తెలంగాణాలో ధరణి పోర్టల్ లో ఆస్తుల నమోదుకు సంబంధించి రాష్ట్ర హైకోర్టు కీలక ఆదేశాలిచ్చింది. ఈమేరకు వ్యవసాయేతర ఆస్తుల వివరాల నమోదుపై ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ, కొన్ని ప్రశ్నలు సంధించింది. ధరణి పోర్టల్ లో భద్రతాపరమైన అంశాలపై దాఖలైన పిటిషన్లపై మంగళవారం హైకోర్టు విచారణ చేపట్టింది.
ధరణి పోర్టల్ లో నాన్ అగ్రికల్చర్ ప్రాపర్టీ వివరాలు నమోదు చేయొద్దని హైకోర్టు ఈ సందర్భంగా ఆదేశించింది. భద్రతాపరమైన నిబంధనలు పాటించకపోతే ఇబ్బందులు తలెత్తుతాయని హైకోర్టు వ్యాఖ్యానించింది. గూగుల్ ప్లే స్టోర్ లో ధరణి పోర్టల్ ను పోలిన మరో నాలుగు యాప్ లు ఉన్నాయని కోర్టు ఈ సందర్భంగా ప్రస్తావించింది.
అసలైన ధరణి పోర్టల్ ఏదో తెలుసుకోవడం ప్రజలకు ఇబ్బంది అవుతోందని, ధరణి పోర్టల్ విషయంలో ఎలాంటి భద్రతాపరమైన చర్యలు తీసుకొంటున్నారో తెలపాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇందుకు సంబంధించి రెండు వారాల్లో కౌంటర్ ద్వారా పూర్తి నివేదిక సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది.
అప్పటివరకు ఎలాంటి వివరాలు నమోదు చేయవద్దని కూడా పేర్కొంది. అదేవిధంగా బలవంతంగా ప్రజల నుండి వివరాలు సేకరించవద్దని ఆదేశిస్తూ, తదుపరి విచారణను ఈ నెల 20వ తేదీకి హైకోర్టు వాయిదా వేసింది.