‘దింపుడు కల్లం‘ ఆశ అంటుంటారు తెలుసు కదా! మనిషి చనిపోయినపుడు అంత్యక్రియలకు తీసుకువెడుతున్న సమయంలో మార్గ మధ్యంలో పాడె దింపుతారు. మృతి చెందిన వ్యక్తి తాలూకు ఆప్తులందరూ శవం చెవిలో ‘వరుస’ పెట్టి గట్టిగా పిలుస్తారు. ఏమో? బతికే ఉన్నారేమోననే ఆశ. జీవించి ఉంటే తమ పిలుపునకు పలికితే అంత్యక్రియలు నిలిపివేసి, తిరిగి ఇంటికి తీసుకువెళ్లవచ్చనే చివరి ప్రయత్నం. కానీ అవేవీ జరగవు. ప్రాణం ఉండదు. శవం పలకదు. ఆశ నెరవేరదు. కానీ చివరి ప్రయత్నం చేయడం మనిషి నైజం.
ఇదిగో నిర్భయ ఘటన దోషుల్లో ఒకడికి చివరి ఆరేడు రోజుల్లో తన ప్రాణం మీద అచ్చం ఇలాంటి ఆశే కలిగినట్లుంది. ఓవైపు ఉరి తాళ్లు సిద్ధమవుతున్నాయి. బీహార్ బక్సర్ జైల్లో పేనిన ఉరి తాళ్లను అధికారులు తీసుకువస్తున్నారు కూడా. ఇంకోవైపు దోషుల మెడకు ఉరి బిగించేందుకు తలార్లు కూడా తాము రెడీగా ఉన్నామంటున్నారు. ఉరి కంబంపై అమలు చేసే శిక్ష గురించి ట్రయల్స్ కూడా నిర్వహిస్తున్నారు. దోషుల బరువు, ఎత్తున్న దిష్టి బొమ్మలకు డమ్మీ ఉరి తీసి కూడా చూశారు. దేశ రాజధాని ఢిల్లీలో 2012 డిసెంబర్ 16న అర్థరాత్రి బస్సులో ఆరుగురు వ్యక్తులు మూకుమ్మడిగా ఓ యువతిపై అత్యాచారం చేయడమేగాక, దారుణంగా హింసించిన కారణంగా ఆమె కొన్నాళ్లపాటు మృత్యువుతో పోరాడి సింగపూర్ అసుపత్రలో మరణించిన సంగతి తెలిసిందే. నిర్భయ ఘటనగా వ్యవహరిస్తున్న ఈ ఘోర ఉదంతంలో ఆరుగురు నిందితుల్లోఒకడు బాల నేరస్థుడు కాగా, మరో వ్యక్తి రామ్‌సింగ్ 2013 మార్చిలో తిహార్ జైల్లోనే ఆత్మహత్య చేసుకున్నాడు. మిగిలిన నలుగురు ఊచలు లెక్కపెడుతున్నారు. వీరిలో వినయ్‌శర్మ, అక్షయ్ ఠాకూర్, ముకేష్ సింగ్, పవన్ గుప్తా జైల్లో ఉన్నారు. చట్టపరంగా ఉన్న అవకాశాలన్నీ అయిపోయాయని, కావాలంటే చివరి ప్రయత్నంగా రాష్ట్రపతి క్షమాభిక్ష కోసం ప్రయత్నించుకోవచ్చని ఈ నలుగురికి గత అక్టోబరు 29న జైలు వర్గాలు తెలిపాయి. వీరిలో వినయ్ ఒక్కడే అర్జీ పెట్టుకోగా దానిని తిరస్కరించాలని ఢిల్లీ ప్రభుత్వం, కేంద్ర కేబినెట్ కూడా ఇటీవలే రాష్ట్రపతికి సిఫార్సు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై హోంశాఖతో సంప్రదించి, రాష్ట్రపతి నిర్ణయం తీసుకుంటారు. గతంలో ముగ్గురితో కలిసి సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేయని అక్షయ్ ఠాకూర్ సోమవారం తన మరణశిక్ష తీర్పును పునః సమీక్షించాలని అభ్యర్థిస్తూ పిటిషన్ దాఖలు చేశాడు. గతంలో మిగిలిన ముగ్గురు దాఖలు చేసిన ఇలాంటి పిటిషన్లను సుప్రీంకోర్టు తిరస్కరించింది.
ఈ పరిస్థితుల్లోనే నిర్భయ దోషుల ఉరి తీతకు సర్వం సిద్ధం చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. కానీ నిర్భయ ఘటన దోషుల్లో ఒకడైన అక్షయ్ ఠాకూర్ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన రివ్యూ పిటిషన్ లో పేర్కొన్న కారణాలు విచిత్రంగా ఉండడం గమనార్హం. ఉరిశిక్ష విషయంలో మరోసారి సమీక్షించాలని కోరుతూ, వాయు కాలుష్యం వల్ల ఢిల్లీ మెట్రోనగరం గ్యాస్ ఛాంబర్ మాదిరిగా తయారైందని, ఇక్కడ నీరు, గాలి విషపూరితమైందని పేర్కొన్నాడు. ఢిల్లీలో ఇటువంటి కాలుష్య పరిస్థితులు ప్రజలందరికీ తెలుసని, ఓవైపు ఆయుష్షే తగ్గిపోతుంటే ఇంకా ఉరి శిక్ష దేనికి? అని అక్షయ్ ఠాకూర్ తన పిటిషన్లో ప్రశ్నించడం గమనార్హం. మరో ఆరు రోజుల్లో అంటే ఈనెల 16వ తేదీన నిర్భయ దోషులను ఉరి తీస్తారని వార్తలు వస్తున్న పరిస్థితుల్లో, చేసిన తప్పునకు ప్రాణం పోక తప్పదని తెలిసీ, అక్షయ్ ఠాకూర్ దాఖలు చేసిన పిటిషన్‌లోని పిచ్చి కారణాలు ‘దింపుడు కల్లం’ ఆశను గుర్తుకు చేయడం లేదూ!