ఖమ్మం జిల్లాఅధికార పార్టీ రాజకీయాల్లో ఇదో అనూహ్య పరిణామం. కారణం ఏదైనప్పటికీ, ఒక్కోసారి రాష్ట్ర స్థాయి రాజకీయాలను ప్రభావితం చేసేవిధంగా ఇక్కడి నేతల ఎత్తుగడలు ఉంటుంటాయి. అది ఏ రాజకీయ పార్టీ అయినా కావచ్చు. అనేకసార్లు రాష్ట్ర రాజకీయాలను సైతం మలుపుతిప్పే విధంగాఒక్కోసారి పరిణామాలు మారుతుంటాయ్. ఇందుకు సంబంధించి అనేక ఉదాహరణలు కూడా ఉన్నాయి. ఖమ్మం జిల్లా తాజా రాజకీయాల్లో ఇప్పుడు కూడా దాదాపు అటువంటి పరిణామమే.
అధికార పార్టీ రాజకీయాల్లో ఖమ్మం జిల్లా నేతల మధ్య సఖ్యత లేదనే విషయం బహిరంగమే. మంత్రి అజయ్ కుమార్ కు, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు చాలా కాలంగానే పొసగడం లేదనే వాదన ఉంది. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మంత్రి అజయ్ కుమార్ మధ్య ప్రస్తుతం పచ్చగడ్డి వేయకుండానే భగ్గుమంటున్న పరిస్థితి ఉందని పార్టీ వర్గాలే చర్చించుకుంటున్నాయి. ఇక నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలకు, మాజీ ఎమ్మెల్యేలకు మధ్య కూడా ‘ఒరుగులు’ కలుస్తున్నట్టు లేదు. ఇందుకు కారణాలు అనేకం. కాంగ్రెస్ నుంచి గెలిచి గులాబీ కండువా కప్పుకున్న ఎమ్మెల్యేలకు, వారి చేతిలో ఓటమి పాలైన టీఆర్ఎస్ కు చెందిన ‘మాజీ’లకు ఏమాత్రం పొసగడం లేదు.
ఈ పరిణామాల్లోనే ఖమ్మం నగరపాలక సంస్థకు ఎన్నికల గడువు తరుముకొస్తోంది. ఇంకోవైపు గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికలు కూడా జరగున్నాయి. నిన్నగాక, మొన్న దుబ్బాక ఉప ఎన్నికల్లో అధికార పార్టీకి ఘోర అపజయం. అన్ని రకాల వనరులు, హంగూ, అర్భాటం ఉన్నప్పటికీ చేదు ఫలితాన్ని చవిచూసిన దుస్థితి. ఇంకోవైపు రాజకీయంగా బీజేపీ సవాల్ విసురుతోంది. ఇటువంటి పరిస్థితుల్లో రేపు ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికల్లో అప్రతిహత గెలుపు సాధించేదెలా? కనీసం గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లోనైనా గట్టెక్కుతామా? పార్టీకి చెందిన ముఖ్య నేతల మధ్య పొసగని పరిస్థితులు అందుకు అనువుగా ఉంటాయా? ఇదీ పార్టీ శ్రేణుల్లో గల అసలు సందేహం.
ఈ నేపథ్యంలోనే సీఎం కేసీఆర్ ఖమ్మం రాజకీయాలపైనా ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం… ఖమ్మం జిల్లా ముఖ్య నేతల మధ్య సఖ్యతను కుదిర్చే బాధ్యతను ఎంపీ నామ నాగేశ్వరరావు భుజస్కంధాలపై వేశారు. పార్టీ చీఫ్ ‘టాస్క్’ అప్పగించాక, దాన్ని ఎలా పూర్తి చేయాలో నామ నాగేశ్వరరావుకు తెలియనిదేమీ కాదు. తాను ఎదుర్కున్న కొన్ని చేదు అనుభవాలను కూడా ప్రస్తుతానికి అప్రస్తుతంగా పరిగణించారు. సీఎం కేసీఆర్ ఆదేశం, పార్టీ ప్రయోజనమే ముఖ్యమని ఆయన భావించారు. నిన్న గాక మొన్ననే నేరుగా రంగంలోకి దిగారు. మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నివాసానికి వెళ్లారు. ఇద్దరు కలిసి బోనకల్ లో ఓ వివాహానికి హాజరయ్యారు. అక్కడి నుంచి కొత్తగూడెం వరకు ఒకే కారులో ప్రయాణించారు. ఈ సందర్భంగా నామ నాగేశ్వరరావు పరిస్థితులను తుమ్మలకు వివరించారు. పార్టీ చీఫ్ నిర్ణయాన్ని, సాధించాల్సిన లక్ష్యాన్ని కూలంకషంగా చెప్పారు. ఇవే అంశాలను మంత్రి అజయ్ కుమార్ కు కూడా ఎంపీ నామ నాగేశ్వరరావు వివరించారు. మొత్తంగా ఇద్దరినీ పరస్పరం కలిపారు. దాని ఫలితమే శుక్రవారం నాటి కార్యక్రమాల్లో మంత్రి అజయ్ కుమార్ నేరుగా తుమ్మల ఇంటికి వెళ్లి రైతువేదిక ప్రారంభోత్సవానికి రావలసిందిగా ఆహ్వానించారు.
సీఎం కేసీఆర్ అప్పగించిన ‘టాస్క్’ను పూర్తి చేసిన ఎంపీ నామా నాగేశ్వరరావు ప్రస్తుతం ఖమ్మం జిల్లా అధికార రాజకీయాల్లో ‘ట్రబుల్ షూటర్’గా ఆ పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. అయితే అజయ్, తుమ్మల మధ్య ఈ స్థాయిలో సఖ్యత కుదిర్చిన నామ నాగేశ్వరరావు శుక్రవారం ‘సీన్’లో కనిపించలేదేమిటి? అనే సందేహం చాలా మందిలో కలగవచ్చు. ఈ ప్రశ్నకూ జవాబు ఉందంటున్నాయి పార్టీ వర్గాలు. వాస్తవానికి గత కొన్ని రోజులుగా నామ నాగేశ్వరరావు అనారోగ్య సమస్యతో బాధపడుతున్నారు. సీఎం తనకు అప్పగించిన ‘టాస్క్’ను పూర్తి చేసి, నేరుగా హైదరాబాద్ వెళ్లి ప్రముఖ వైద్యుని వద్ద శస్త్ర చికిత్స చేయించుకున్నారు ఎంపీ నామ. ప్రస్తుతం ఆయన విశ్రాంతి తీసుకుంటున్నారు. మొత్తంగా తన అనారోగ్య పరిస్థితుల్లోనూ సీఎం అప్పగించిన ‘టాస్క్’ను పూర్తి చేసిన నామ నాగేశ్వరరావు ఖమ్మం జిల్లా అధికార పార్టీ రాజకీయాల్లో ఇప్పుడు ‘ట్రబుల్ షూటర్’. అదీ అసలు విషయం.