హైదరాబాద్ నగరంలో ఢిల్లీ తరహా హార్టికల్చర్ మార్కెట్ ఏర్పాటు చేయనున్నట్లు తెలంగాణా ముఖ్యమంంత్రి కె. చంద్రశేఖర్ రావు వెల్లడించారు. ఢిల్లీ ఆజాద్ పూర్ మార్కెట్ తరహాలో హైదరాబాద్ కొంగరకలాన్ ప్రాంతంలో 300 ఎకరాల విస్తీర్ణంలో ఉద్యానవన పంటల మార్కెట్ ను నెలకొల్పనున్నట్లు ఆయన ప్రకటించారు. కూరగాయలు, పండ్లు, పూలు తదితర తోటల సాగులో గుణాత్మక మార్పులు రావాలని, ఇందుకోసం ఉద్యానవన శాఖ సుశిక్షితం, బలోపేతం కావాలని సీఎం ఆకాంక్షించారు. తెలంగాణ రాష్ట్రంలో విభిన్న స్వభావాలు కలిగిన నేలలు, మంచి వర్షపాతం, వృత్తి నైపుణ్యం కలిగిన రైతులు ఉన్నారన్నారు.
ఈ సానుకూలతలను వినియోగించుకుని పండ్లు, కూరగాయలు, పూల సాగులో విప్లవాత్మకమైన మార్పులు తీసుకురావాలని సీఎం పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ఉద్యానవన శాఖను బలోపేతం చేయడానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందన్నారు. తెలంగాణ రాష్ట్ర సమగ్ర ఉద్యానవన పంటల సాగు విధానాన్ని రూపొందించాలని, ఏడాదిలోగా ఫలితాలు సాధించాలని సీఎం చెప్పారు. వివిధ రంగాల్లో దేశంలోనే అగ్రగామిగా నిలిచినట్లు ఉద్యానవన పంటల సాగులో కూడా అగ్రస్థానం సంపాదించాలన్నారు. భవిష్యత్తుకు బాటలు వేసుకునే దశలో ఉన్న తెలంగాణ రాష్ట్రంలో ఉద్యానవన పంటల విషయంలో కూడా సమగ్ర దృక్పథం ఏర్పరచరుకోవాలని ఆకాంక్షించారు.
ప్రగతి భవన్ లో బుధవారం ఉద్యానవన శాఖపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రంలో విభిన్న రకాల స్వభావాలు కలిగిన నేలలున్నాయన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 900-1500 మిల్లీమీటర్ల వార్షిక సగటు వర్షపాతం ఉందని, వృత్తి నైపుణ్యం కలిగిన లక్షలాది రైతు కుటుంబాలున్నాయన్నారు. ఇవన్నీ తోటల సాగుకు ఎంతో సానుకూలమని, ఇంత ఉండి కూడా ఇంకా వేరే రాష్ట్రాల నుంచి పండ్లు, కూరగాయలు, పూలు,మసాల దినుసులు, నూనె గింజలను దిగుమతి చేసుకోవాల్సి వస్తున్నదన్నారు. ఈ పరిస్థితి మారాలని, ఉద్యానవన పంటల్లో తెలంగాణ రాష్ట్రం స్వయం సమృద్ధి సాధించాలన్నారు. మన అవసరాలు తీర్చడంతో పాటు దేశంలోని వివిధ ప్రాంతాలకు, ప్రపంచంలోని వివిధ దేశాలకు ఎగుమతి చేసే విధంగా మనం ఎదగాలని, ఇందుకోసం ఉద్యానవన శాఖ సమాయత్తం కావాలన్నారు. ఉద్యాన వన పంటల సాగులో అద్భుత ప్రగతి సాధించి దేశంలోనే నెంబర్ వన్ గా నిలవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించారు.
‘‘పండ్లు, కూరగాయలు, పూలు, నూనె గింజలు, మసాలా దినుసులు తదితర ఉద్యాన పంటల సాగులో తెలంగాణ రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలపడానికి ఉద్యానవన శాఖ పూర్తి స్థాయిలో సమాయత్తం కావాలి. ఉద్యానవన విద్య, విస్తరణ, పరిశోధన పెంపొందాలి. మహారాష్ట్ర, కర్ణాటక, హర్యానా లాంటి రాష్ట్రాల్లో, నెదర్లాండ్ లాంటి దేశాల్లో ఉద్యానవన పంటలు అద్భుతంగా పండిస్తున్నారు. అక్కడికి వెళ్ళి సాగు పద్ధతులు, అనుభవాలు, మార్కెటింగ్ గురించి తెలుసుకోవాలి. మంచి విధానాలను మనం అనుసరించాలి. తెలంగాణకు చెందిన ఉద్యానవన శాఖ అధికారులను బెంగళూరులోని ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ హార్టికల్చర్ రిసెర్చ్ కు పంపి శిక్షణ ఇప్పించాలి. అక్కడి నుంచి నిపుణులను తెలంగాణకు ఆహ్వానించి, ప్రత్యేక శిక్షణా తరగతులు నిర్వహించాలి. హార్టికల్చర్ యూనివర్సిటీలో, ఉద్యానవన శాఖలో తోటలపై పరిశోధనలు విస్తృతంగా జరపాలి. ఉద్యానవన పంటల సాగులో వస్తున్న ఆధునిక పద్ధతులు, మార్కెటింగ్ పై ఎప్పటికప్పుడు అధ్యయనం జరగాలి. ఈ శిక్షణ, అధ్యయనం ప్రక్రియ నిరంతరాయంగా సాగాలి. ఉద్యానవన తోటల సాగులో యాంత్రీకరణను ప్రోత్సహించాలి’’ అని ముఖ్యమంత్రి చెప్పారు.
‘‘ఉద్యానవన శాఖను విస్తరించాల్సిన అవసరం ఉంది. మండలానికి ఒక ఉద్యానవన శాఖ అధికారిని నియమించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. రాష్ట్ర ఉద్యానవన శాఖలో కూడా సాగు విధానంలో వస్తున్న మార్పులను అధ్యయనం చేయడానికి, మార్కెటింగ్ పై నిరంతరం సమాచారం తెలుసుకోవడానికి, పంటల్లో నాణ్యత పెరగడానికి తీసుకోవాల్సిన చర్యలపై అధ్యయనం చేయడానికి సీనియర్ అధికారుల నాయకత్వంలో ప్రత్యేక విభాగాలు ఉండాలి. ఉద్యానవన శాఖకు ఇంకా ఎంత మంది ఉద్యోగులు కావాలి? శాఖను ఎలా విస్తరించాలి? అనే అంశాలపై వెంటనే ప్రతిపాదనలు తయారు చేయాలి. అవసరమైన అధికారులను, సిబ్బందిని నియమించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా నిర్మిస్తున్న అన్ని రైతు వేదికల్లో ఉద్యానవన శాఖ అధికారులు కూడా కూర్చుని రైతులతో మాట్లాడే విధంగా ఏర్పాట్లు చేస్తాం’’ అని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.