దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన గొర్రెకుంట పాడుబడ్డ బావి ఘటనకు సంబంధించి 9 హత్యల కేసులో నిందితుడైన వ్యక్తి దోషిగా తేలడంతో అతనికి ఉరిశిక్ష పడింది. ఈ ఘటనలో నిందితుడైన సంజయ్ కుమార్ ను దోషిగా నిర్ధారిస్తూ వరంగల్ మొదటి అదనపు సెషన్స్ కోర్టు కొద్దిసేపటి క్రితం తుది తీర్పును వెలువరించింది.
గత మే 21న వరంగల్ రూరల్ జిల్లా గీసుగొండ మండలం గొర్రెకుంటలోని ఓ గన్నీ బ్యాగ్స్ కంపెనీలో పనిచేసే 9 మందికి మత్తు ఇచ్చి, వారు సృహ కోల్పోయిన తర్వాత సజీవంగా పక్కనే గల పాడుబడ్డ బావిలో పడేసి హత్య చేసిన ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం కలిగించింది.
ఈ కేసులో నిందితుడు బీహార్ కి చెందిన సంజయ్ కుమార్ యాదవ్ కు ఉరి శిక్ష ఖరారు చేస్తూ వరంగల్ అదనపు సెషన్స్ కోర్టు న్యాయమూర్తి తీర్పు చెప్పారు. ఈ కేసులో మొత్తం 67 మందిని సాక్షులుగా విచారించగా, 72 గంటల్లోనే పోలీసులు కేసును ఛేదించారు.