ఔను… తెలంగాణా సీఎం కేసీఆర్ హిందుత్వానికి టీఆర్ఎస్ కరదీపికగా ప్రాచుర్యం పొందిన ‘నమస్తే తెలంగాణా’ పత్రిక తన వార్తా కథనం ద్వారా సర్టిఫికెట్ ఇచ్చినట్లు కనిపిస్తోంది. సాక్షాత్తూ శ్రీరాముని ‘మనుజ ధర్మంబు’ను అనుసరిస్తున్న పాలకునిగా కేసీఆర్ ను ఆ పత్రిక అభివర్ణించింది. అసలు ఈ దేశంలో శ్రీరామచంద్రుని మార్గాన్ని అనుసరిస్తున్న పాలకుడు ఎవరైనా ఉన్నారా? అంటే.., అన్ని వేళ్లూ చూపించేది తెలంగాణా వైపేనని, అందరి కళ్లూ చూసేది తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ నేనని ఆ పత్రిక వ్యాఖ్యానించింది. నిఖార్సయిన హిందుత్వానికి నిర్వచనంగా ముఖ్యమంత్రిని అభివర్ణించింది. తన దైవభక్తిని, ధార్మికతను ఏనాడూ దాచుకోని నేతగా కొనియాడింది.
జిల్లాలకు, ప్రాజెక్టులకు దేవుళ్ల పేర్లు పెట్టిన చారిత్రక నేపథ్యాన్ని వివరించింది. శబరిమలలో భక్తులకు కల్పించిన సౌకర్యాలను, చినజీయర్ స్వామితో గల అనుబంధాన్ని, తిరుమల వెంకన్నకు, వరంగల్ భద్రకాళి, విజయవాడ కనకదుర్గమ్మ, తిరుచానూరు పద్మావతి అమ్మవార్లకు, కురవి వీరభద్రస్వామికి సమర్పించిన ఆభరణాలను, కానుకలను సమర్పించిన ఘట్టాలను మరోసారి ఆవిష్కరించింది. యాదాద్రి దేవాాలయ పునర్ నిర్మాణపు వైభవాన్ని, సీఎం నిర్వహించిన అయుత చండీ, తదితర యాగాలను, అర్చకులకు అందిస్తున్న వేతనాలను ప్రత్యేకంగా ప్రస్తావించింది.
మొత్తంగా సీఎం కేసీఆర్ ను పరిపూర్ణ హిందువుగా పేర్కొంది. శృంగేరీ పీఠాధిపతి భారతీ తీర్థస్వామి, త్రిదండి చినజీయర్ స్వామి, విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేద్ర సరస్వతీ స్వాముల కితాబులను ప్రముఖంగా ప్రస్తావించింది. అంతిమంగా సీఎం కేసీఆర్ ను ‘నిలువెత్తు హిందుత్వం’గా శీర్షికరిస్తూ తొలిపేజీలో భారీ ఎత్తున ఇంట్రో ఇచ్చి, కలర్ ఫుల్ ఫోటోలతో మూడో పేజీని నింపేసింది.
సీఎం కేసీఆర్ ‘హిందుత్వం’ గురించి గులాబీ పార్టీ నేతల పత్రిక ఇప్పుడీ కథనాన్ని తన పాఠకులకు ప్రత్యేకంగా ఎందుకు అందించిందంటే…, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ప్రచారం యావత్తూ ‘మతం’ ప్రాతిపదికన సాగుతున్న సంగతి తెలిసిందే కదా? హిందూ ఓట్ల పోలరైజేషన్ కోసం బీజేపీ నేతలు తమదైన శైలిలో ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగానే తీవ్ర కసరత్తు చేస్తున్నారు. బహుషా ఈ పెనుప్రమాదాన్ని ‘నమస్తే తెలంగాణా’ పత్రిక గ్రహించింది కాబోలు. సీఎం కేసీఆర్ ను ‘నిఖార్సయిన హిందువు’గా ఫోకస్ చేసే ప్రక్రియలో భాగంగానే ‘నమస్తే తెలంగాణా’ పత్రిక అందించిన కథనమని పాఠకవర్గాలు అభివర్ణిస్తున్నాయి. వాస్తవానికి సీఎం కేసీఆర్ హిందుత్వం గురించిగాని, ఆయన చేసే యజ్ఞ, యాగాదుల గురించిగాని ఎవరికీ ఎటువంటి సందేహం లేదు. కానీ ‘నమస్తే తెలంగాణా’ ఇప్పుడే ఈ విషయాన్ని కొత్తగా చెబుతున్నట్లు ఇంత భారీ ఎత్తున సీఎం ‘హిందుత్వాన్ని’ ఫోకస్ చేయడం దేనికి? అనేది అసలు ప్రశ్న. అంతా గ్రేటర్ ఎన్నికల ప్రచారపు మహిమ కదూ!
అంతా బాగానే ఉందిగాని, మరీ ఇంతలా సీఎం ‘హిందుత్వం’ గురించి ఫోకస్ చేస్తే, ఇతర మతాల ఓట్లకు ఏదేని ఇబ్బంది కలిగితే ఎలా? ఇదీ టీఆర్ఎస్ వర్గాల సందేహమే సుమీ. ఈ ‘లాజిక్’ను ‘నమస్తే తెలంగాణా’ పత్రిక బాధ్యులు మర్చిపోలేదు కదా! ఎందుకైనా మంచిది ఇతర మతాలను కూడా సీఎం కేసీఆర్ గౌరవించిన తీరును మరో రెండు ప్రత్యేక వార్తా కథనాల ద్వారా రేపు, ఎల్లుండి అందిస్తే ‘బ్యాలెన్స్’ అవుతుందని ఆ పార్టీ వర్గాలే అభిప్రాయపడుతున్నాయి.