కార్మిక నాయకుడు, తెలంగాణా రాష్ట్ర మాజీ హో మంత్రి నాయిని నరసింహారెడ్డి ఇక లేరు. గత రాత్రి పొద్దుపోయాక దాదాపు 12.25 గంటల ప్రాంతంలో ఆయన తుది శ్వాస విడిచినట్లు జూబ్లీ హిల్స్ అపోలో ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. తీవ్ర అనారోగ్యంతో చికిత్స తీసుకుంటున్న నాయిని నరసింహారెడ్డికి గత నెల 28వ తేదీన కరోనా సోకింది.
అయితే ఆ తదుపరి కరోనా నుంచి ఆయన కోలుకున్నారు. నెగిటివ్ రిపోర్ట్ కూడా వచ్చింది. కానీ ఊపిరి తీసుకోవడం కష్టంగా మారడం, శరీరంలో ఆక్సిజన్ స్థాయి ఒక్కసారిగా పడిపోవడంతో పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు ఆయనకు న్యుమోనియా సోకినట్లు తేల్చారు.
మెరుగైన చికిత్స కోసం ఈ నెల 13న ఆయనను కుటుంబ సభ్యులు అపోలో ఆస్పత్రిలో చేర్చారు. అప్పటినుంచి వెంటిలేటర్‌పై నాయినికి చికిత్స అందిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే బుధవారం ఆయన పరిస్థితి విషమించగా, ముఖ్యమంత్రి కేసీఆర్ సాయంత్రం ఆసుపత్రికి వెళ్లి, నాయిని అల్లుడు శ్రీనివాస్‌రెడ్డిని ఓదార్చిన సంగతి తెలిసిందే.
నామ నాగేశ్వరరావు సంతాపం:
కాగా మాజీ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి మృతి పట్ల టీఆర్ఎస్ లోక్ సభ పక్ష నేత, ఖమ్మం ఎంపీ నామ నాగేశ్వరరావు సంతాపం తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగిన ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన నాయిని నర్సింహారెడ్డిని కోల్పోవడం బాధాకరమన్నారు.
నాయిని నర్సింహారెడ్డి మరణం టీఆర్ఎస్ పార్టీకి, రాష్ట్రానికి తీరని లోటుగా ఎంపీ నామ అభివర్ణించారు. తెలంగాణ రాష్ట్ర తొలి హోంమంత్రిగా రాష్ట్రానికి ఆయన అందించిన సేవలు చిరస్మరణీయంగా నిలిచిపోతాయని కొనియాడారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుతూ నాయిని నర్సింహారెడ్డి కుటుంబ సభ్యులకు నామ నాగేశ్వరరావు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.