పెన్నుపట్టి తన రాతల ద్వారా జనహితం కోసం పాకులాడేవాడు జర్నలిస్టు. ఇప్పుడు పెన్నుపోయి కంప్యూటర్ ‘మౌస్’, కీబోర్డు వచ్చాయనేది వేరే విషయం. మొత్తంగా, క్లుప్తంగా చెప్పాలంటే అక్షర యుద్ధం చేసేవాడు జర్నలిస్టు. అక్షరం ముక్క రాయడం చేతగానివాళ్లను, ఇతరుల అక్షరాలను దొంగిలించేవాళ్లను ఎలా సంబోధించాలి? ఇదీ తాజా సందేహం. ఎందుకంటే… డిజిటల్ మీడియా పాఠకలోకాన్ని చుట్టేస్తున్నతాజా పరిణామాల్లో సోషల్ మీడియా వేదికగా ‘కాపీ’రాయుళ్ల సంఖ్య ఏరోజుకారోజు పెరిగిపోతుండడం ఓ విషాదం.
ఆ మధ్య కరీంనగర్ కు చెందిన ఓ లాయర్ మిత్రుడు ఒకానొక వెబ్ సైట్ ప్రచురించిన ఓ వార్తా కథనాన్ని ‘కట్… పేస్ట్’చేసి వాట్సప్ గ్రూపుల్లో అప్ లోడ్ చేశాడు. ‘ఇదేం పద్ధతి? కాస్త వెబ్ సైట్ల మనుగడను కొనసాగనివ్వండి’ అని అదే గ్రూపులో కోరగా, ‘అన్నా ఆ సైట్ మీది కాదు కదా? అని ఎదురు ప్రశ్నించాడు. అయినప్పటికీ అది తప్పేనని, సైట్ ఎవరిదైనా ‘కట్… పేస్ట్’ పద్ధతి కాదని చెప్పడంతో అతను అంగీకరించాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ లాయర్ అటువంటి పని మళ్లీ చేసినట్లు కనిపించలేదు. కానీ ఈ విషయంలో ఓ లాయర్ కు ఉన్న కనీస సంస్కారం ‘మీడియా’ ముసుగులో గల కొందరు జర్నలిస్టులకు మాత్రం ఉన్నట్లు లేదు.
ప్రపంచంలో ఏ మూలన జరిగే ఘటనకు సంబంధించిన సమాచారమైనా తమకే తెలుసని చెప్పడానికి కొందరు జర్నలిస్టులు తెగ తాపత్రయపడుతున్నారు. వివిధ వార్తా పత్రికలకు చెందిన, జర్నలిస్టులు స్వతంత్రంగా నిర్వహిస్తున్న వెబ్ సైట్లలోని వార్తా కథనాలను ‘కాపీ’చేసి వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేస్తున్నారు. ‘రెవెన్యూ, రిజిస్ట్రేషన్ల శాఖల అంశంలో సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకోబోతున్నారనే సారాంశంతో ఓ ఆన్ లైన పత్రిక ప్రచురించిన వార్తా కథనాన్ని మీడియా ముసుగులో గల సోషల్ మీడియా వీరులు ‘కాపీ’ చేసి తెగ షేర్ చేస్తున్నారు. జర్నలిస్టులుగా చెప్పుకునేవారే కొందరు ఇటువంటి ‘కాపీ’ చర్యలకు పాల్పడడం విస్మయాన్ని కలిగిస్తోంది. అంతేకాదు కంటెంట్ ‘కాపీ’ కాకుండా జాగ్రత్తలు తీసుకున్న సైట్లలోని వార్తా కథనాలను మొబైల్ ద్వారా ‘స్క్రీన్’ షాట్లు తీసి సోషల్ మీడియాలో షేర్ చేసే స్థాయికి మరికొందరు జర్నలిస్టులు దిగజారారు.
వాస్తవానికి ఇటువంటి ‘కట్, పేస్ట్’ రాయుళ్లకు దీని వల్ల కలిగే ప్రయోజనం కూడా పెద్దగా ఏమీ ఉండదు. తామే ఈ వార్తా కథనాన్ని రాశామని భ్రమింపజేయడం ఓ భాగం కాగా, తమకు మాత్రమే సమాచారం తెలుసని మభ్యపెట్టడం మరో భాగం. అంతేకాదు తమ ‘కోతి’ చేష్టల ద్వారా వెబ్ సైట్ల రీడర్ షిప్ ను దెబ్బతీస్తున్నామనే పైశాచికానందం కూడా లోలోన ఉండి ఉండవచ్చు. కానీ ఇటువంటి వ్యక్తులు గమనించాల్సిన అంశం ఒకటుంది. ప్రతి సైట్ రీడర్ షిప్ కు సంబంధించి ఓ లెక్క ఉంటుంది. ‘గూగుల్’ ఆ లెక్కను ఎప్పటికప్పుడు గణిస్తుంటుంది కూడా. ఇదే సందర్భంలో జర్నలిస్టు ముసుగులో గల కాపీరాయుళ్లు, కట్ పేస్ట్ వీరులు తెలుసుకోవలసిన ముఖ్యాంశం మరొకటీ ఉంది.
ఊరకనే కాలక్షేపం కోసం ఆ సైట్లను, ఈ సైట్లను చూస్తూ, అందులోని వార్తా కథనాలను కట్ పేస్ట్ చేయడం ద్వారా పైశాచికానందం పొందడం మాత్రం వృధా ప్రయాసే. ఇటువంటి వ్యక్తుల్లో నిజంగా ‘కంటెంట్’ ఉంటే, దాన్నిఅక్షర రూపంగా మార్చే సత్తా ఉంటే, సమాజహితం కోసం జర్నలిస్టుగా బతకాలనుకుంటే ఓ వెబ్ సైట్ లేదా బ్లాగ్, కాకుంటే యూ ట్యూబ్ ఛానల్ ఏర్పాటు చేసుకోవచ్చు. వీళ్ల అక్షర ‘సరుకు’కు పాఠకులు ఆమోద ముద్ర వేస్తే ‘గూగుల్’ ప్రకటనల ద్వారా ఆదాయాన్ని కూడా సముపార్జించుకోవచ్చు. లేదంటే మిగిలేది ‘మీడియా ముసుగులో మిడిసిపాటు’ మినహా మరేమీ కాదన్నది నిర్వివాదాంశం. అదీ చెప్పదల్చుకున్న అసలు విషయం.