ఆన్ లైన్ క్లాసులలో మొబైల్ సిగ్నెల్ కోసం అవస్థలు !!
‘చెట్టులెక్కగలవా ఓ నరహరి… పుట్టలెక్కగలవా? మిద్దె లెక్కి మా మొబైల్ సిగ్నెల్ అందిపుచ్చుకోగలవా?’ అంటూ కేరళలో మొబైల్ నెట్వర్క్ సర్వీస్ లు పిల్లలను నానా ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. కోవిడ్ – 19 నివారణ చర్యల్లో భాగంగా విద్యా సంవత్సరం నష్టపోకుండా పలు కళాశాలలు ఆన్లైన్ తరగతులను తమ తమ విద్యార్థినీ, విద్యార్థుల కోసం నిర్వహిస్తున్నాయి. మరోవైపు మొబైల్ సిగ్నెల్ విద్యార్థినీ విద్యార్థులతో దోబూచలాడుతూ ఇలా విన్యాసాలు చేయిస్తున్నాయి.
కేరళ రాష్ట్రంలోని మలప్పురం జిల్లా కొట్టక్కల్ టౌన్ లో ఆన్ లైన్ క్లాస్‌కు హాజరు కావడానికి కేరళ కుట్టి నమిత నారాయణన్ తన రెండు అంతస్తుల భవనం ఇంటి పైకప్పుపై కూర్చొని పాఠాలు శ్రద్ధగా వింటున్న దృశ్యం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. తన మొబైల్ ఫోన్ లోని హై స్పీడ్ ఇంటర్నెట్ సిగ్నల్ సరిగా రాకపోవడంతో ఆమె పాఠాలు వినేందుకు రోజూ ఇలా చేయాల్సి వస్తోంది. కొట్టక్కల్ పట్టణం కె ఎం సీ టి ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో బి ఏ ఫైనల్ ఇయర్ చదువుతున్న నమిత నారాయణన్ ఈ ఏడాది జూన్ 1 వ తేదీ నుంచి ఆన్లైన్ తరగతులలో పాఠాలు వినేందుకు ఈ తరహా కష్టాలు పడుతోంది.
తనలాగే పలువురు విద్యార్థినీ, విద్యార్థులు తమ టౌన్ లో నానా అవస్థలు పడుతున్నట్లు ఆమె తెలిపింది. ఈ వార్తను తెలుసుకున్న కొట్టక్కల్ ఎం ఎల్ ఏ సయ్యద్ అబిద్ స్పందించి తమ టౌన్లో మొబైల్ నెట్వర్క్ సిగ్నల్ సరిగ్గా వచ్చేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
✍️ ఎన్. జాన్సన్ జాకబ్