భారీ వర్షాలు, వరదల వల్ల హైదరాబాద్ నగరంలోని లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలు ఎన్నో కష్ణ, నష్టాలకు గురయ్యారని, వారిని ప్రభుత్వం ఆదుకుంటుందని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ప్రకటించారు. వరద నీటిలో మునిగిన ప్రాంతాల్లోని ఇళ్లలో నివసిస్తున్న వారు ఎంతో నష్టపోయారని, ఇళ్లల్లోకి నీళ్లు రావడం వల్ల బియ్యం సహా ఇతర ఆహార పదార్థాలు తడిసి పోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. వరదనీటి ప్రభావానికి గురైన హైదరాబాద్ నగరంలోని ప్రతీ ఇంటికీ రూ. 10వేల చొప్పున ఆర్థిక సహాయం అందిస్తామని ప్రకటించారు. ఈ ఆర్థిక సాయం మంగళవారం ఉదయం నుంచే ప్రారంభిస్తామని వెల్లడించారు.
వర్షాలు, వరదల వల్ల ఇళ్లు పూర్తిగా కూలిపోయిన వారికి లక్ష రూపాయల చొప్పున, పాక్షికంగా దెబ్బతిన్న ఇండ్లకు రూ. 50వేల చొప్పున, ఆర్ధిక సాయం అందించనున్నట్లు కేసీఆర్ ప్రకటించారు. దెబ్బతిన్న రహదారులు, ఇతర మౌలిక వసతులకు యుద్ద ప్రాతిపదికన మరమ్మత్తులు చేపట్టి, మళ్లీ మామూలు జీవన పరిస్థితులు నెలకొనేలా చూడాలని అధికారులను సీఎం ఆదేశించారు. పేదలకు సాయం ఆందించడం కోసం మున్సిపల్ శాఖకు ప్రభుత్వం రూ. 550 కోట్లు తక్షణం విడుదల చేస్తుందని సీఎం కేసీఆర్ చెప్పారు.
గడిచిన వందేళ్లలో ఎన్నడూ లేనంత భారీ వర్షం హైదరాబాద్ నగరంలో కురిసిందని, ప్రజలు అనేక కష్ట్ర, నష్టాలకు గురయ్యారన్నారు. హైదరాబాద్ నగర పరిధిలోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల కలెక్టర్లు, వారి బృందాలు వెంటనే రంగంలోకి దిగి మంగళవారం ఉదయం నుంచే ఆర్థిక సాయం అందించే కార్యక్రమం చేపట్టాలని సీఎం ఆదేశించారు. నగరంలో 200 – 250 బృందాలను ఏర్పాటు చేసి, అన్ని చోట్లా ఆర్థిక సాయం అందించే కార్యక్రమం పర్యవేక్షించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ను సీఎం కేసీఆర్ ఆదేశించారు.
పేదలకు సాయం అందించడం అతి ముఖ్యమైన బాధ్యతగా స్వీకరించి హైదరాబాద్ నగరానికి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్పోరేటర్లు, మేయర్, డిప్యూటీ మేయర్, అంతా భాగ్యస్వాములు కావాలని సీఎం చెప్పారు. నష్టపోయిన ప్రజలు ఎంతమంది ఉన్నా సరే. లక్షల మందికైనా సరే, సాయం అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం చెప్పారు. కాబట్టి బాధిత కుటుంబాల వివరాలు అధికారులకు చెప్పి, సాయం అందించాలని కోరారు. టీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు కూడా సహాయ కార్యక్రమాల్లో పాల్గొనాలని, బాధితులకు అండగా ఉండాలని కేసీఆర్ పిలుపునిచ్చారు.