ప్రభుత్వ ఉద్యోగులకు రావలసిన పెండింగ్ డీఏ విషయంలో తెలంగాణా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 2019 జూలై 1 నుంచి రావాల్సిన ఒక డీఏను వెంటనే ఉద్యోగులకు చెల్లించాలని ఆర్థిక శాఖను సీఎం కేసీఆర్ ఆదేశించారు.
అదేవిధంగా దసరా పండుగ మరుసటి రోజైన 26వ తేదీని సెలవు దినంగా ప్రకటించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. ఇకపై ప్రతీ ఏడాది దసరా మరుసటి రోజును సెలవు దినంగా నిర్ణయిస్తూ షెడ్యూల్ రూపొందించాలని అధికారులను ఆదేశించారు.
కాగా ప్రస్తుతం అనుసరిస్తున్న డీఏ విషయంలో విధానం మార్చాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం డీఏ ఎంత అనే విషయంలో కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటున్నదని, దాన్ని రాష్ట్రాలు అనుసరిస్తున్నాయన్నారు. కేంద్రం అంచనాలు తయారు చేసి, నిర్ణయం తీసుకునే విషయంలో జాప్యం జరుగుతున్నదన్నారు. ప్రస్తుతం మూడు డీఏలు చెల్లించాల్సి ఉందని, ఇందులో రెండు డీఏల విషయంలో కేంద్రం తన నిర్ణయాన్ని ప్రకటించాల్సి ఉందన్నారు. కేంద్రం తీసుకునే నిర్ణయంలో జాప్యం వల్ల రాష్ట్రాలు జాప్యం చేయాల్సి వస్తున్నదన్నారు.
ఫలితంగా బకాయిలు పేరుకుపోతున్నాయని, ఉద్యోగులకు సకాలంలో డీఏ అందడం లేదన్నారు. ఈ పరిస్థితి మారాలని, ప్రతీ ఆరు నెలలకు ఒక సారి గడువు తేదీ రాగానే రాష్ట్రంలో చెల్లించాల్సిన డీఏ నిర్ణయించాలన్నారు. కేంద్రం అంచనాలు అందిన తర్వాత అవసరమైతే దాన్ని సవరించాలన్నారు. ఉదాహరణకు రాష్ట్రం 3 శాతం డీఏ ప్రకటించి అమలు చేయాలని నిర్ణయిస్తే, కేంద్రం 3.5 శాతం అని ప్రకటిస్తే, మిగిలిన 0.5 శాతం చెల్లించాలన్నారు. అదేవిధంగా 2.5 గా నిర్ణయిస్తే 0.5 శాతం తగ్గించి చెల్లించాలన్నారు. ఈ విషయంలో వెంటనే ప్రతిపాదనలు తయారు చేయాలని, కేబినెట్లో చర్చించి విధాన నిర్ణయం తీసుకుంటామని సీఎం వెల్లడించారు.