గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల పోరులో ‘లెక్కల’ ప్రకారం మేయర్ సీటు దక్కించుకోవడం అధికార టీఆర్ఎస్ పార్టీకి అసాధ్యమేమీ కాదు. చాలా సింపుల్ కూడా. గణాంక వివరాలు కూడా అదే చెబుతున్నాయ్. జీహెచ్ఎంసీలో మొత్తం 150 డివిజన్లు ఉండగా, గత ఎన్నికల్లో 99 డివిజన్లలో టీఆర్ఎస్ విజయఢంకా మోగించింది. మరో 44 డివిజన్లలో ఎంఐఎం, నాలుగింట బీజేపీ, రెండింట కాంగ్రెస్, ఒక డివిజన్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు.
గడచిన అయిదేళ్లలో జరిగిన అసెంబ్లీ, పార్లమెంట్, రాజ్యసభ, ఎమ్మెల్సీ ఎన్నికలను ప్రామాణికంగా తీసుకున్నపుడు, తాజా లెక్కల ప్రకారం జీహెచ్ఎంసీలో 52 మంది ఎక్స్ అఫీషియో సభ్యులు ఉన్నారు. వీరందరికీ మేయర్ ఎన్నికల్లో ఓటు హక్కు ఉంటుంది. దీంతో జీహెచ్ఎంసీలో మొత్తం సభ్యుల సంఖ్య 202. అంటే ఏ పార్టీ అయినా మేయర్ స్థానాన్ని కైవసం చేసుకోవడానికి మేజిక్ ఫిగర్ 102 మంది సభ్యులు. అధికార పార్టీకి చెందినవారే ప్రస్తుతం 37 మంది ఎక్స్ అఫీషియో సభ్యులు ఉన్నారు. మేయర్ పీఠాన్ని దక్కించుకోవడానికి ఎవరితోనూ పొత్తు అవసరం లేదనుకుంటే టీఆర్ఎస్ మరో 65 డివిజన్లలో కార్పొరేటర్లను గెలిపించుకుంటే చాలు. మేయర్ పీఠం దక్కినట్లే. ఎంఐఎంతో పొత్తు లేదా అవగాహన, ఇవీ కావనుకుంటే స్నేహపూర్వక మద్ధతు ఉంటే ఈ లెక్కల సంఖ్య ఇంకా తగ్గుతుంది. ఇటువంటి పరిస్థితుల్లో గత ఎన్నికల్లో 99 డివిజన్లలో విజయం సాధించిన టీఆర్ఎస్ ఈసారి 65 స్థానాలను దక్కించుకుని మేయర్ పీఠాన్ని అధిష్టించలేదా? ఇదీ తాజా ప్రశ్న.
కానీ అధికార పార్టీ నేతలు జీహెచ్ఎంసీ ఎన్నికలను అంత సులభంగా తీసుకుంంటున్న దాఖలాలు కనిపించడం లేదు. ఏకంగా సీఎం కేసీఆర్ రంగంలోకి దిగినట్లు కనిపిస్తోంది. ఇందులో భాగంగానే మరికొద్ది గంటల్లో పార్లమెంటరీ, శాసనభా పక్ష సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. గ్రేటర్ మేయర్ పీఠాన్ని దక్కుంచుకునే వ్యూహంలో భాగంగానే ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అధికార పార్టీ చీఫ్, సీఎం కేసీఆరే స్వయంగా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం గమనార్హం. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో విజయానికి అనుసరించాల్సిన వ్యూహాలపై పార్టీ నేతలకు సీఎం దిశా, నిర్దేశం చేయనున్నారు. ఇదే దశలో సీఎం కేసీఆర్ కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొనే అవకాశం ఉందని, ఆయన సభలకు సంబంధించి కూడా ఈ సమావేశంలో చర్చిస్తారని సమాచారం.
