జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచార బాధ్యతల నుంచి బీజేపీ తెలంగాణా అధ్యక్షుడు బండి సంజయ్ ను తప్పించారా? తక్షణమే ప్రచార బాధ్యతలను కేంద్ర హోంశాఖ మంత్రి కిషన్ రెడ్డికి అప్పగించాలని ఆర్డర్ ఇచ్చారా? ఈ అంశంపై సోషల్ మీడియాలో సాగుతున్న దుష్ప్రచారంపై బీజేపీ తెలంగాణా శాఖ క్లారిటీ ఇచ్చింది.
బీజేపీ భయంతో గత్తరపడి వక్రమార్గంలో గెలిచేందుకు అసత్య వార్తలనే ఎజెండాగా చేసుకుని టీఆర్ఎస్ పార్టీ తన సోషల్ మీడియా వింగ్ ద్వారా ప్రజల్లో విషం నూరిపోస్తోందని బీజేపీ తెలంగాణా శాఖ ట్విట్టర్ ఖాతాలో ఆరోపించింది. బీజేపీని ఎదుర్కునే దమ్ము లేక సమాజాన్ని తప్పుదోవ పట్టిస్తోందని విమర్శించింది. ఇందుకు సంబంధించి రెండు పోస్టులను ఉటంకిస్తూ, వాటిని ‘ఫేక్ న్యూస్’గా కొట్టి పారేసింది.
ఇదిలా ఉండగా ఈ విషయంలో తన పేరుతో కొందరు మార్ఫింగ్ కంటెంట్ సర్క్యులేట్ చేస్తున్నారని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు. ఆయా కంటెంట్ తో తనకు సంబంధం లేదని కూడా ఆయన స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించిన బీజేపీ తెలంగాణా శాఖ, ఎమ్మెల్యే రాజాసింగ్ చేసిన ట్వీట్లను దిగువన చూడవచ్చు.