తెలంగాణా రాష్ట్ర మంత్రి ఒకరు తీవ్ర వివాదంలో చిక్కుకున్నారు. రాసలీల వ్యవహారపు వివాదంలో ఇరుక్కున్న ఆ మంత్రి పదవి ఉంటుందా? ఊడుతుందా? ఇదీ తాాజా సందేహం. అధికార పార్టీ నాయకుల్లో తీవ్ర చర్చకు దారి తీసిన హాట్ హాట్ టాపిక్. విశేషమేమిటంటే తెలంగాణాలో అధికార పార్టీ వర్గీయులకు చెందిన 10 టీవీ న్యూస్ ఛానల్ లోనే మంత్రి రాసలీల వార్తా కథనం ప్రముఖంగా ప్రసారం కావడం. రాజకీయంగా ఇది ఆసక్తికర పరిణామంగా పరిశీలకులు భావిస్తున్నారు.
ఓ యువతితో సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు భావిస్తున్న మంత్రి ఒకరు మరో మహిళపై కన్నేసినట్లు సాగుతున్న ప్రచారపు నేపథ్యంలో ఈ వ్యవహారం వెలుగు చూడడం గమనార్హం. మంత్రితో సాన్నిహిత్యం గల యువతి ఒకరు మంత్రి ‘కాంక్షించిన’ మహిళను తనకు గల మసాజ్ సెంటర్ కు తీసుకువెళ్లి నగ్నచిత్రాలు తీసినట్లు ప్రచారం జరుగుతున్న ఘటన ఈ బాగోతానికి హేతువుగా భావిస్తున్నారు. దసరా పర్వదినం సందర్భంగా మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న నగరంలోనే నిర్వహించిన ఓ ‘షో’కు ఆ మహిళ ముఖ్య అతిథిగా హాజరైందంటున్నారు.
ఈ సందర్భంగా మంత్రితో సన్నిహితంగా ఉండే యువతి ముఖ్య అతిథిగా హాజరైన మహిళను మసాజ్ పేరుతో తాను నిర్వహించే మసాజ్ సెంటర్ కు తీసుకువెళ్లి తన సెల్ ఫోన్ ద్వారా నగ్నచిత్రాలు తీసిందనే ప్రచారం వ్యాప్తిలోకి వచ్చింది. అయితే తనకు మసాజ్ చేస్తూనే నగ్నచిత్రాలు తీస్తున్నారని గమనించిన ఆ మహిళ మసాజ్ సెంటర్ లోనే మంత్రి సన్నిహితురాలైన యువతితో ఘర్షణకు దిగినట్లు ఓ కథనం. ఈ సందర్భంగా తన ఫొటోలు తీసిన మసాజ్ సెంటర్ నిర్వాహకురాలైన యువతి ఫోన్ లాక్కుని, అందులో గల చిత్రాలను నేరుగా ప్రభుత్వ పెద్దలకే సదరు మహిళ పంపించి తన గోడును వెళ్లబోసుకుందనే ప్రచారం జరుగుతోంది.
బాధిత మహిళకు సీఎంవోలో పనిచేసే బంధువు కూడా ఒకరు ఉన్నారని, దీంతో విషయం ప్రభుత్వ పెద్దలకు చేరేందుకు మార్గం సుగమమైందంటున్నారు. మొత్తంగా ఓ యువతితోనేగాక, ఆ యువతి ద్వారా మరో మహిళకోసం మంత్రి నెరపిన ‘చాటింగ్’ బాగోతం మాత్రం సోషల్ మీడియాలో రచ్చరచ్చగా మారింది. అంతేగాక విషయం నేరుగా అధికార పార్టీకి చెందిన వర్గీయుల న్యూస్ ఛానల్ ద్వారానే మరింత బహిర్గతం కావడం ఆసక్తికర పరిణామంగా పరిశీలకులు భావిస్తున్నారు. అంతకు ముందే నిన్న ఓ చిన్న పత్రికలో ‘ఔను.. మంత్రి ప్రేమలో పడ్డారు..!’ శీర్షికన ఇదే అంశంపై ఓ వార్తా కథనం కూడా ప్రచురితమైంది.
ఈ మొత్తం ఎపిసోడ్ లో మంత్రి ‘చిలిపి చాటింగ్’ చేశారనే వాదన మాత్రమే ప్రస్తుతానికి తెరపైకి రావడం గమనార్హం. ఈ నేపథ్యంలో ఇంటలిజెన్స్ విభాగం రంగంలోకి దిగిందని, హోటల్ సీసీ టీవీ ఫుటేజీ కోసం ప్రయత్నిస్తున్నారనేది తాజా సమాచారపు కథనం. మొత్తంగా తెలంగాణాలోని ఓ మంత్రి ‘రాసలీలల’ వివాదంలో చిక్కుకున్నారు. ఈ పరిణామాల్లో ఇంతకీ ఆయన మంత్రి పదవి ఉంటుందా? ఊడుతుందా? మొత్తం 18 మంది మంత్రివర్గ సభ్యుల్లో వివాదంలో చిక్కుకున్న మంత్రి సీటు ఖాళీ కావడం ఖాయమేనా? తెలంగాణా రాజకీయాలను కీలక మలుపుతిప్పే దిశగా ప్రభుత్వ పెద్దల నిర్ణయం ఉంటుందనే అంచనాల మధ్య ఇదీ అసలు సిసలు తాజా చర్చ.