మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మరోసారి పోలీసులను ఆశ్రయించారు. సోషల్ మీడియాలో తనపై జరుగుతున్న దుష్ప్రచారంపై ఆయన ఖమ్మం పోలీస్ కమిషనర్ తఫ్సీర్ ఇక్బాల్ ను కొద్దిసేపటి క్రితం స్వయంగా కలిసి ఫిర్యాదు చేశారు. తాను పార్టీ మారుతున్నట్లు గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో దుష్ప్రచారానికి పాల్పడుతున్నారని, తనపై వ్యక్తిగత దూషణలకు పాల్పడుతున్నవారిపై చర్యలు తీసుకోవాలని తుమ్మల అభ్యర్థించారు.
తనను లక్ష్యంగా చేసుకుని దుష్ప్రచారానికి పాల్పడుతున్న అయిదుగురి పేర్లను కూడా ఉటంకిస్తూ, ఆధారాలను సమర్పిస్తున్నట్లు పోలీస్ కమిషనర్ కు ఇచ్చిన ఫిర్యాదులో తుమ్మల వెల్లడించారు. సోషల్ మీడియాలో తనపై జరుగుతున్న దుష్ప్రచారంపై గత డిసెంబర్ 31వ తేదీన కూడా తుమ్మల పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాజాగా మరోసారి పోలీసులను ఆశ్రయించి తుమ్మల చేసిన మరో ఫిర్యాదు ప్రతిని దిగువన చూడవచ్చు.
UPDATE:
చేతగాక కాదు… విలువల కోసం: తుమ్మల
కాగా తాను పార్టీ మారుతున్నట్లు సోషల్ మీడియాలో జరుతున్న దుష్ప్రచారం కేవలం తనను రాజకీయంగా అభాసుపాలు చేయడానికేనని తుమ్మల నాగేశ్వరావు అన్నారు. పోలీస్ కమిషనర్ కు ఫిర్యాదు చేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఇటువంటి తప్పుడు ప్రచారాలతో తన వ్యక్తిత్వాన్ని దెబ్బతీయలేరని వారు గ్రహించాలన్నారు. తాను ఎప్పుడూ పార్టీకి, పార్టీ నిర్ణయానికి బద్ధుడనై ఉన్నానే తప్ప, వ్యతిరేక కార్యక్రమాలను ప్రోత్సహించలేదన్నారు. ఇటువంటి తప్పుడు చర్యల ద్వారా ఏదో లబ్ది పొందుతామంటే అది ఎప్పటికీ సాధ్యం కాదని వారు గ్రహించాలన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఎప్పుడూ నమ్మకస్తుడిగా ఉన్నానే తప్ప, ఎప్పుడూ పార్టీ లైన్ తప్పలేదన్నారు. పూర్తిగా అవాస్తవాలను తమ రాజకీయ లబ్దికోసం తనపై దుష్ప్రచారాన్ని చేయడం బాధాకరమన్నారు. ఇది రాజకేయాలలో నీచమైన నికృష్టమైన చర్యగా ఆయన అభివర్ణించారు. తాను కేవలం జిల్లా అభివృద్ధి కోసమే పని చేశాను తప్ప, వ్యక్తిగత అభివృద్ధి కోసం పనిచేయలేదన్నారు. అన్ని జిల్లాలతో పాటుగా ఖమ్మం జిల్లా అభివృద్ధి జరగాలని ముఖ్యమంత్రి కేసీఆర్ తనను పార్టీలోకి ఆహ్వానించారని, అలాంటి అవకాశాన్ని తనకు శక్తి ఉన్నంతవరకు జిల్లా అభివృద్ధికోసం పనిచేశానని చెప్పారు. ఖమ్మం జిల్లాకు మిగతా జిల్లాల కన్నా మిన్నగా ఉంచేందుకు తన శక్తి వంచన లేకుండా పని చేశానని, కానీ కొంతమంది చేసే దుష్ట చర్యల వల్ల పార్టీకి, జిల్లా ప్రజలకు నష్టం జరుగుతుందన్నారు. తనకు రాజకేయాలు తెలియక నో, చేతకాకనో కాదని, విలువల కోసం పనిచేశానని తుమ్మల నాగేశ్వరరావు అన్నారు.