ఉత్తర తెలంగాణాలో రైతాంగ ఉద్యమాలు రాజుకుంటున్నాయా? ముఖ్యంగా రైతులు పెద్ద ఎత్తున రోడ్డెక్కుతున్న దృశ్యాలు ఇదే అంశాన్ని వెల్లడిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మద్ధతు ధరకు రాష్ట్ర ప్రభుత్వం కూడా కొంత మొత్తాన్ని కలిపి పంటలను కొనుగోలు చేయాలనే డిమాండ్ తో ఈనెల 16వ తేదీన జగిత్యాల జిల్లా మెట్ పల్లి రైతులు కదం తొక్కిన సంగతి తెలిసిందే. జగిత్యాల జిల్లా వ్యాప్తంగా సుమారు రెండు వేల మందికిపైగానే రైతులు తరలివచ్చి మెట్ పల్లిలో భారీ ధర్నా చేశారు. ఈ సందర్భంగా జరిగిన పరిణామాల్లో ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు ఇంటిని రైతులు ముట్టడించారు. ఆయన ఇంటిపై రాళ్లు రువ్వడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. రైతు ఐక్యవేదిక ఆధ్వర్యంలో జరిగిన ఈ ధర్నా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనానికి దారి తీసింది.
అయితే ఈ ధర్నా చేసిన మొక్కజొన్న రైతులపై పోలీసులు కేసు నమోదు చేయడం తాజాగా కలకలం సృష్టిస్తోంది. ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు ఇంట్లోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించారని, ఆ సందర్భంగా విధి నిర్వహణలో గల తమను అడ్డుకున్నారని బి. శ్రీనివాస్ అనే కానిస్టేబుల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు రైతులపై కేసు నమోదు చేశారు. మొత్తం 18 మంది రైతులపై ఐపీసీ 143, 147, 148, 188, 341, 353 రెడ్ విత్ 149 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు తాజా వార్త.
ఈ పరిణామాల్లోనే మొక్కజొన్నకు మద్ధతు ధర కల్పించి, ప్రభుత్వమే కొనుగోలు చేయాలని, భారీ వర్షాల కారణంగా నష్టపోయిన రైతాంగానికి పరిహారం చెల్లించి ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ నిన్న కామారెడ్డి జిల్లాలో రైతులు రోడ్డెక్కారు. టేక్రియాల్ హైవేపై రైతులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. కామారెడ్డి కలెక్టరేట్ లోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించగా, పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా జరిగిన తోపులాటలో కొందరు రైతులు గాయపడ్డారు.
కాగా మెన్న మెట్ పల్లిలో, నిన్న టేక్రియాల్ హైవేపై రైతుల ధర్నా ఉదంతాల నేపథ్యంలోనే నేడు ‘ఛలో జగిత్యాల’ కార్యక్రమానికి రైతు ఐక్యవేదిక నాయకులు పిలుపునిచ్చారు. అయితే ఎమ్మెల్సీ టి. జీవన్ రెడ్డిని పోలీసులు ముందస్తుగా హౌస్ అరెస్ట్ చేశారు. అంతేగాక పలువురు రైతులను, రైతు ఐక్యవేదిక నేతలను కూడా పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రాజుకుంటున్న రైతాంగ ఉద్యమాలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. ఉత్తర తెలంగాణా ముఖ్య కేంద్రమైన జగిత్యాల జిల్లా కేంద్రం నుంచే ఈ ఉద్యమాలు తాజాగా ప్రారంభం కావడం గమనార్హం.
ఇదిలా ఉండగా మక్కల సాగుపై తెలంగాణా ప్రభుత్వం నేడు విధాన నిర్ణయం తీసుకునే అవకాశముంది. ఈమేరకు ఈరోజు మధ్యాహ్నం 2.30 గంటలకు ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు. నిరుడు ఎన్ని ఎకరాల్లో మక్కలు వేశారు? వాటికి ఎంత ధర వచ్చింది? తదితర వివరాలను సమావేశానికి తీసుకురావల్సిందిగా అధికారులను సీఎం ఆదేశించారు. యాసంగిలో మక్కల సాగు చేయడం వల్ల లాభమా? నష్టమా? దేశంలో మక్కల మార్కెట్ పరిస్థితి ఏంటి? తదితర అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకుంటారు. వానాకాలం పంటల కొనుగోలు, యాసంగిలో నిర్ణీత పంటల సాగు విధానంపైనా చర్చించనున్నారు. వ్యవసాయ, పౌర సరఫరాలు, మార్కెటింగ్ శాఖ మంత్రులు, ఉన్నతాధికారులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఈ సమావేశంలో పాల్గొంటారు.
ఫొటో: ఈనెల 16న మెట్ పల్లిలో రైతులు ధర్నా చేసిన దృశ్యం (ఫైల్)