తెలంగాణాలోని అధికార పార్టీకి చెందిన కొందరు ఎమ్మెల్మేలు సహనం కోల్పోతున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. వర్షాలు, వరదల కారణంగా తీవ్ర ఇబ్బందులను ఎదుర్కున్న ప్రజల నుంచి ఉప్పల్ ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డి చేదు అనుభవాన్ని ఎదుర్కున్న సంగతి తెలిసిందే. ‘అసలు ఇక్కడ ఇండ్లు ఎవడు కట్టుకోమన్నాడు?’ అని ఎమ్మెల్యే వ్యాఖ్యానించగా, పర్మిషన్ ఎవరిచ్చారు? మీ పేరు రాసి చచ్చిపోతాం’ అని ఓ మహిళ ఎమ్మెల్యే వ్యాఖ్యలపై ఆగ్రహించిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు దారి తీసింది.
ఉప్పల్ ఎమ్మెల్యే ఘటనను ప్రజలు మరువకముందే కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాాసాగర్ రావు రైతులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ ఎమ్మెల్యై రైతులపై నోరు పారేసుకోవడానికి రైతుల ధర్నానే కారణం కావడం గమనార్హం. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మద్ధతు ధరకు రాష్ట్ర ప్రభుత్వం కూడా కొంత మొత్తాన్ని కలిపి పంటలను కొనుగోలు చేయాలనే డిమాండ్ తో నిన్న మెట్ పల్లిలో రైతులు కదం తొక్కారు. జగిత్యాల జిల్లా వ్యాప్తంగా సుమారు రెండు వేల మందికిపైగానే రైతులు తరలివచ్చి మెట్ పల్లిలో భారీ ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు ఇంట్లోకి దూసుకెళ్లేందుకు రైతులు ప్రయత్నించారు. ఎమ్మెల్యే ఇంటిని ముట్టడించేందుకు రైతులు చేసిన ప్రయత్నాన్ని పోలీసులు అడ్డుకున్నారు. ఆగ్రహించిన రైతులు కొందరు ఎమ్మెల్యే ఇంటిపై రాళ్లు రువ్వారు. ఆ తర్వాత ఎమ్మెల్యే ఇంటి ముందు బైఠాయించి ఆందోళనకు దిగడంతో మెట్ పల్లిలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. రైతు ఐక్యవేదిక ఆధ్వర్యంలో జరిగిన ఈ ధర్నా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించింది.
ఈ సంఘటనపై కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు మీడియాతో మాట్లాడుతూ, రైతులపై నోరుపారేసుకోవడమే తాజా వివాదం. ఆయన ఏమంటున్నారంటే… ‘అసలు ధర్నాలో ఒక్క రైతు కూడా లేడట. రైతులంటే మంచిగ దోతులు కట్టుకుంటరు. వ్యవసాయం చేస్తున్నట్లు ఉంటరట. వాళ్లంతా రోడ్లమీద తిరిగేవాళ్లట. రైతుల పేరు మీద రోడ్ల మీద తిరుక్కుంట, రైతుల కొడుకులో, మనుమళ్లో మాత్రమేనట. వాళ్లు వ్యవసాయం చేసేది లేదట, నాగలి పట్టేది లేదట, దున్నేది కూడా లేదట. తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తులు, పైసలతో రోడ్లమీద బీర్లు తాగుకుంటూ తిరిగే నాయకులట. వచ్చి నిన్న ధర్నా చేశారట. వీరిలో ఓ చిల్లర మనిషి కూడా ఉన్నాడట.’ ఇవీ కల్వకుంట్ల విద్యాసాగర్ రావు నిన్నటి రైతుల ధర్నాపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు.
సీఎం కేసీఆర్ సార్ ఇంటి పేరు గల కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు రైతుల గురించి మరీ ఇంత దారుణంగా మాట్లాడాారా? అని డౌటు పడుతున్నారా? అయితే దిగువన గల వీడియోను ఓసారి చూడండి.