హెడ్డింగ్ కంటెంట్ తెలుసుకోవడానికి ముందు దిగువన గల వార్తను ఆసాంతం చదవాల్సిందే.
హైదరాబాద్ నగర శివార్లలో అంతర్జాతీయ స్థాయిలో సినిమా సిటీ నిర్మిస్తామని, ఇందుకోసం 1500-2000 ఎకరాల స్థలాన్ని కేటాయిస్తామని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ప్రకటించారు. సినీ ప్రముఖులు, అధికారుల బృందం బల్గేరియా వెళ్లి అక్కడి సినిమా సిటీని పరిశీలించి రావాలని, సినిమా సిటీ ఆఫ్ హైదరాబాద్ నిర్మాణానికి ప్రతిపాదనలు రూపొందించాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. అన్ లాక్ ప్రక్రియ ప్రారంభమైనందున సినిమా షూటింగులు, సినిమా థియేటర్లు పునఃప్రారంభించవచ్చని సీఎం ప్రకటించారు. సినీ రంగ ప్రముఖులు చిరంజీవి, నాగార్జున శనివారం ప్రగతి భవన్ లో సీఎం ను కలిశారు. ఈ సందర్భంగా తెలంగాణలో సినిమా పరిశ్రమ అభివృద్ధి- విస్తరణపై చర్చ జరిగింది.
‘‘తెలంగాణ రాష్ట్రంలో చిత్ర పరిశ్రమ ఆధారంగా ప్రత్యక్షంగా, పరోక్షంగా దాదాపు 10 లక్షల మంది ఆధారపడి జీవిస్తున్నారు. కరోనా నేపథ్యలో విధించిన లాక్ డౌన్ వల్ల అటు షూటింగులు ఆగిపోయి, ఇటు థియేటర్లు నడవక అనేక మంది ఉపాధి కోల్పోయారు. అనేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మళ్లీ మామూలు పరిస్థితులు నెలకొంటున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో కరోనా రికవరీ రేటు 91.88 శాతం ఉంది. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ షూటింగులు పునఃప్రారంభించాలి. థియేటర్లు కూడా ఓపెన్ చేయాలి. తద్వారా చిత్ర పరిశ్రమపై ఆధారపడి బతికే కుటుంబాలను కష్టాల నుంచి బయట పడేయాలి’’ అని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు.
‘‘హైదరాబాద్ లో సినీ పరిశ్రమ అభివృద్ధి- విస్తరణకు పుష్కలమైన అవకాశాలున్నాయి. హైదరాబాద్ నగరం కాస్మో పాలిటన్ సిటీ. దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన వారు, వివిధ భాషలకు చెందిన వారు ఇక్కడ స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నారు. ఎవరినైనా ఒడిలో చేర్చుకునే గుణం ఉంది. షూటింగులతో సహా సినిమా నిర్మాణానికి సంబంధించిన అన్ని ప్రక్రియలను చాలా సౌకర్యవంతంగా నిర్వహించుకునే వీలుంది. ఇప్పుడున్న వాతావరణానికి తోడు ప్రభుత్వం సినిమా సిటీ ఆఫ్ హైదరాబాద్ నిర్మించాలనే తలంపుతో ఉంది. ప్రభుత్వం 1500-2000 ఎకరాల స్థలాన్ని సేకరించి ఇస్తుంది. అందులో అధునాతన సాంకేతిక నైపుణ్యంతో, భవిష్యత్తు అవసరాలకు తగ్గట్టు అంతర్జాతీయ స్థాయిలో స్టూడియోలు నిర్మించుకునేందుకు సినిమా నిర్మాణ సంస్థలకు స్థలం కేటాయిస్తుంది. ఎయిర్ స్ట్రిప్ తో పాటు అన్ని రకాల మౌలిక సదుపాయాలను ప్రభుత్వం కల్పిస్తుంది’’ అని ముఖ్యమంత్రి చెప్పారు.
