ఖమ్మం మైనర్ బాలిక అమానుష ఘటనలో మరో ఫిర్యాదు!
అమానుష ఘటనలో ఇటీవల ప్రాణాలు కోల్పోయిన 13 ఏళ్ల మైనర్ బాలిక ఉదంతంలో ఇది మరో దారుణం. కేవలం రెండు లక్షల రూపాయల అప్పు ఇచ్చి, మైనర్ బాలిక ప్రాణాలు కోల్పోవడానికి ఓ ‘పెద్దమనిషి’ కూడా పరోక్షంగా కారణమయ్యాడా? ఆ బాలికపై అత్యచారయత్నం, ప్రతిఘటించిన పాపానికి పెట్రోల్ పోసి నిప్పంటించిన విషాద ఘటన పరిణామాల తర్వాత తెరపైకి వచ్చిన మరో ఫిర్యాదు అంశమిది. ఖమ్మం రూరల్ మండలం పల్లెగూడేనికి చెందిన మోతె నర్సమ్మ అనే మైనర్ బాలిక విషాదాంత ఘటన గురించి తెలిసిందే. ఖమ్మం నగరంలోని పార్శీబంధానికి చెందిన అల్లం సుబ్బారావు ఇంట్లో నర్సమ్మ పనికి చేరడం, ఆ ఇంటి యజమాని కుమారుడు అల్లం మారయ్య బాలికపై అత్యాచారానికి యత్నించడం, బాలిక ప్రతిఘటించడం, దీంతో మారయ్య ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటించడం, రహస్య చికిత్స ఘటన వెలుగులోకి రావడం, చికిత్స పొందుతూనే ఆ మైనర్ బాలిక తుదిశ్వాస విడవడం తదితర పరిణామాలు తెలిసిందే.
అయితే మొత్తం ఈ ఘటనకు దారి తీసిన పరిణామాల వెనుక పల్లెగూడేనికి చెందిన ఓ ‘పెద్దమనిషి’ అప్పు దాష్టీకం ఉన్నట్లు ఆరోపణలు వచ్చాయి. బాధిత బాలిక తల్లిదండ్రులు మోతె ఉప్పలయ్య, వెంకటమ్మలు ఈమేరకు ఖమ్మం రూరల్ పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. ఫిర్యాదులో పేర్కొన్న వివరాల ప్రకారం… బాధిత బాలిక తల్లిదండ్రులు పల్లెగూడెంలో ‘పెద్దమనిషి’గా చెలామణిలో గల ఓ వ్యక్తి వద్ద రూ. రెండు లక్షల మొత్తాన్ని వడ్డీ కింద అప్పుగా తీసుకున్నారు. ఇందుకు సంబంధించి సదరు పెద్దమనిషి ఉప్పలయ్య ఇంటి కాగితాలను కూడా తాకట్టు పెట్టుకున్నాడు. ఈ బాకీని తిరిగి చెల్లించే అంశంలో ఉప్పలయ్య కుటుంబం ఆయా పెద్దమనిషిని ప్రాధేయపడింది. ప్రస్తుతం తమ వద్ద డబ్బు లేదని, ఆర్థిక పరిస్థితి బాగోలేదని, కొంత వ్యవధి కావాలని కోరారు.
కానీ అప్పు ఇచ్చిన పెద్దమనిషి అందుకు ససేమిరా అన్నాడు. తనకు తెలిసిన ఓ కుటుంబం వద్ద మీ కూతురు నర్సమ్మను పనిలో చేర్పిస్తానని, బాకీ కింద నర్సమ్మకు వచ్చే వేతన డబ్బును తీసుకుంటానని చెప్పాడు. ఇందుకు ఉప్పలయ్య కుటుంబం అంగీకరించకపోయినా, బాలికను బలవంతంగా ఓ కుటుంబం వద్ద ఈ ‘పెద్దమనిషి’ పనికి కుదిర్చాడు. ఈ సందర్బంగా ఆయా ఇంటి యజమాని నర్సమ్మ వేతనం కింద ఇచ్చిన రూ. 50 వేల మొత్తాన్ని ఆ ‘పెద్దమనిషి’ తన అప్పు కింద జమ చేసుకున్నాడు.
ఆ తర్వాత మిగతా డబ్బు కోసం అల్లం సుబ్బారావు ఇంట్లో బాలికను మళ్లీ పనికి కుదిర్చి అక్కడ ఇచ్చే డబ్బును కూడా అప్పుకింద తీసుకుంటానని పెద్దమనిషి చెప్పాడు. ఆ సమయంలోనూ ఉప్పలయ్య దంపతులు ఇందుకు నిరాకరించారు. కానీ ఆ పెద్దమనిషి బలవంతంగా బాలికను సుబ్బారావు ఇంట్లో పని మనిషిగా నియమించాడు. కాలిన గాయాలతో ఆసుపత్రిలో గల తమ కూతురును చూడడానికి వెళ్లిన సమయంలోనూ, సదరు ‘పెద్దమనిషి’ తమ వద్దకు వచ్చాడని, మీ కూతురు కాలినందుకు రూ. 1.50 లక్షలు ఇస్తానని తెల్ల కాగితాలపై సంతకాలు చేయించుకున్నాడని వారు పేర్కొన్నారు. ఆయా పరిణామాల నేపథ్యంలో తమ కూతురు మరణానికి కారణమైన పెద్దమనిషిపై కూడా చట్టరీత్యా చర్యలు తీసుకుని, తమకు న్యాయం చేయాల్సిందిగా మైనర్ బాలిక తల్లిదండ్రులు ఉప్పలయ్య, వెంకటమ్మలు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో అభ్యర్థించారు.
కాగా ఈ ఫిర్యాదు అంశంపై ఖమ్మం రూరల్ సీఐ సత్యనారాయణరెడ్డిని ts29 సంప్రదించగా, తమకు ఫిర్యాదు అందినమాట వాస్తవమేనన్నారు. ఇందుకు సంబంధించి విచారణ చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు.