‘సీసీ కెమెరాలు నేరాలకు దోహదం చేయును. ఈ విషయాన్ని ‘రాష్ట్ర’ పోలీస్ కమిషనర్ వీబీ కమలాసన్ రెడ్డి చెప్పెను. ఇప్పటి వరకు అనేక కేసులను ఏర్పాటు చేశామని కూడా ఆయన చెప్పెను.’
అసలు ఈ గ్రాంథిక భాష ఏమిటి? సీసీ కెమెరాలు నేరాలకు దోహదం చేయడమేంటి? రాష్ట్ర స్థాయిలో పోలీస్ కమిషనర్ ఉంటారా? అని సందేహిస్తున్నారా? వాస్తవానికి సీసీ కెమెరాలు నేర నియంత్రణకు దోహదం చేస్తాయనేది వాస్తవం. కమిషనరేట్ స్థాయిలో మాత్రమే పోలీస్ కమిషనర్ ఉంటారు. రాష్ట్ర స్థాయిలో డీజీపీ ఉంటారు. మరి ఈ వాక్యనిర్మాణం, హోదా సంబోధన సంగతేమిటి? అంటే… కరీంనగర్ పోలీస్ కమిషనర్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ (పీఆర్వో) కొద్దిసేపటి క్రితం విడుదల చేసిన పత్రికా ప్రకటనలోని సిత్రాలివి.
శాంతి భద్రతలను పరిరక్షించే పోలీసు శాఖకు, అందునా పోలీస్ కమిషనర్ స్థాయిలో పీఆర్వో విధులు నిర్వహించే వ్యక్తులు అప్రమత్తంగా లేకుంటే జరిగే పరిణామాలు ఇలాగే ఉంటాయ్ మరి. ఏదో ఒకటీ, అరా మిస్టేక్స్ ఉంటే ఫరవాలేదు. అక్కడక్కడా అక్షర దోషాలు ఉంటే సర్దుకోవచ్చు. కానీ, కరీంనగర్ పోలీస్ కమిషనర్ పీఆర్వో జారీ చేసిన ఈ పత్రికా ప్రకటనలో ఇంకా చాలా ‘విషయం’ ఉందండోయ్. డౌటుంటే దిగువన ఆయన జారీ చేసిన పత్రికా ప్రకటనకు సంబంధించిన స్క్రీన్ షాట్ ను యథాతథంగా చదువుకోండి. ఇంతటి ‘భావ దరిద్ర’ పత్రికా ప్రకటనను కరీంనగర్ పోలీస్ పీఆర్వో ఎలా జారీ చేశారనే సందేహం మీకూ కలగక మానదు. ఈ ప్రకటనను చదవకుండా ఉన్నది ఉన్నట్లుగా క్రైం రిపోర్టలర్లు కట్, పేస్ట్ చేస్తే…? పీఆర్వో దయ… విలేకరుల ప్రాప్తం సంగతి వదిలేయండి. కమిషర్ స్థాయి సీసీ ఇలా ప్రసంగించారా? అని ప్రజలు నవ్వుకునే ప్రమాదం లేదూ!