హైదరాబాద్ వరద బాధితుల కోసం ఢిల్లీ ప్రభుత్వం చేయూతనిచ్చింది. వరద సహాయక చర్యల కోసం తమ ప్రభుత్వం రూ. 15 కోట్ల మొత్తాన్ని విరాళంగా ఇస్తున్నట్లు ఢిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్ కొద్దిసేపటి క్రితం తన ట్విట్టర్ ఖాతా ద్వారా ప్రకటించారు. వరదలు హైదరాబాద్ ను నష్టపరిచాయని, ఈ సంక్షోభ సమయంలో తమ సోదర, సోదరీమణుల పక్షాన ఢిల్లీ ప్రజలు నిలబడ్డారని సీఎం కేజ్రీవాల్ పేర్కొన్నారు.
కాగా తమిళనాడు ప్రభుత్వం కూడా నిన్న రూ. 10 కోట్ల ఆర్థిక సాయాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తమ రాష్ట్రానికి సాయం అందించినందుకుగాను తెలంగాణా సీఎం కేసీఆర్ తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామికి ఫోన్ చేసి కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలోని పరిస్థితిని వివరిస్తూ, నగదు సాయంతోపాటు వస్తు రూపంలోనూ ఆదుకోవాలని నిర్ణయించి తమిళనాడు తన ఉదారతను చాటుకుందని కేసీఆర్ అభినందించారు.