గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో రాజకీయ పార్టీలు ‘ఉచితం’ నినాదాన్ని ఎత్తుకున్న సంగతి తెలిసిందే. మంచినీళ్లు, కరెంటు, కరోనా వ్యాక్సిన్ వంటి అనేక అంశాలను రాజకీయ పార్టీలు ‘ఫ్రీ’గా నినదిస్తున్నాయి. మహిళలకు, దివ్యాంగులకు, వృద్ధులకు ఆర్టీసీ బస్సుల్లో, మెట్రో రైళ్లలో ఉచిత ప్రయాణ వసతి కల్పిస్తామని మరికొన్ని రాజకీయ పార్టీలు తమ మేనిఫెస్టోల్లో ప్రకటించిన విషయం విదితమే. ఈ ‘ఫ్రీ’ హామీలన్నీ ఎన్నికల్లో గెల్చిన తర్వాత మాత్రమే. సరే గెలిచేవారెవరు? ఓడేవారెవరు? ఉచిత హామీని నిలుపుకునేదెవరు? అనే అంశాల సంగతి గ్రేటర్ ఎన్నికలెరుగు.
కానీ ఎన్నికలకు ముందే జీహెచ్ఎంసీలోని అనేక మందికి అడక్కుండానే ఉచితంగా తెలుగు దినపత్రికలు వెడుతున్నాయట. అదెలా సాధ్యమంటారా? తెలుగు మీడియాలోని అనేక పత్రికలు వివిధ రాజకీయ పార్టీలకు అనుబంధ పత్రికలుగా పనిచేస్తున్న సంగతి తెలిసిందే కదా? ఒక్కో పత్రిక ఒక్కో పార్టీ రంగు పూసుకుని జీహెచ్ఎంసీ ఎన్నికల్లో శివాలెత్తుతూ మరీ రాస్తున్నాయ్ కూడా. మరి ఈ రాతలు ప్రజలకు చేరేదెలా? అదీ అసలు సందేహం. అందుకే అనేక పత్రికలు ‘ఉచిత’ బాట పట్టాయట. అడక్కుండానే అపార్టుమెంట్లలో, కాలనీల్లో వివిధ పత్రికలు వచ్చిపడుతున్నాయట. అసలే కరోనా, ఆపై పొద్దున్నే గిరాటున వచ్చిపడుతున్న పత్రికలను చూసి జీహెచ్ఎంసీలోని పలు ప్రాంతాల ప్రజలు నివ్వెరపోతున్నారట.
‘ఏయ్… బాబూ పేపర్ ఎవరు వేయమన్నారు? మాకు అక్కరలేదు. బిల్లు ఇవ్వం’ అని ఇంటి యజమానులు ముఖం మీదే చెబుతూ తిరస్కరిస్తుంటే.., ‘ఫరవాలేదు సార్. బిల్లు అడగం. డిసెంబర్ 1వ తేదీ వరకు మీకు పేపర్ ఫ్రీ…’ అనే సమాధానం పేపర్ బాయ్స్ నుంచి వస్తోందట. విషయం అర్థమైంది కదా! జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో తాము రంగులు పూసుకుని తిరుగుతున్న పార్టీల ప్రయోజనమే పరమావధిగా వివిధ పత్రికల యాజమాన్యాలు ఉచితంగా పత్రికలను సరఫరా చేస్తన్నాయట. ఒకానొక పత్రికైతే ప్రతిరోజూ అయిదు లక్షల కాపీలను అచ్చేసి ఉచితంగా ప్రజల నివాసాల్లో విసిరేస్తున్నదట. అంటే పత్రికల రెగ్యులర్ రేటు ప్రకారం దాదాపు రూ. 30.00 లక్షల విలువైన పత్రికలను ఉచితంగా పంచిపెడుతోందన్నమాట. కానీ వాటి ముద్రణకయ్యే ఖర్చును లెక్కేసుకుంటే మాత్రం దాదాపు కోటి రూపాయల మొత్తంగా అంచనా వేయాలి. ఎందుకంటే పత్రిక రెగ్యులర్ ధర వేరు, ముద్రణ ఖర్చు వేరు.
మరి ఈ పత్రికల ముద్రణకయ్యే ఖర్చు ఎవరు భరిస్తారని అమాయకంగా ప్రశ్నించకండి. ఏ పార్టీ ప్రయోజనం కోసం ఆ పత్రిక పనిచేస్తున్నదో, అదే పార్టీ ఖజానాకు బిల్లు వెడుతుందన్నమాట. ఇందుకు సంబంధించి ‘న్యూస్ ప్రింట్’ వాడకం వివరాలపై ఎన్నికల సంఘం కన్నేసి, ఆరా తీస్తే ఉచిత పత్రికల బాగోతం బట్టబయలవుతుందట. కొసమెరుపు ఏమిటంటే… ఎంత ఉచితంగా పంచిపెడుతున్నా సదరు పత్రికలు ‘ఇస్త్రీ మడత’లాగే ఇళ్ల ఆవరణలో ఉంటున్నాయట. ఉచితంగా వచ్చి పడుతున్న పత్రిక ముఖం కూడా పలువురు చూడడం లేదట.