థం చేసుకున్న ప్రజల్లో అసహ్యతకు బీజాలు పడ్డాయి.
తెలంగాణాను నిలువెల్లా దోచుకున్న, ఉద్యమాన్ని వ్యతిరేకించిన శక్తులకు రెడ్ కార్పెట్ పర్చటంతో ఆ అసహ్యం అసహనంగా మారింది. తనను నమ్ముకుని చివరివరకూ తోడుగా ఉన్న నిస్వార్థ ఉద్యమకారులను నిర్దాక్షిణ్యంగా రోడ్డుపై పడేసి, వీళ్ళు ఎవరేం చేస్తారులే అనే అహంకారం ఉద్యమకారుల్లో తీవ్రమైన అసంతృప్తికి కారణమైంది. ఏతా, వాతా కొందరికి పెద్ద పదవులిచ్చినా, చిన్నచిన్న పదవులు ఇచ్చినా కొంచెం కూడా నోరు తెరవని వీరభక్తులకే ఇచ్చాడు. నిరుద్యోగ సమస్యను తీర్చే ఏ కార్యక్రమాన్ని కూడా చేపట్టకపోవడం యువతలో తీవ్ర నిరాశకు కారణమైంది. ఉపాధి కల్పన లేకుండా పెన్షన్లు, రూపాయికే కిలో బియ్యం ఇచ్చి ఏ ఆటలైనా ఆడుకోవచ్చు అనే అమాయకపు అహంభావం కేసీఆర్ పతనానికి మార్గంగా మారింది.
కేవలం పాత భవనాలు కూల్చి, కొత్త భవనాలు కట్టడంలో పొందే ఆనందంలోని ఆంతర్యం జనానికి అర్థమైనా, ప్రతిపక్షాలు మొత్తుకున్నా ఆయనలో మార్పు రాలేదు. మేఘా కృష్ణారెడ్డి కోసమే తెలంగాణా వచ్చిందా? అనే స్థితి ఉత్పన్నమైంది. పన్నెండు వందల మందికి పైగా అమరుల త్యాగంతో, లక్షలాది మంది నిరంతర ఉద్యమంతో, సాగరహారం, మిలియన్ మార్చ్ వంటి కార్యక్రమాలతో రాష్ట్రం సిద్దించింది. అది మర్చిపోయి. కేవలం గుత్తేదారులు, గత దోపిడీదారులు , తెలంగాణా వ్యతిరేకులు మాత్రమే కేసీఆర్ కు సన్నిహితులుగా మారడం తెలంగాణ గుండెల్లో ఆరని మంటకు కారణమైంది . కాంగ్రెస్ కు సమాధి కట్టి అడ్డు లేకుండా ఎంతకాలమైనా పాలించొచ్చు అనే దురాశ కూడా ఇప్పుడు బీజేపీ రూపంలో ఇనుపగోడగా అడ్డు నిలిచింది. ఉద్యోగుల అవినీతిని ఏ మాత్రం నియంత్రించకుండా ఉత్త కబుర్లతో కాలం వెళ్లదీసుకుంటూ రావటంవల్ల జనం ఘోష కార్చిచ్చుగా మారింది. అయినా ఉద్యోగులు వ్యతిరేకంగానే ఉన్నారు, నిరుద్యోగ యువత వ్యతిరేకంగా ఉన్నారు. ఇప్పుడు ఎల్ఆర్ఎస్, ధరణి స్కీములు ముంచటానికి సిద్ధంగా ఉన్నాయి.
ముఖ్యంగా తన అవసరానికి ఎవరినైనా ఉపయోగించుకుని పని కాగానే చెత్తకుప్పలో విసిరేసే ధోరణి దేశంలోకెల్లా ‘నమ్మకం కోల్పోయిన నేత’ గా గుర్తింపు పొందడం మరోకారణం. విశ్వాసాన్ని కోల్పోయిన నాయకుల చరిష్మా కొంతకాలమే పనిచేస్తుందనే విషయం ఆయన మర్చిపోయారు. ప్రత్నామ్నాయ నాయకుడో, పార్టీనో దొరకక మౌనంగా ఉన్నవాళ్లకు ఇప్పుడు బీజేపీ కనబడుతోంది. ప్రస్తుత కేసీఆర్ స్థితి బీజేపీకి ఆయాచిత వరంగా మారింది. ఇప్పుడు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలుపు, ఓటమి సమస్య కాదు. ముందు ముందు రాబోయే ఎన్నికలే బీజేపీకి ప్రధానం. వాళ్ళు బలపడ్తున్నారు అనే సంకేతం కనబడితే… టీఆర్ఎస్ చెరువులో చేపలు గట్టు దాటడం ఎవరూ ఆపలేరు.
నీవు నేర్పిన విద్యయే నీరజాక్ష…!!
✍️ అర్వపల్లి విద్యాసాగర్, ఖమ్మం
(ఫేస్ బుక్ పేజీ నుంచి స్వీకరణ)