తమ పనితీరు ద్వారా ప్రజాభిమానాన్ని చూరగొన్న అధికారులు ఆకస్మికంగా బదిలీకి గురయితే ప్రజలు నిరసన వ్యక్తం చేయడం చూశాం. ఆయా అధికారి బదిలీని నిరసిస్తూ ప్రజలు రోడ్డెక్కి ధర్నాలు, రాస్తారోకోలు చేసిన ఘటనలు అనేకం. ప్రజల ఒత్తిడికి తలొగ్గిన పాలకులు అటువంటి అధికారులను మరికొంత కాలం అక్కడే పనిచేసే విధంగా బదిలీ ఉత్తర్వులను రద్దు చేయడం గురించి విన్నాం. కానీ ఓ జిల్లా కలెక్టర్ బదిలీ అయితే అధికార పార్టీకి చెందిన నేతలు సంబరాలు చేసుకోవడమే ఇక్కడ అసలు విశేషం. కలెక్టర్ బదిలీ వార్త తెలియగానే టీఆర్ఎస్ నేతలు ఏకంగా ముందస్తు దీపావళి పండుగ జరుపుకోవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
భూపాలపల్లి జిల్లా కలెక్టర్ అబ్దుల్ అజీమ్ ను బదిలీ చేస్తూ ప్రభుత్వం నిన్న ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. దీంతో స్థానిక టీఆర్ఎస్ నాయకులు వీధుల్లోకి వచ్చి మరీ సంబరాలు చేసుకున్నారు. నిన్న రాత్రి భూపాలపల్లి అంబేడ్కర్ సెంటర్ లో వార్డు కౌన్సిలర్లు, కాంట్రాక్టర్లు, టీఆర్ఎస్ నాయకులు పెద్ద సంఖ్యలో టపాసులు కాల్చారు. కలెక్టర్ అబ్దుల్ అజీమ్ కు పోస్టింగ్ ఇవ్వకపోగా, భూపాలపల్లి కలెక్టర్ గా ములుగు కలెక్టర్ కృష్ణ ఆదిత్యకు అదనపు బాధ్యతలు అప్పగించడం గమనార్హం. కాగా కలెక్టర్ అబ్దుల్ అజీమ్ బదిలీ అనంతరం స్థానిక టీఆర్ఎస్ నేతలు ఏమంటున్నారో దిగువన గల వీడియోలో తిలకించండి.