రాష్ట్ర రాజధాని కేంద్రమైన హైదరాబాద్ నగరపాలక సంస్థకు జరుగుతున్న ఈ ఎన్నికలను అధికార పార్టీ ఎందుకింత సీరియస్ గా తీసుకుంటున్నది? సాక్షాత్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి పార్లమెంటరీ, శాసనసభా పక్ష నేతలతో సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి గల ప్రత్యేక కారణాలేమిటి? జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచార సభల్లో కేసీఆర్ పాల్గొంటారా? ఇవీ ప్రశ్నలు. గ్రేటర్ మేయర్ పీఠాన్ని గెల్చుకునేందుకు సానుకూల ఫలితాన్నిచ్చే ఎక్స్ అఫీషియో సభ్యుల బలం భారీగానే ఉన్నప్పటికీ, అధికార పార్టీ ఎందుకింత హైరానా పడుతోందనే అంశంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కేవలం నాలుగు స్థానాల్లో గెలుపొందిన బీజేపీ టీఆర్ఎస్ పార్టీ నేతలను అంతగా కలవరానికి గురి చేస్తున్నదా? అనే సందేహాలు కూడా ఈ సందర్భంగా వ్యక్తమవుతున్నాయి.
వాస్తవానికి దుబ్బాక ఉప ఎన్నికల్లో విజయం సాధించిన బీజేపీ నేతలు జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ సమరోత్సాహంతో ఉన్నారు. దుబ్బాక రిజల్ట్ జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ రిపీట్ అవుతుందనే ధీమాను వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ నిఘా వర్గాల అంచనా ప్రకారమే దాదాపు 40 డివిజన్లలో బీజేపీ అభ్యర్థుల గెలుపునకు అవకాశం ఉందట. కానీ తమ సర్వే లెక్కల అంచనా ప్రకారం ఆ సంఖ్య అరవై వరకు ఉందని బీజేపీ నేతలు అంతర్గత సమావేశాల్లో పార్టీ కేడర్ కు స్పష్టం చేస్తున్నారు. ఇంకాస్త కష్టపడితే మేయర్ పీఠాన్ని దక్కించుకోవడం కష్టమేమీ కాదని పేర్కొంటూ, పార్టీ శ్రేణులను కదన రంగంలోకి కార్యోన్ముఖులను చేస్తున్నారు. ఎవరి లెక్కల సంగతి ఎలా ఉన్నప్పటికీ జీహెచ్ఎంసీ ఎన్నికల విషయంలో అధికార టీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు కాంగ్రెస్ ను చూసి కంగారు పడడం లేదనేది మాత్రం వాస్తవం. బీజేపీ దూకుడుకు కళ్లెం వేసేందుకే తాపత్రయపడుతున్నదని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. గత ఎన్నికల్లో నాలుగు స్థానాలకు పరిమితమైన బీజేపీ ఈసారి కనిష్టంగా నలభై స్థానాలు గెల్చినా తెలంగాణా రాజకీయాల్లో మున్ముందు పెనుమార్పులకు దారి తీస్తుందనే అంచనాలు ఉండనే ఉన్నాయి.
ఈ నేపథ్యంలోనే బీజేపీ దూకుడుకు కళ్లెం వేసేందుకు టీఆర్ఎస్ చీఫ్, సీఎం కేసీఆర్ నేరుగా రంగంలోకి దిగారంటున్నారు. జీహెచ్ఎంసీలో ఆ పార్టీ విజయావకాశాలను గట్టిగా దెబ్బ తీయకుంటే రాజకీయంగా మున్ముందు మరిన్ని కష్టాలు తప్పవని టీఆర్ఎస్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. అందువల్లే జీహెచ్ఎంసీ ఎన్నికలను టీఆర్ఎస్ ఈసారి తేలిగ్గా తీసుకోవడం లేదుట. మరోవైపు బీజేపీ కూడా తనదైన శైలిలో అధికార పార్టీ వ్యూహాలకు ప్రతి వ్యూహాలను సిద్ధం చేస్తున్నది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా తన సన్నిహితులతో జీహెచ్ఎంసీ ఎన్నికల కోసం ప్రత్యేక కమిటీని నియమించారు. మొత్తంగా తెలంగాణా రాజకీయ తెరపై గ్రేటర్ ఎన్నికల పోరు అత్యంత రసవత్తర దృశ్యాలను ఆవిష్కరిస్తోంది.