సీఎం కేసీఆర్ పై మండిపడ్డ బండి సంజయ్
తెలంగాణా సీఎం కేసీఆర్ పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. శనివారం సంజయ్ మీడియాతో మాట్లాడుతూ, టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు బండి సంజయ్ ఇంకా ఏమంటున్నారంటే…
‘‘కేసీఆర్ కు బీజీపీ అంటే భయం పట్టుకుంది. ఊపర్ షేర్వానీ.. అందర్ పరేషానీ అన్నట్లుగా వ్యవహరిస్తున్నాడు. బీజేపీపై తప్పుడు ఆరోపణలు చేస్తున్న కేసీఆర్ ను ప్రమాణం చేసేందుకు భాగ్యలక్ష్మీ ఆలయానికి రమ్మని సవాల్ చేస్తే తోకముడిచాడు. కేసీఆర్, ఓ వర్గం ఓట్ల కోసం తాపత్రయపడి దారుస్సలాం, మక్కామసీద్ కు వెళ్తాడు. కానీ, హిందూ దేవాలయాలకు రావడానికి మాత్రం సంకోచిస్తారా..?
చార్మినార్ వద్దనున్న భాగ్యలక్ష్మీ ఆలయానికి నేను ఎందుకు వెళ్లకూడదు..? అసలు భాగ్యనగర్ అని పేరు వచ్చిందే భాగ్యలక్ష్మి దేవాలయం పేరు మీద. అలాంటి భాగ్యలక్ష్మి గుడి దగ్గరకి ఎందుకు పోకూడదు. అది ఏమన్నా పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ లలో ఉందా ?’’ అని సంజయ్ ప్రశ్నించారు.
‘‘టీఆర్ఎస్ నేతలకి సవాల్ విసురుతున్నా, ఏ గుడికి రమ్మంటారో చెప్పండి. ఎవరు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారో, ఎవరు తప్పు చేశారో అందరికీ తెలుసు. వరద సాయంపై ఈసీకి మేం లేఖ రాయలేదు.
నా సంతకాన్ని ఫోర్జరీ చేయించి అవాస్తవాలను ప్రజల్లోకి తీసుకెళ్లారు. బీజేపీని చూసి సీఎం కేసీఆర్ భయపడి, దొంగ లేఖ సృష్టించారు. ఇదంతా టీఆర్ఎస్ కుట్రలో భాగమే. బీజేపీని అప్రతిష్టపాలు చేయాలనే దురుద్దేశంతోనే అసత్య ఆరోపణలు చేస్తున్నారు. దుబ్బాక ఎన్నికల సందర్భంగా ఓ ఛానల్ లోగో మార్చి, విషప్రచారానికి దిగారు. లేఖ ఎవరు రాశారు, ఎవరు ప్రింట్ చేశారు అనే అంశంపై విచారణ చేయొచ్చు కదా. చిన్న చిన్న వాటికే దర్యాప్తు జరిపి అరెస్ట్ చేస్తున్న మీరు, ఈ విషయంలో నిర్లక్ష్యం ఎందుకు..?’’ అని సంజయ్ నిలదీశారు.
‘‘టీఆర్ఎస్కు ఓటు వేస్తే ఎంఐఎంకు వేసినట్లే. మజ్లిస్ ఎట్లా చెబితే, కేసీఆర్ అలా ఆడుతున్నారు. హైదరాబాద్‌లో 40 వేలకు పైగా రోహింగ్యాలు ఉన్నారు. వాళ్లని ఇక్కడ నుంచి పారదోలుదామా లేదా..? రోహింగ్యాలను ఓటర్ లిస్ట్‌లోకి చేర్చింది ఎంఐఎం పార్టీనే. వాళ్ల ఓట్లు టీఆర్ఎస్, ఎంఐఎంకు మాత్రమే. ఉగ్రవాద సంస్థలతో సంబంధం వున్న వ్యక్తులతో సానుకూలంగా వ్యవహరిస్తూ, వాళ్ల ఓట్ల కోసం కక్కుర్తిపడి వాటి ద్వారానే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలవాలని చూస్తున్న మీరు సెక్యులర్ వాదులు..దేశభక్తులా..?’’ అని బండి సంజయ్ ప్రశ్నించారు.
‘‘నగరంలో హిందువులను వెల్లగొట్టడమే టీఆర్ఎస్, మజ్లిస్ లక్ష్యమా? రోహింగ్యాల విషయంలో మీరు మాట్లాడినప్పుడు.., 80 శాతం ఉన్న హిందువుల గురించి మేం మాట్లాడితే తప్పా?
బంగ్లాదేశ్, పాకిస్థాన్, అఫ్ఘనిస్తాన్ వంటి దేశాల్లో ఉన్న హిందువుల రక్షణ కోసం తీసుకొచ్చిన CAA ను కేసీఆర్ వ్యతిరేకిస్తున్నారు.
ఇదే సమయంలో హైదరాబాద్ లో ఉన్న విదేశీయుల గురించి ఎందుకు మాట్లాడటం లేదు? పాతబస్తీ నుంచి బకాయిలు వసూలు చేసిన తరువాతే టీఆర్ఎస్ ఓట్లు అడగాలి. బీజేపీని కంట్రోల్ చేసే శక్తి ఎంఐఎం, టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు లేదు. మేం ప్రజల కంట్రోల్ లో మాత్రమే ఉంటాం. మిమ్మల్ని కంట్రోల్ చేయడానికి ప్రజలు మమ్మల్ని ఆదరిస్తున్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీని గెలిపిస్తే గతంలో రూ.10 వేలు పొందిన వరద బాధితులకు అదనంగా ఇస్తాం. ఒకవేళ ఎంఐఎంకు మేయర్ పీఠం కట్టబెడితే హిందువులను ఆలయాలకు కూడా వెళ్ళనివ్వరు. వీరి కుట్రను గ్రహించి జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఓటు వేయాలి.’’ అని బండి సంజయ్ మీడియా సమావేశంలో కోరారు.