‘తివిరి యిసుమున తైలంబు దీయవచ్చు…’ బర్తృహరి సుభాషితంలోని ఓ లైను ఇది. ప్రయత్నము చేత ఇసుక నుంచి చమురు తీయవచ్చు.. అనేది ఆయా సుభాషితంలోని వాక్యపు అసలు భావం. ‘తివిరి చెత్తన ‘సొమ్ము’ దీయవచ్చు.’ అంటే… ప్రయత్నం చేత చెత్త నుంచి కూడా లక్షలాది రూపాయలను సంపాదించవచ్చు అనేది ఖమ్మం నగర పాలక సంస్థ అధికారుల సరికొత్త యోచన.
ఇంతకీ విషయమేమిటంటే… నిర్దేశిత ప్రాంతాల్లో టోకున పేరుకునే చెత్త నుంచి కూడా ఆదాయం సముపార్జించుకోవచ్చని ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ అధికారుల సరికొత్త ప్లాన్. అంతేకాదు, అసలు ఈ చెత్త నుంచి అనూహ్య మొత్తంలో ఆదాయం లభిస్తుందని కూడా అంచనా వేస్తున్నారు. ఈమేరకు ప్రయోగాత్మకంగా ప్లాన్ అమలు చేస్తున్నారు కూడా. ఇంతకీ చెత్త నుంచి ఆదాయం లభించే విధంబెట్టిదనిన…
మీకో ఫంక్షన్ హాల్, లేదంటే హోటల్ ఉందనుకోండి. అక్కడ ఏదేని శుభకార్యం లేదా, ఇతరత్రా ఉత్సవాలు జరిగాయనుకోండి. ఎప్పటిలాగే పారిశుధ్య కార్మికులకు పదో, పరకో చెల్లించి చెత్తను అప్పగిస్తామంటే కుదరదు. ఇండ్లల్లోగాని, ఫంక్షన్ హాల్స్ లో గాని, హోటల్స్ లో గాని నిర్వహించే కార్యక్రమాల్లో, చివరికి దేవాలయాల్లో పూజల నిర్వహణ సందర్భంలో గాని ఏర్పడే పెద్ద మొత్తపు చెత్తను తొలగించడానికి ఖచ్చితంగా నగర పాలక సంస్థ సిబ్బందికి చెప్పాల్సిందే. కార్యక్రమం ఏదైనప్పటికీ పేరుకునే చెత్త గురించి ఓ రోజు ముందుగానే వారికి సమాచారం అందించాలి.
సమాచారం ఇచ్చిందే తడవుగా మున్సిపల్ సిబ్బంది ఫంక్షన్ జరిగే ప్రాంతంలో ఓ చెత్త వాహనాన్ని ఏర్పాటు చేసి, చెత్తను తీసుకువెడతారు. కాకపోతే ఇందుకు ప్రతి ట్రిప్పు చెత్తకు రూ. 500 మొత్తాన్ని వసూల్ చేస్తారు. అబ్బే ఈ మాత్రం దానికి రూ. 500 ఎందుకు చెల్లించాలి? దండగమారి ఖర్చుగా భావించి, ఆయా చెత్తను ఎత్తుకెళ్లి ఏ ఖాళీ ప్రదేశాల్లోనో, మరే రోడ్డు పక్కనో పారబోస్తే మాత్రం మరిన్ని కష్టాలు ఎదుర్కోవలసిందే. ఇటువంటి చర్యలకు పాల్పడినవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడమే కాదు, రూ. 5,000 నుంచి రూ. 10,000 వరకు ఫైన్ విధించి మరీ వసూల్ చేస్తారు.
అంతేకాదు ఇదే చెత్త నుంచి మరికొన్ని మార్గాల్లోనూ ఆదాయం లభించే యోచనను కూడా మున్సిపల్ అధికారులు చేశారట. తడి చెత్తనుగాని, పొడిచెత్తను గాని ఇక నుంచి నేరుగా డంపిగ్ యార్డుకు తరలించకుండా వినూత్న యోచన చేశారు. సాధారణంగా పొడిచెత్తలో లభ్యమయ్యే అట్టపెట్టెలను, ప్లాస్టిక్ సీసాల వంటి వ్యర్థాలను పారిశుధ్య కార్మికులు ఏరుకుని ఎంతో, కొంతకు అమ్ముకుని ‘చిల్లర’ ఖర్చులకోసం సంపాదించుకునేవారు. కానీ ఇక నుంచి పొడి చెత్తను మెప్మాకు చెందిన డీఆర్సీ పాయింట్లలో (డ్రై రిసోర్స్ సెంటర్లు) తూకం వేసి లభించే ఆదాయాన్ని అక్కడే రికార్డు చేయించాలి. ఆయా మొత్తాన్ని డీఆర్సీ వాళ్లు కార్పొరేషన్ ఖాతాలో జమచేస్తారు. అంతే కాదు తడి చెత్తను కూడా కంపోస్ట్ ఎరువుగా మార్చేందుకు పథకరచన చేశారు. మొత్తంగా చెత్తను నేరుగా డంపింగ్ యార్డుకు తరలించే ప్రక్రియను తగ్గించాలి. ప్రతి కోణంలోనూ చెత్త ద్వారా ఆదాయం లభించే దిశగా ప్రయత్నించాలి.
ప్రయోగాత్మకంగా చేపట్టిన ఈ ప్రక్రియలో నగరంలోని ఓ డివిజన్ లో ఇప్పటికే రూ. 5,000 మొత్తం ఆదాయం లభించనున్నట్లు తేలినట్లు సమాచారం. ఈ డివిజన్ లో ఫంక్షన్ హాల్స్, హోటల్స్ వంటి కమర్షియల్ సంస్థలు పెద్దగా లేకపోయినా రూ. 5 వేల మొత్తం ఆదాయంగా లభిస్తున్నట్లు తేలిందంటే, నగరం వ్యాప్తంగా లభించే ఆదాయపు మొత్తాన్ని అంచనా వేసుకోవచ్చని అధికారులు భావిస్తున్నారు. సగటున ప్రతి డివిజన్ కు రూ. 10 వేల మొత్తం ‘చెత్త’ ద్వారా నెలసరి ఆదాయం లభించినా, మొత్తం 50 డివిజన్లలో రూ. 5.00 లక్షల మొత్తం లభించవచ్చని ఓ అంచనా. ఇక పొడిచెత్త విక్రయం, తడి చెత్త కంపోస్ట్ ఎరువుగా మార్చడం వంటి ప్రక్రియల్లో లభించే ఆదాయాన్ని కూడా కలిపితే ‘తివిరి చెత్తన సొమ్ము దీయవచ్చు’నని నిరూపించినట్లేగా!
కాకపోతే మున్సిపల్ అధికారుల ఈ సరికొత్త ఆదాయపు ప్లాన్ వల్ల పారిశుధ్య కార్మికులే లోలోన తీవ్రంగా బాధపడిపోతున్నారట. తమకు ఇక చిల్లర ఖర్చులకూ కటకట తప్పదని… అదీ సంగతి.