ఒకే ఇంట్లో ఐదుగురి మృతదేహాలు కనిపించడం పొరుగున గల ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలో కలకలం సృష్టించింది. ఘటనపై తీవ్రంగా స్పందించిన ఆ రాష్ట్ర హోం మంత్రి తమరా ధ్వాజ్ సాహు వెంటనే స్పందించి, దర్యాప్తునకు ఆదేశించారు. రాయపూర్ జిల్లా రాజిమ్ పక్కనే గల కేంద్రీ గ్రామంలో ఈ సంఘటన వెలుగు చూసింది.
ఓ ఇంటి నుంచి నిరంతరాయంగా నీరు ప్రవహిస్తుండడాన్ని చూసిన స్థానికులకు అనుమానం కలిగింది. చుట్టుపక్కల వారు కొందరు ఇంటి కిటికీని తెరిచి చూడగా, ఆ ఇంటి యజామని కమలేష్ సాహు (35) ఉరికి వేలాడుతూ కనిపించాడు. అదే సమయంలో అతని భార్య ప్రమీలా సాహు (30), తల్లి లలితా సాహు (60), ఇద్దరు పిల్లలు నరేంద్ర కుమార్ సాహు (8), కీర్తి సాహు (10)లు మంచం మీద పడుకుని కనిపించారు. కానీ ఇద్దరు చిన్నారుల నోటి నుంచి నురుగు రావడాన్ని స్థానికులు చూశారు. వెంటనే డయల్ 112 ద్వారా పోలీసులకు సమాచారం అందించారు.
సంఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు ఉరికి వేలాడుతూ కనిపించిన కమలేష్ నుంచి సూసైడ్ నోట్ ను స్వాధీనం చేసుకున్నారు. పంచనామా అనంతరం ఫోరెన్సిక్ నిపుణులు మరిన్ని అనుమానిత వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. దీపావళి అనంతరం ఈ ఘోరం జరిగినట్లు అనుమానిస్తున్నారు. అయితే ఇవి హత్యలా? ఆత్మహత్యలా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.