‘టైమ్స్’ మీడియా గ్రూప్… ఇండియలోనే ప్రముఖ మీడియా సంస్థగా సంబోధించడంకన్నా, మీడియా దిగ్గజంగా అభివర్ణించడమే సముచితం. ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ వంటి ప్రతిష్టాత్మక ఆంగ్ల పత్రికతోపాటు ‘టైమ్స్ నౌ’ వంటి ప్రముఖ న్యూస్ ఛానల్ కూడా ‘టైమ్స్’ గ్రూపునకు చెందిన సంస్థలే. అంతేకాదు దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో డజన్ వరకు ప్రాంతీయ భాషల్లో పత్రికా ప్రచురణలు కూడా ఉన్నాయి. వందల కోట్ల టర్నోవర్ గల ‘టైమ్స్’ మీడియా గ్రూపు కేవలం రూ. 8.15 కోట్ల మొత్తానికి ఏపీ ప్రభుత్వం ముందు సాగిలపడిందా? ఇదీ మీడియా వర్గాల్లో తాజాగా సాగుతున్న హాట్ హాట్ చర్చ.
విషయమేమిటంటే… నిన్న ఏపీలోని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఓ ఉత్తర్వు (జీవో ఆర్టీ నెం. 1692)ను జారీ చేసింది. ఉత్తర్వులోని సారాంశం ఏమిటంటే… ఢిల్లీకి చెందిన మెసర్స్ బెన్నెట్ కోల్మాన్ అండ్ కంపెనీ లిమిటెడ్ సంస్థ (బీసీసీఎల్) ఓ ప్రతిపాదన తీసుకువచ్చింది. ఏపీ రాష్ట్రంతోపాటు, అక్కడి నాయకుల ఇమేజ్ ను జాతీయ స్థాయిలో పెంపొందించేందుకు ‘టైమ్స్’ నెట్ వర్క్ ద్వారా ఆయా బీసీసీఎల్ సంస్థ పాటుపడుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ విధానాలపై, పథకాలపై అవగాహన కల్పిస్తుంది. ఈ ప్రతిపాదన అమలుకు రూ. 8.15 కోట్ల మొత్తం నిధులను విడుదల చేస్తూ రాష్ట్ర సమాచార శాఖ తరపున ఉత్తర్వును జారీ చేశారు. ఆయా నిధులను సమాచార శాఖ ద్వారా డ్రా చేసి ప్రతిపాదిత అంశం అమలుకు ఖర్చు చేయాలని కూడా జీవోలో నిర్దేశించారు.
ఏపీ ప్రభుత్వం జారీ చేసిన ఈ ఉత్తర్వుపై సహజంగానే మీడియా వర్గాల్లో చర్చ జరుగుతోంది. సాధారణంగా మీడియా సంస్థల్లో రకరకాల వార్తా కథనాలు ప్రచురితమవుతుంటాయి. ఒక్కోసారి అది అడ్వర్టయిజ్మెంటో, వార్తో తెలియని స్థితిలో కూడా కథనాలు ప్రచురితమవుతుంటాయి. ఎలక్షన్ టైమ్ లో వచ్చే ‘పెయిడ్ ఆర్టికల్స్’ అంశం పాతబడిన ముచ్చట. అధికార పార్టీ నాయకులను కీర్తిస్తూ, వారి పనితీరు అద్భుతమంటూ రోజుకో పత్రికల్లో భజన చేసే కొత్త తరహా వార్తా కథనాల వెనుక ‘పేమెంట్’ గుసగుసలు సరికొత్త సంగతులు. తెలుగు మీడియాలో ఇటువంటి వార్తా కథనాల సంగతి బహిరంగ రహస్యమే. ఒకే తరహా భజన కథనం దశలవారీగా, రోజుకో పత్రికలో ప్రచురితమవుతున్నదంటే అది అడ్వర్టయిజ్మెంట్ గానే పాఠకులు పరిగణిస్తున్న రోజులివి.
ఈ నేపథ్యంలో తెలుగు మీడియా సంగతి ఎలా ఉన్నప్పటికీ దేశవ్యాప్తంగా ప్రముఖ సంస్థగా భావించే ‘టైమ్స్’ గ్రూపు కేవలం రూ. 8.15 కోట్ల మొత్తానికి జగన్ సర్కార్ ముందు సాగిలపడిందా? అనే సంశయాలు తలెత్తడం సహజం. అయితే ‘టైమ్స్’ సంస్థ ఉద్యోగ వర్గాలు మాత్రం ఈ జీవో గురించి వివరిస్తున్న తీరు భిన్నంగా ఉండడమే అసలు విశేషం. ‘టైమ్స్’ గ్రూపు సంస్థకు అనేక వ్యాపారాలు ఉన్నాయని, బీసీసీఎల్ అనే వ్యవస్థ ‘టైమ్స్’ గ్రూపునకు పేరెంట్ సంస్థగా ఆ వర్గాలు చెబుతున్నాయి. వ్యాపార కార్యకలాపాల్లో భాగంగా పబ్లిక్ రిలేషన్స్ వ్యవహారాలను కూడా బీసీసీఎల్ సంస్థ నిర్వహిస్తుందంటున్నారు. ఏదేని ప్రముఖ నగరాల్లో, కేంద్రాల్లో పెట్టుబడుల కోసం నిర్వహించే సెమినార్ల వంటి కార్యక్రమాలను బీసీసీఎల్ సమర్థంగా నిర్వహిస్తుందని చెబుతున్నారు. ఆయా సందర్భాల్లో ఏపీ ప్రభుత్వ విధానాలను, పథకాలను భాగస్వామ్యం చేస్తూ, ప్రతిష్టను పెంచేందుకు నిర్వహించే కార్యక్రమాల కోసమే ఆయా మొత్తాన్ని ఏపీ ప్రభుత్వం మంజూరు చేసిందనేది టైమ్స్ గ్రూపు ఉద్యోగ వర్గాల వాదన.
మొత్తంగా జాతీయ స్థాయిలో తమ ప్రభుత్వ, నాయకుల ఇమేజ్ ను పెంపొందించేందుకు జగన్ సర్కార్ రూ. 8.15 కోట్ల మొత్తాన్ని ‘టైమ్స్’ గ్రూపు పేరెంట్ సంస్థగా పేర్కొంటున్న బీసీసీఎల్ కు కేటాయిస్తూ జీవో జారీ చేయడం మీడియా వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.