ఖమ్మంలో పదమూడేళ్ల మైనర్ బాలిక విషాదాంత ఘటనలో ఓ డాక్టర్ సహా ముగ్గురిని పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. ఖమ్మం రూరల్ మండలం పల్లెగూడేనికి చెందిన మైనర్ బాలికపై అత్యాచారయత్నం, ప్రతిఘటించిన ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటించిన సంఘటన గురించి తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా కలకలం కలిగించిన ఈ అమానవీయ ఘటనలో దాదాపు 28 రోజులపాటు మృత్యువుతో పోరాడిన బాధిత బాలిక ఇటీవలే తుదిశ్వాస విడిచింది. ఈ అమానుష ఘటనలో ప్రధాన నిందితుడైన అల్లం మారయ్యను పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు.
కేసు తదుపరి దర్యాప్తులో భాగంగా… కాలిన గాయాలతో గల మైనర్ బాలిక ఉదంతాన్ని దాచిపెట్టి రహస్య చికిత్స చేసినందుకుగాను ఖమ్మంలోని పూజ ఆసుపత్రి నిర్వాహకుడు డాక్టర్ బాబూరావును అరెస్ట్ చేసినట్లు వన్ టౌన్ సీఐ చిట్టిబాబు చెప్పారు. అదేవిధంగా మైనర్ బాలికను పనిలో పెట్టుకున్నందుకుగాను ప్రధాన నిందితుడు అల్లం మారయ్య తండ్రి అల్లం సుబ్బారావును, అతని భార్య చిన్న రాములమ్మను కూడా అరెస్ట్ చేశామన్నారు. ఆయా ముగ్గురు నిందితులను కోర్టులో హాజరు పర్చగా న్యాయస్థానం14 రోజుల రిమాండ్ విధించినట్లు సీఐ చిట్టిబాబు వివరించారు.