కాంగ్రెస్ కు ఉనికే లేదు. ‘గ్రేటర్’లో బీజేపీ ఆటలు సాగవ్. ఆ పార్టీ ప్రజల్లో లేదు. మనం పట్టించుకోవద్దు. దుబ్బాకలో ఓడిపోతామనుకోలేదు. ఖచ్చితంగా గెలుస్తామనే ధీమాతో కొంత ఏమరుపాటుగా ఉండడం వల్ల ఆశించిన ఫలితం రాలేదు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎక్కడా ఏమరుపాటుగా ఉండొద్దు.
బీజేపీకి బుద్ధి చెబుదాం. దుబ్బాక ఉప ఎన్నికల్లో గెలిచామని ఎగిరెగిరి పడుతున్న బీజేపీకీ, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఘన విజయం సాధించి బుద్ధి చెబుదాం. గత లోక్ సభ ఎన్నికల్లో నాలుగు సీట్లు గెల్చినపుడూ బీజేపీ నేతలు ఇలానే ఎగిరిపడ్డారు. ఆ తర్వాత జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో చతికిల పడ్డారు.
బీజేపీని ఈజీగా తీసుకోవద్దు. దుబ్బాకలో బీజేపీ గెలుపును తక్కువగా చూడొద్దు. బీజేపీతో అప్రమత్తంగా ఉండాలి. పార్టీ బలం పెంచుకునేందుకు బీజేపీ నేతలు ప్రయత్నిస్తున్నారు. అటువంటి అవకాశం ఇవ్వొద్దు. దుబ్బాకలో అనూహ్యంగా బీజేపీ గెలిచింది. గ్రామీణ ప్రాంతాల్లోనూ బలపడుతున్నది.
బీజేపీని చూసి హైరానా పడొద్దు. గ్రేటర్ హైదరాబాద్ మనదే. మన ప్రభుత్వంపై వ్యతిరేకత లేదు. బీజేపీని ఎక్కువగా ఊహించుకోవద్దు. ఆ పార్టీ నేతల అబద్దాలను ఎక్కడికక్కడ ఎండగట్టండి. గ్రేటర్ ఎన్నికల్లో వంద డివిజన్లకు తగ్గకుండా గెలుపునకు పాటుపడాలి.
వచ్చే డిసెంబర్ లో జీహెచ్ఎంసీ ఎన్నికలు జరుగుతాయని భావిస్తున్న నేపథ్యంలో తెలంగాణా సీఎం కేసీఆర్ నిన్న ఈ వ్యాఖ్యలు చేసినట్లు వివిధ పత్రికలు నివేదించాయి. ప్రగతి భవన్ లో మంత్రులు, పార్టీ ప్రధాన కార్యదర్శులతో దాదాపు ఏడు గంటలపాటు సుదీర్ఘంగా నిర్వహించిన సమావేశంలో సీఎం కేసీఆర్ చేసిన దిశా, నిర్దేశానికి సంబంధించి వివిధ పత్రికల్లో వచ్చిన వార్తా కథనాల్లో సారాంశం భిన్నంగా కనిపిస్తోంది. ‘ఇన్ కెమెరా’ మీటింగ్ కాబట్టి ఎవరికి తెలిసన సమాచారాన్ని ఆయా పత్రికల విలేకరులు వివిధ కోణాల్లో తమ పాఠకులకు అందించి ఉండవచ్చు. ఒక్కో పత్రిక ఒక్కోరకంగా వార్తా కథనాలను అందించడం కొత్తేమీ కాదు. ఇందుకు కారణాలు అనేకం కావచ్చు. కానీ అధికార పార్టీ కరదీపికగా భావిస్తున్న పత్రికలో మాత్రం ఇదే అంశంపై ఏ కోణంలోనూ వార్తా కథనం లేకపోవడం అసలు విశేషం.
