అనూహ్యంగా చోరీకి గురైన ఓ కంటైనర్ ను ఖమ్మం జిల్లా పోలీసులు గంట వ్యవధిలోనే పట్టుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం… గతరాత్రి హైద్రాబాద్ నుండి విశాఖపట్నం వెళ్తూ.. సత్తుపల్లిలోని రివిగో లారీ ట్రాన్స్పోర్ట్ కార్యాలయం వద్ద కంటైనర్ ను దాని డ్రైవర్ తిరుపతయ్య డ్యూటీ మారేందుకు నిలిపాడు. అయితే కొద్ది సేపటికే కంటైనర్ కనిపించకుండా పోవడంతో కంగారు పడిన లారీ ట్రాన్స్ పోర్ట్ ఎగ్జిక్యూటివ్ మేనేజర్ సత్తుపల్లి పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు. వెంటనే స్పందించిన సత్తుపల్లి పోలీసులు ప్రధాన రహదారుల వెంట గల అన్ని పోలీసు స్టేషన్లకు చోరీకి గురైన కంటైనర్ వివరాలు అందించి అప్రమత్తం చేశారు.
ఆ తర్వాత పట్టణంలోని అన్ని సీసీ టీవీ పుటేజ్ లను పరిశీలించిన పోలీసులు లారీని దొంగలించేందుకు అవకాశం కోసం ఎదురు చూస్తూ, దాన్ని తీసుకెళ్తున్న నిందితున్ని గుర్తించి, సత్తుపల్లి మండలం బుగ్గపాడు వద్ద అదుపులోకి తీసుకొని లారీని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు దమ్మపేట మండలం ముకుందాపురానికి చెందిన ట్రాక్టర్ డ్రైవర్ సౌలం రాజేంద్రరావుగా గుర్తించి అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.
నెస్లే కంపెనీ ఉత్పత్తుల లోడ్ తో వెళ్తున్న లారీ కంటైనర్ విలువ సుమారు 32 లక్షల వరకు ఉంటుందని సత్తుపల్లి సీఐ రమాకాంత్ తెలిపారు. సత్తుపల్లి పట్టణంలో ప్రజలు స్వచ్ఛందంగా ఏర్పాటు చేసుకున్న సీసీ కెమెరాల ఆధారంగానే కంటైనర్ చోరీ కేసును గంట వ్యవధిలో తాము ఛేదించగలిగినట్లు ఈ సందర్భంగా సీఐ వివరించారు. ఘటనపై వేగంగా స్పందించి ఛేదించిన సత్తుపల్లి సీఐని, హెడ్ కానిస్టేబుల్ చెన్నారావు, హోంగార్డులు ప్రవీణ్,
రాజు, రాములులను పోలీసు కమిషనర్ తఫ్సీర్ ఇక్బాల్, అదనపు డీసీపీ (లా&ఆర్డర్) మురళీధర్, అదనపు డీసీపీ (అడ్మిన్) ఇంజరాపు పూజ అభినందించారు.