జర్నలిజంలో నిష్పాక్షికత గురించి తెలుగు పాఠకులు ఎప్పుడో మర్చిపోయి ఉండవచ్చు. పత్రికలు రాజకీయ పార్టీల కరదీపికలుగా మారిన పరిణామాల్లో జర్నలిజపు ‘విష’వసనీయత గురించి కొత్తగా చెప్పుకునేది కూడా ఏమీ లేదు. కానీ కోట్లాది మంది తెలంగాణా ప్రజలు ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూసిన ‘దుబ్బాక’ ఉప ఎన్నికల ఫలితంపై ‘నమస్తే తెలంగాణా’ పత్రిక తన పాఠకులకు అందించిన వార్తా కథనాలపైనే భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ పత్రిక టీఆర్ఎస్ మానస పుత్రికే కావచ్చు. అందులో ఎటువంటి సందేహం లేదు. పత్రిక స్థాపన లక్ష్యం కూడా అధికార పార్టీ భజన కోసం నిర్దేశించుకునే ఉండవచ్చు.
అయినప్పటికీ ఎన్నికల్లో ప్రజల తీర్పును ప్రతిబింబించిన ఫలితం వెలువడినపుడు, అది ఆసక్తికర పరిణామంగా మారినపుడు కనీసం తన పాఠకులనైనా సంతృప్తిపరిచే విధంగా వ్యవహరించక ఏ పత్రికైనా తప్పదు. ‘పక్షపాత’ జర్నలిజంలోనూ ఇదీ ఓ ప్రామాణికతే. కానీ అధికార పార్టీ కరదీపక ‘నమస్తే తెలంగాణా’ మాత్రం ఇందుకు విరుద్ధంగా వ్యవహరించడమే అసలు విశేషం. దుబ్బాక ఎన్నికల్లో సంచలన విజయం సాధించిన బీజేపీ అభ్యర్థి ఎం. రఘునందన్ రావు ఫొటోను మెయిన్ ఎడిషన్ లో ప్రచురించేందుకు కూడా అధికార పార్టీ పత్రికకు మనస్కరించినట్లు లేదు. ‘దుబ్బాకలో బీజేపీ గెలుపు’ అంటూ మెయిన్ ఎడిషన్ ఫస్ట్ పేజీలో అడ్వర్టయిజ్మెంట్ల మధ్య ఓ చిన్న ఇంట్రో ఇస్తూ, వివరాలు మూడో పేజీలో ఉన్నట్లు ఇండికేషన్ ఇచ్చింది. పోనీలే కనీసం మూడో పేజీలోనైనా రఘునందన్ రావు ఫొటోతో రాసి ఉంటారులే… అని బీజేపీ శ్రేణులు తృప్తి పడాల్సిన అవసరంం లేదు. ఎందుకంటే అక్కడా ఓ 15 లైన్ల వార్తతో ‘దుబ్బాక ప్రజల తీర్పు’ను క్లుప్తంగా ముగించేశారు. ఈ 15 లైన్ల వార్తలోనూ మూడు లైన్లు కారును పోలిన ‘చపాతీ’ గుర్తు గురించే చెప్పారు. కనీసం మూడో పేజీలోనే ఉప ఎన్నికల విజేత రఘునందన్ రావు ముఖాన్ని చూపడానికి నమస్తే తెలంగాణా పత్రిక అయిష్టతనే ప్రదర్శించినట్లు కనిపించింది.
ఔనూ…? ‘నమస్తే తెలంగాణా’ దుబ్బాక ప్రజల తీర్పును పెద్దగా రాయనంతా మాత్రాన, ఫొటో మెయిన్ ఎడిషన్ లో ప్రచురించనంత మాత్రాన సంచలన విజయం సాధించిన రఘునందన్ రావు ముఖం తెలంగాణా రాష్ట్ర ప్రజలకు తెలియదా… మరీ ముఖ్యంగా దుబ్బాక ఓటర్లకు…? ఇదీ ఆ పత్రిక పాఠక వర్గాల సందేహం.
మరో ముఖ్యమైన విషయమూ ఉందండోయ్… బీహార్ ఎన్నికల్లో, మధ్యప్రదేశ్ ఉప ఎన్నికల్లో బీజేపీ సాధించిన విజయాన్ని కూడా ‘నమస్తే తెలంగాణా’ పెద్దగా పట్టించుకున్నట్లు లేదు. ‘బీహార్ మళ్లీ నితీష్ దే, శివరాజ్ సర్కార్ గట్టెక్కింది’ అంటూ వార్తలకు శీర్షికరించిందే తప్ప, ప్రధాని మోదీ ముఖాన్ని చూపడానికి కూడా నేటి ఎడిషన్ లో సుతారమూ ఇష్టపడినట్లు లేదు. సిద్ధిపేట జిల్లా అనుబంధంలో మాత్రం ‘ఉత్కంఠ రేపిన ఉప ఎన్నిక’ అంటూ ముక్తాయించి, రఘునందర్ రావు ఫొటోను ప్రచురించడం కొసమెరుపు.