సరే.., సీఎం నిర్వహించిన సమావేశానికి సంబంధించి పత్రికల వార్తల కవరేజి సంగతి ఎలా ఉన్నప్పటికీ, బీజేపీ లక్ష్యంగా సీఎం మంత్రులకు, పార్టీ నేతలకు గట్టిగానే హితబోధ చేశారనే విషయం మాత్రం స్పష్టమవుతోంది. మొత్తంగా జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అధికార పార్టీ నేతలు బీజేపీని పట్టించుకోవాలా? వద్దా? ఇదీ అసలు సందేహం. బీజేపీని పట్టించుకుంటే ఓ ప్రాబ్లమ్, పట్టించుకోకుంటే మరో ఇబ్బందిగానే పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఇందుకు ఉదాహరణలు కూడా ఉన్నట్లు ఆ వర్గాలు చర్చించుకుంటున్నాయి,
వాస్తవానికి గత పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీని అధికార పార్టీ నేతలు పెద్దగా పట్టించుకోలేదన్నది వాస్తవం. ఈ పరిణామాల్లోనే బీజేపీ, దాని అనుబంధ సంస్థల కేడర్ చాపకింద నీరులా తమ పని తాము చేసుకుంటూ వెళ్లింది. ఫలితం అనూహ్యం. అంచనాలకు విరుద్ధంగా నాలుగు పార్లమెంట్ స్థానాల్లో బీజేపీ పాగా వేసింది. ‘సారు-కారు-పదహారు’ నినాదానికి గట్టి గండి పడింది. సాక్షాత్తూ సీఎం కూతురు కల్వకుంట్ల కవిత నిజామాబాద్ లో, ఆయన కుడిభుజంగా భావించే బోయినపల్లి వినోద్ కుమార్ కరీంనగరల్ లో ఓటమి బాట పట్టారు. ఆదిలాబాద్ స్థానంలోనూ సోయం బాపూరావు గెలుపు కూడా అనూహ్యమే. సికింద్రాబాద్ స్థానంలో బీజేపీ గతంలోనూ గెలిచిన సందర్భాలు అనేకం. ఎమ్మెల్యేలుగా ఓడిపోయిన కొందరు బీజేపీ నేతలే పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థులకు పరాజయాన్ని రుచి చూపించడం గమనార్హం.
ఇక తాజాగా జరిగిన దుబ్బాక ఉప ఎన్నిక విషయానికి వస్తే, ఇక్కడ బీజేపీని అధికార పార్టీ నేతలు గట్టిగానే పట్టించుకున్నారు. ఎన్నికల ప్రచారం పర్వంలో కాంగ్రెస్ గురించి టీఆర్ఎస్ ప్రస్తావించిన దాఖలాలు కూడా అంతంత మాత్రమే. కానీ బీజేపీ అభ్యర్థి రఘునందర్ రావు విషయంలో చోటు చేసుకున్న పరిణామాలు రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు దారి తీశాయి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సిద్ధిపేట జిల్లాకు వెళ్లిన సమయంలోనూ జరిగిన ఉదంతాలు ఉద్రిక్తతకు దారి తీశాయి. మొత్తంగా దుబ్బాకలో టీఆర్ఎస్ బీజేపీనే ప్రధానంగా టార్గెట్ చేసిందనేది కాదనలేని వాస్తవం. ట్రబుల్ షూటర్ గా పేరుగాంచిన మంత్రి హరీష్ రావు మంత్రాంం సైతం దుబ్బాకలో ఫలించలేదు. ఫలితం అందరికీ తెలిసిందే. కానీ తమ ఏమరుపాటువల్లే బీజేపీ గెలిచిందని అధికార పార్టీ నేతలు విశ్లేషించుకుంటున్నారు.
ఇదిగో ఈ నేపథ్యంలోనే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు తరుముకొస్తున్నాయి. బీజేపీని పెద్దగా పట్టించుకోవద్దని, సర్వేలు సానుకూలంగా ఉన్నాయని, వందకుపైగా డివిజన్లలో గెలుస్తామని సీఎం కేసీఆర్ నిన్నటి సమీక్షా సమావేశంలో ధీమా వ్యక్తం చేస్తూ ప్రకటించడం విశేషం. అన్నట్లు దుబ్బాక ఉప ఎన్నిక సందర్భంగా సీఎం కేసీఆర్ కొడకండ్ల రైతువేదిక సభలో ఏమన్నారో గుర్తుందిగా? ‘‘దుబ్బాక ఉప ఎన్నికల్లో బీజేపీ వాళ్లు గెలిచేది లేదు.., పీకేది లేదు. అక్కడ టీఆర్ఎస్ పార్టీ బ్రహ్మాండంగా ఉంది.’’ అన్నారు. బహుషా తనకు గల సర్వే నివేదికలను బట్టి ఆయన అలా అంచనా వేసి ఉండవచ్చు. ఇప్పుడు కూడా సర్వేలు అనుకూలంగా ఉన్నాయనే సీఎం వెల్లడించారు.
మరోవైపు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కూడా చాలా ధీమాగానే ఉన్నారు. దాదాపు 75 డివిజన్లలో బీజేపీ గెలుస్తుందని చెబుతున్నారు. మొత్తంగా జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ పరిస్థితి ఎలా ఉన్నప్పటికీ, అధికార టీఆర్ఎస్ పార్టీ మాత్రం బీజేపీ పేరునే కలవరిస్తున్నట్లు కనిపిస్తోంది. పట్టించుకోవద్దంటూనే పదే పదే ఆ పార్టీ పేరును వల్లించడమే అసలు విశేషంగా రాజకీయ పరిశీలకులు అభివర్ణిస్తున్నారు. అదీ సంగతి.