నిన్న సీఎం కేసీఆర్ చేసిన ‘సినిమా సిటీ’ ప్రకటనపై ఇప్పుడు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. ఈ ప్రకటన ద్వారా ‘ఈనాడు’ అధినేత రామోజీరావుకు ముఖ్యమంత్రి కేసీఆర్ చెక్ పెట్టారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రామోజీరావుకు చెందిన ‘రామోజీ ఫిలిం సిటీ’ గురించి సీఎం కేసీఆర్ గతంలో చేసిన వ్యాఖ్యలు ఈ సందర్భంగా ఆసక్తికర చర్చకు దారి తీస్తున్నాయి. దాదాపు ఆరేళ్ల క్రితం… 2014 డిసెంబర్ లో రామోజీ ఫిలిం సిటీని కేసీఆర్ సందర్శించారు. ‘రామోజీ ఫిలిం సిటీ తెలంగాణకే గర్వకారణం. రామోజీ ఫిలిం సిటీతో పాటు త్వరలో నిర్మించనున్న ఆధ్యాత్మిక నగరం ఓం సిటీలను పర్యాటక ప్రదేశాలుగా మలచడానికి తమ ప్రభుత్వం సహకరిస్తుంది. రామోజీ ఫిలిం సిటీ ఒక అద్భుత కళాఖండం, ఇలాంటి దాన్ని ఎంతో దీక్ష, తపన, బలమైన ఆకాంక్ష ఉంటేనే నిర్మించడం సాధ్యమవుతుంది. ఓం సిటీ హైదరాబాద్‌కు ఇది అద్భుతమైన బహుమతి’ అని సీఎం కేసీఆర్ అప్పట్లో ప్రశంసల వర్షం కురిపించారు. అప్పటి ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్, సీనియర్ నేత తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి కేసీఆర్ ఫిలిం సిటీకి వెళ్లారు. ఆయనను రామోజీరావు స్వయంగా స్వాగతించారు. వారు కలిసి భోజనం చేశారు. ఫిలిం సిటీలోని ప్రత్యేక ఆకర్షణలను కేసీఆర్‌కు రామోజీ స్వయంగా చూపించారు. తాము ‘ఓం’ పేరుతో కొత్తగా చేపట్టబోతున్న ఆధ్యాత్మిక నగరి ప్రాజెక్టు గురించి వివరించారు. ‘ఓం’ ఆల్బమ్‌ను ఆయనకు అందించారు. ఫిల్మ్ సిటీలో సినిమాల కోసం వేసిన సెట్టింగ్‌లను కేసీఆర్ ఆసక్తిగా తిలకించారు. ఇదీ ఆరేళ్ల క్రితం నాటి దృశ్యం.
కానీ అంతర్జాతీయ స్థాయిలో 1500-2000 ఎకరాల్లో ‘సినిమా సిటీ’ నిర్మిస్తామని, బల్గేరియా తరహాలో దీని నిర్మాణం ఉంటుందని సీఎం కేసీఆర్ వెల్లడించారు. తెలంగాణా ఉద్యమానికి ముందు సంగతి ఎలా ఉన్నప్పటికీ, టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ‘ఈనాడు’ ఎక్కడా ధిక్కార రాతలు రాస్తున్న దాఖలాలు కూడా పెద్దగా లేవు. ఆ మధ్య ఎప్పుడో ధైర్యం చేసి పోలీసులకు వ్యతిరేకంగా ఓ వార్తా కథనాన్ని ప్రచురించింది. ఆ తర్వాత ఏర్పడిన పరిణామాలకు వణికిపోతూ, తన చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా మెయిన్ ‘ఫస్ట్ పేజీ’లో దాదాపు క్షమాపణ చెప్పిన తరహాలో ‘కించపరిచే ఉద్దేశం లేదు’ మహాప్రభో అంటూ చరిత్రాత్మక వివరణను ఇచ్చుకుంది. రెండోసారి టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక ఎక్కడా అక్షరం ముక్క జారకుండా ఈనాడు తన ప్రస్థానాన్ని కొనసాగిస్తోంది. ఇటువంటి పరిస్థితుల్లోనూ కేసీఆర్ అంతర్జాతీయ స్థాయి సినిమా సిటీ ప్రకటన ఇప్పుడెందుకు చేశారనే అంశంపై ఇటు తెలంగాణాలోనేకాదు, అటు పొరుగున గల ఏపీలోనూ తీవ్ర చర్చ జరుగుతోంది. రామోజీరావుకు చెక్ పెట్టేందుకే సీఎం కేసీఆర్ సినిమా సిటీని ప్రకటించారా? దీని నిర్మాణం ప్రతిపాదనలకే పరిమితమవుతుందా? లేక నిజంగానే నిర్మిస్తారా? అనే ప్రశ్నలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.