ఔను… ఖమ్మం జిల్లా రాజకీయాల్లో అనూహ్య పరిణామమే! తుమ్మల నాగేశ్వరరావుకు చాలా రోజుల తర్వాత అధికారిక ‘గౌరవం’ లభించింది. గత ఎన్నికల్లో అనూహ్య ఓటమి తర్వాత ‘మాజీ’ మంత్రిగా మారిన ఆయనను దాదాపు రెండేళ్లుగా పార్టీలో పెద్దగా పట్టించుకున్నవారే లేరు. దమ్మపేట మండలం గండుగులపల్లిలోని తన వ్యవసాయ పొలాల్లో సేద తీరుతున్నా, హైదరాబాద్ లోని తన ఇంట్లో కాలక్షేపం చేస్తున్నా ఆయన గురించి పట్టించుకున్నవారే లేరు. ఎన్నాళ్లకు…? దాదాపు రెండేళ్లకు… తుమ్మల నాగేశ్వరరావుకు అధికారిక గౌరవం లభించింది.
శుక్రవారం మంత్రులు పువ్వాడ అజయ్ కుమార్, నిరంజన్ రెడ్డిలు సంయుక్తంగా ఖమ్మం శివార్లలోని గొల్లగూడెంలో గల తుమ్మల నివాసానికి వెళ్లి ఆయనను సాదరంగా ఆహ్వానించారు. రైతువేదికల ప్రారంభోత్సవాల కార్యక్రమాల్లో పాల్గొనాలని తోడ్కొని వచ్చారు. జిల్లాలోని అధికార పార్టీ రాజకీయాల్లో ఉప్పు, నిప్పులా ఉన్నట్లు ప్రాచుర్యంలో గల నాయకులు కలిసే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సీన్ చూసిన అధికార పార్టీకి చెందిన కార్యకర్తలు సహజంగానే సంబురపడ్డారు. అంతా ఓకే… కానీ దాదాపు రెండేళ్ల తర్వాత ‘తుమ్మల’కు ఇప్పుడే ఎందుకీ గౌరవం? ఇదీ తుమ్మల అభిమానులను తొలుస్తున్న ప్రశ్న. సుమారు నాలుగు నెలల క్రితం ‘తుమ్మల భజనపరులారా… ఖబడ్డార్!’ అంటూ సోషల్ మీడియా వేదికగా సాగిన హెచ్చరికల సారాంశాన్ని ఆయన అభిమానులు ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారనే వాదన ఎలాగూ ఉంది.
ఈ పరిణామాల్లోనే తుమ్మలకు అనూహ్య గౌరవం లభించడంపై సహజంగానే పార్టీ శ్రేణుల్లో సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఓవైపు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కు, మరోవైపు ఖమ్మం నగరపాలక సంస్థకు, ఇంకోవైపు వరంగల్-ఖమ్మం-నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికలు తరుముకొస్తున్న పరిణామాల్లో తమ నాయకుడి అవసరాన్ని పార్టీ గుర్తించిందా? ఇదీ తుమ్మల అనుయాయుల సంశయం. నిన్న మంత్రులు, పార్టీ ప్రధాన కార్యదర్శులతో సీఎం కేసీఆర్ సమీక్షా సమావేశాన్ని నిర్వహించిన సంగతి తెలిసిందే. దుబ్బాక ఉప ఎన్నికల్లో ఓటమి, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలుపు అంశాలే ప్రామాణికంగా జరిగిన చర్చలో వివిధ జిల్లాల్లో కొందరు నాయకుల అవసరాన్ని పార్టీ గుర్తించిందని అంటున్నారు. వారిని కలుపుకునిపోవలసిందిగా సీఎం కేసీఆర్ ఆదేశించారని, అందువల్లే తమ నేతకు రెండేళ్ల తర్వాత ‘గౌరవం’ లభించిందని తుమ్మల వర్గీయులు పేర్కొంటున్నారు.
అంతా ఓకేగాని, గత ఎన్నికల్లో తన ఓటమి వెనుక గల కొందరి కుట్రలను, కుయుక్తులను, ఇన్నాళ్లపాటు ఎదురైన అవమానాలను అపార రాజకీయ అనుభవం గల తుమ్మల నాగేశ్వరరావు తమాయించుకుని పార్టీ శ్రేయస్సుకోసం కలిసే నడుస్తారా? లేదా? అనేది కూడా వేచి చూడాల్సిన అంశంగానే రాజకీయ పరిశీలకులు అభివర్ణిస్తున్నారు.
ఇదీ చదవండి: