ఖమ్మం జిల్లా పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి ఎదుటే ఓ కౌలు రైతు భార్య పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. నియోజకవర్గంలోని నేలకొండపల్లి మండలం బోదుల బండలో రైతు కొనుగోలు కేంద్రం ప్రారంభోత్సవం సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఇందుకు దారి తీసిన ఉదంతం పూర్వపరాల్లోకి వెడితే…
దాదాపు నెల రోజుల క్రితం బోదులబండకు చెందిన తుమ్మల రాఘవేంద్రరావు అనే కౌలు రైతు పొలంలో కరెంట్ షాక్ తో ఓ దంపతుల జంట మృతి చెందింది. పొలంలో పనికోసం వచ్చిన దంపతులు తెగిపడిన కరెంట్ వైర్లు తగిలి మరణించారు. అయితే కూలీకి పిలిచినందుకుగాను మృతుల కుటుంబానికి పరిహారంగా రూ. 20 లక్షలు డిమాండ్ చేశారు. వివాదంపై పంచాయతీ నిర్వహించగా, రూ. 6 లక్షల మొత్తం చెల్లింపునకు పెద్దమనుషల సమక్షంలో రైతు కుటుంబం ఒప్పుకుంది. కానీ ఒప్పందం ప్రకారం డబ్బు చెల్లించలేకపోవడంతో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో పంచాయతీ నిర్వహించారు.
ఈ నేపథ్యంలోనే ఇప్పటికే రెండు లక్షలు ఆ కుటుంబానికి చెల్లించినా, ఒప్పందం ప్రకారం మిగతా డబ్బు కూడా చెల్లించాలని ఒత్తిడి తేవడం, అవి చెల్లించలేక రైతు కుటుంబం ఇబ్బంది పడుతోంది. తాము మిగతా డబ్బు చెల్లించలేమని కూడా ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి సమక్షంలోనే రైతు కుటుంబం చెప్పినట్లు సమాచారం. అయితే పెద్దమనుషుల పంచాయతీలో ఒప్పుకున్న ప్రకారం మిగతా డబ్బు చెల్లించాల్సిందేనని ఖరాఖండిగా కొందరు అనడంతో ఎమ్మెల్యే ముందే రైతు రాఘవేంద్రరావు భార్య తుమ్మల దివ్య పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. పరిస్థితి విషమించడంతో ఆమెను చికిత్సకోసం నేలకొండపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.