మానుకోట బాలుడు దీక్షిత్ రెడ్డిని కిరాతకంగా హత్య చేసిన కిడ్నాపర్ మంద సాగర్ ను పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. అతని నుంచి ఓ సెల్ ఫోన్ కూడా స్వాధీనం చేసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించిన ఈ ఘటనలో నిందితుడైన సాగర్ దీక్షిత్ రెడ్డిని ఎలా కిడ్నాప్ చేసిందీ, ఏవిధంగా పొట్టనబెట్టుకున్నాడనే అంశాలను మహబూబాబాద్ ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి మీడియా సమావేశలో వెల్లడించారు.
ఎస్పీ కోటిరెడ్డి కథనం ప్రకారం… నిందితుడు మందా సాగర్ ఈనెల 18వ తేదీన సాయంత్రం 5.30 గంటల ప్రాంతంలో పథకం ప్రకారం బాలున్ని కిడ్నాప్ చేశాడు. కుసుమ రంజిత్ రెడ్డి ఇంటికి AP 36 Q 8108 అనే నకిలీ నెంబర్ ప్లేటును తగలించి బైక్ పై బయలుదేరాడు. మార్గమధ్యంలో జీవన్ అనే వ్యక్తి ఇంటి మూల వద్ద బాలుడు దీక్షిత్ రెడ్డిని ఉద్ధేశించి ‘మూట తీసుకుని వచ్చేదుంది. బండి ఎక్కు’ అని నమ్మించాడు. బైక్ పై దీక్షిత్ రెడ్డిని ఎక్కించుకుని సీసీ కెమెరాల కంట పడకుండా కృష్ణ కాలనీ నుంచి ఆర్కే టవర్స్ రోడ్ నుంచి యాదవ నగర్ కాలనీ మీదుగా తాళ్లపూసలపల్లి రోడ్డు ఎక్కాడు. అక్కడి నుంచి కేసముద్రం వైపు వెడుతూ అన్నారం సమీపంలోని దానమయ్య గుట్ట పక్కన బైక్ ఆపి, దీక్షిత్ రెడ్డిని గుట్టపైకి తీసుకువెళ్లాడు.
అయితే గుట్ట వద్ద దీక్షిత్ రెడ్డి భయపడ్డాడు. తనను ఇంటికి తీసుకువెళ్లాలని ఏడవడం ప్రారంభించాడు. అయితే తాను ఉన్నచోటు తెలిసిపోతుందని, దీక్షిత్ ను విడిచిపెట్టినా కూడా తన ఉనికి బయటపడుతుందని నిందితుడు సాగర్ భావించాడు. దీంతో దీక్షిత్ కు నిద్రమాత్రలు ఇచ్చి, ఆ తర్వాత కిరాతకంగా కర్చీఫ్ తో చేతులు కట్టేశాడు. అనంతరం దీక్షిత్ ధరించిన టీ షర్ట్ తీసి అతని మెడకు ఉరి బిగించి చంపాడు. ఆ తర్వాత ఘటనా స్థలం నుంచే దీక్షిత్ తల్లికి ఫోన్ చేసి రూ. 45 లక్షల మొత్తాన్ని డిమాండ్ చేశాడు. డబ్బు ఇవ్వకుంటే బాబును చంపేస్తానని బెదిరించాడు.
దీక్షిత్ కుటుంబానికి ఫోన్ చేసేందుకు సాగర్ ప్రత్యేకమైన ఇంటర్నెట్ అప్లికేషన్ ను ఉపయోగించాడు. మన దేశంలోని టెలికామ్ సర్వీసుల ప్రమేయం లేకుండా కేవలం ఇంటర్నెట్ ద్వారానే ఈ కాల్స్ వెళతాయి. అందువల్ల నిందితున్ని గుర్తించడానికి హైదరాబాద్, వరంగల్ సైబర్ క్రైం, ఇంటలిజెన్స్, టాస్క్ ఫోర్స్ విభాగాల్లో పనిచేసే నిపుణులను రంగంలోకి దించారు. విదేశీ అప్లికేషన్ ద్వారా వస్తున్న కాల్స్ ను గుర్తించడానికి మూడు రోజులపాటు శ్రమించి, ఎట్టకేలకు పోలీసులు నిందితున్ని గుర్తించారు. బాలుడు దీక్షిత్ రెడ్డి తండ్రి రంజిత్ రెడ్డి ఇంటి పక్కనే నిందితుడైన సాగర్ కూడా ఇల్లు కలిగి ఉండడం, రంజిత్ రెడ్డి ఆర్థికంగా బలంగా ఉండడాన్ని సాగర్ గమనించి ఈ దుశ్చర్యకు పాల్పడినట్లు ఎస్పీ కోటిరెడ్డి వివరించారు.
ఈ కేసును ఛాలెంజ్ గా స్వీకరించామని, కిడ్నాప్ అయిన దీక్షిత్ రెడ్డికి ఎటువంటి హాని జరగకుండా కేసు ఛేదించాలని డీజీపీ సూచించారని ఎస్పీ చెప్పారు. అయితే దురదృష్టవశాత్తు కిడ్నాపైన బాలున్ని నిందితుడు వెంటనే చంపి, ఆ తర్వాత పెట్రోల్ పోసి ఆనవాళ్లు లేకుండా మృతదేహాన్ని కాలబెట్టాడని చెప్పారు. నిందితుని శిక్ష పడే విధంగా కేసు పరిశోధన కొనసాగుతుందని ఎస్పీ కోటిరెడ్డి హామీ ఇచ్చారు.