అశ్వత్థామరెడ్డి గుర్తున్నారు కదా? ఔను… ఆర్టీసీ కార్మిక సంఘ నాయకుడు అశ్వత్థామరెడ్డే. ఆర్టీసీ సమ్మె సందర్భంగా ఆయన తెలంగాణా సీఎం కేసీఆర్ ఆగ్రహానికి గురైన నేపథ్యం అందరికి తెలిసిందే. కొద్ది సేపటి క్రితం అశ్వత్థామరెడ్డి తెలంగాణా బీజేపీ హైదరాబాద్ నగర కార్యాలయంలో ప్రత్యక్షమయ్యారు. ఆయన బీజేపీలో చేరుతున్నారనే ప్రచారం నేపథ్యంలో ఈ దృశ్యం సాక్షాత్కరించడం విశేషం.
జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో ‘ఆపరేషన్ ఆకర్ష్’ను బీజేపీ నేతలు వేగవంతం చేశారు. హైదరాబాద్ నగరంలోని బీజేపీ ఆఫీసు కేంద్రంగానే ఆ పార్టీ నేతలు మంత్రాంగం నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీలకు చెందిన అసంతృప్త నేతలను ఆకర్షించే ప్రక్రియను చేపట్టారు. బర్కత్ పురాలోని పార్టీ నగర కార్యాలయంలో వివిధ పార్టీలకు చెందిన అసంతృప్త నాయకులకు బీజేపీ ముఖ్య నేతలు అందుబాటులో ఉన్నారు.
కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, జాతీయ నేత డాక్టర్ లక్ష్మణ్ లు దగ్గరుండి మరీ ఇతర పార్టీల నేతలతో మంతనాలు నిర్వహిస్తున్నారు. ఆయా బీజేపీ ముఖ్యనేతలను కొద్దిసేపటి క్రితం కలిసిన వారిలో కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ మేయర్ బండ కార్తీకరెడ్డి, చంద్రారెడ్డి దంపతులు, ఆర్టీసీ కార్మిక సంఘం నేత అశ్వత్థామరెడ్డిలు ఉన్నారు. వివిధ పార్టీకు చెందిన మరికొంత మంది నాయకులు కూడా బీజేపీ ముఖ్యులను కలిసే అవకాశం ఉందంటున్నారు.
అయితే తాను వ్యక్తిగత పని నిమిత్తం బీజేపీ ఆఫీసుకు వచ్చినట్లు అశ్వత్థామరెడ్డి చెబుతుండడం గమనార్హం. జీహెచ్ఎంసీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన అనంతరం చోటు చేసుకున్న ఆయా పరిణామాలు తెలంగాణా రాజకీయాలను వేడెక్కిస్తున్నాయి. ఇక అశ్వత్థామరెడ్డి బీజేపీ కార్యాలయానికి వచ్చిన వీడియోను దిగువన చూసేయండి.