బాలుని విషాదాంత ఘటనలో మానుకోట పోలీసుల లోతైన దర్యాప్తు
కిడ్నాప్, ఆ తర్వాత దారుణ హత్యకు గురైన బాలుడు దీక్షిత్ రెడ్డి (9) ఘటనలో వార్తల్లోకి వచ్చిన మనోజ్ రెడ్డి ఎవరు? ఘటనలో అతని పాత్ర ఏమిటి? ఈ కిరాతకంతో అతనికి కూడా ఏదేని సంబంధముందా? ఏ సంబంధమూ లేకుండానే మనోజ్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారా? నిందితునిగా ప్రకటించిన సాగర్ ను అదుపులోకి తీసుకున్నప్పటికీ, మనోజ్ రెడ్డిని పోలీసులు ఇంకా ఎందుకు విడిచిపెట్టలేదు? మహబూబాబాద్ ఘటనలో రేకెత్తుతున్న సందేహాలివి. దీక్షిత్ రెడ్డి ఘటనలో కిడ్నాప్ చేసిందీ, హత్య చేసిందీ మంద సాగర్ ఒక్కడేనని ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి మీడియా సమావేశంలో వెల్లడించారు. ఇదే దశలో బాలున్ని హత్య చేసిన మంద సాగర్ తోపాటు మనోజ్ రెడ్డి అనే వ్యక్తి కూడా తమ అదుపులో ఉన్నట్లు ఎస్పీ చెప్పారు.
రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ ఘటనలో పోలీసులు మొత్తం 24 మందిని విచారించడం గమనార్హం. అధునాతన టెక్నాలజీ సాయంతో నిందితులను పట్టుకున్నామని, మంద సాగర్ తోపాటు మనోజ్ రెడ్డిని కూడా అదుపులోకి తీసుకున్నట్లు స్వయంగా ఎస్పీ ప్రకటించారు. అయితే సాగర్, మనోజ్ రెడ్డి సహా మొత్తం నలుగురు వ్యక్తులు పోలీసుల అదుపులో ఉన్నట్లు కూడా ప్రచారం జరుగుతోంది. దీంతో దీక్షిత్ రెడ్డి హత్యోదంతంలో వీరి పాత్ర ఏమిటనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇంతకీ ఎవరీ మనోజ్ రెడ్డి? ఏమా పాత్ర? అనే వివరాల్లోకి వెడితే…
పోలీసు వర్గాల నుంచి అందిన విశ్వసనీయ సమాచారం ప్రకారం… మనోజ్ రెడ్డి అనే వ్యక్తి.., హత్యకు గురైన దీక్షిత్ రెడ్డి తండ్రి, జర్నలిస్ట్ రంజిత్ రెడ్డికి వరుసకు తమ్ముడే. దాయాదుల్లో ఒకరైన రంజిత్ రెడ్డి బాబాయి కుమారుడే మనోజ్ రెడ్డి. దాదాపు నలభై రోజుల క్రితం వరకు కూడా మనోజ్ రెడ్డి రంజిత్ రెడ్డి గల ట్రాక్టర్లను పర్యవేక్షించేవాడు. ఇసుకను రవాణా చేసే రంజిత్ రెడ్డికి గల దాదాపు అయిదు ట్రాక్టర్ల నిర్వహణను మనోజ్ రెడ్డే పర్యవేక్షించేవాడు. దీక్షిత్ రెడ్డిని హత్య చేసిన మంద సాగర్ కూడా ఒకప్పుడు రంజిత్ రెడ్డి వద్ద ట్రాక్టర్ డ్రైవర్ గా పనిచేశాడు. ఆ తర్వాత మెకానిక్ షాపును ఏర్పాటు చేసుకున్నాడు. అయితే తన ట్రాక్టర్ల నిర్వహణను చూసుకునే మనోజ్ రెడ్డిని దాదాపు 45 రోజుల క్రితం రంజిత్ రెడ్డి పనిలోంచి తొలగించాడు. ఆర్థిక లావాదేవీల వివాదమే ఇందుకు కారణమనే ప్రచారం జరుగుతోంది. రంజిత్ రెడ్డి, మనోజ్ రెడ్డి, మంద సాగర్ లు శనిగపురం గ్రామానికి చెందినవారే కావడం ఈ సందర్భంగా గమనార్హం.
అయితే దీక్షిత్ రెడ్డి కిడ్నాప్ పరిణామాల్లో 24 మందిని విచారించిన పోలీసులు మనోజ్ రెడ్డిని మాత్రం ఇంకా తమ అదుపులోనే ఉంచుకున్నారు. ఘటనకు సంబంధించి పూర్తి దర్యాప్తు జరుగుతోందని, మొత్తం వివరాలు ఈరోజు సాయంత్రం లేదా రేపు ఉదయం వెల్లడిస్తామని ఎస్పీ కోటిరెడ్డి ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఇంకా పోలీసుల అదుపులోనే గల మనోజ్ రెడ్డి పాత్రపైనా పోలీసులు లోతైన విచారణ చేస్తున్నట్లు తెలుస్తోంది. జర్నలిస్టు రంజిత్ రెడ్డి ట్రాక్టర్ల నిర్వహణ సందర్భంగా చోటు చేసుకున్న పరిణామాల వివరాలను కూడా పోలీసులు కూపీ లాగుతున్నారు. దీక్షిత్ రెడ్డిని హత్య చేసింది సాగర్ ఒక్కడేనని ఎస్పీ ప్రకటించినప్పటికీ, అసలు ఘటనతో మరెవరికైనా అంతర్గత సంబంధముందా? అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు. మొత్తంగా రంజిత్ రెడ్డికి సోదరుని వరుసయ్యే మనోజ్ రెడ్డి కూడా పోలీసుల అదుపులోనే ఉండడం బాలుని విషాదాంత ఘటనలో ఆసక్తికర పరిణామంగా మారింది. పోలీసుల తదుపరి దర్యాప్తులో ఏం తేలుతుందన్నది వేచి చూడాల్సిందే.
ఫొటో: ఘటన వివరాలను మీడియాకు వెల్లడిస్తున్న మానుకోట ఎస్పీ కోటిరెడ్డి