తెలంగాణా ప్రజలు, ముఖ్యంగా హైదరాబాద్ వాసులు మరో మూడు, నాలుగు రోజులపాటు జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. బంగాళాఖాతంలో అల్పపీడనమే ఇందుకు కారణం. మధ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని వాతావరణ శాఖ తెలిపింది.
అల్పపీడనానికి అనుబంధంగా 7.6 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని, ఇది మరింత తీవ్రంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. రాగల 48 గంటల్లో ఉపరితల ఆవర్తనం వాయువ్య దిశగా, రాబోయే మూడు రోజుల్లో ఇది ఉత్తర ఈశాన్య దిశగా ప్రయాణిస్తుందని అధికారులు పేర్కొన్నారు.
దీని ప్రభావంవల్ల రాబోయే మూడు రోజుల్లో తెలంగాణతో పాటు ఏపీలోనూ అక్కడక్కడా భారీ వర్షాలు, పలు చోట్ల మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వివరించింది. హైదరాబాద్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా పేర్కొంది.