తెలంగాణలో రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎటు చూసినా కుండపోతే. వాగులు, వంకలు, చెరువులు, కుంటలు పొంగి పొర్లుతున్నాయి. పలుచోట్ల గండ్లు కూడా పడ్డాయి. మంగళవారం సాయంత్రం నుంచి అర్ధరాత్రి దాటే వరకు కురిసిన వర్షం వందేళ్లలో రెండో అతి పెద్ద భారీ వర్షంగా రికార్డుకెక్కింది. రోజంతా కురిసిన జోరువాన తెలంగాణను వణికించింది.
హైదరాబాద్‌లో ఇంత భారీ స్థాయి వర్షం కురవడం 1903 తర్వాత ఇదే పెద్ద వానగా నమోదు కావడం విశేషం. గత రెండు రోజులుగా కురిసిన వానలకు పాత రికార్డులన్నీ బ్రేక్ అయ్యాయి. అక్టోబర్ నెలలో హైదరాబాద్‌లో ఈ స్థాయిలో వర్షం కురియడం గత వందేళ్లలో ఇదే మొదటిసారి. 1903లో చివరిసారి ఇలాంటి వర్షం కురిసినట్లు వాతావరణ శాఖ పేర్కొంది. అయితే ఈరోజు ఉదయం 8.30 గంటలకు హైదరాబాద్‌లో వర్షం నిలిచిపోయింది. ఆ సమయానికి నగరంలో గత 24 గంటల్లో 191.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు ఐఎండీ వెల్లడించింది.
రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలోని ఘట్కేసర్ ప్రాంతంలో 32 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. రాజధాని రోడ్లమీద నడుంలోతు నీళ్లతో గంటలకొద్దీ ట్రాఫిక్ స్తంభించింది. వరంగల్, విజయవాడ హైవేలపై మోకాలిలోతు వరద నీటితో రాకపోకలు నిలిచిపోయాయి. రాజధానిలో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో చీకట్లు అలుముకున్నాయి. హైదరాబాద్ పాతబస్తీలో గోడకూలిన సంఘటనలో ముగ్గురు పిల్లలతో సహా మొత్తం ఏడుగురు మరణించారు. ఇబ్రహీంపట్నంలో తల్లీ, కూతురు దుర్మరణం పాలయ్యారు.
కాగా రెండు రోజులుగా కురుస్తున్న జోరు వానతో ఇప్పటివరకే దాదాపు నాలుగు లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతినడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. ప్రకృతి సృష్టించిన బీభత్సం నుంచి ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూసేందుకు, వారి రక్షణ కోసం ప్రభుత్వం వెంటనే రంగంలోకి దిగింది. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఎప్పటికప్పుడు రాష్ట్రంలో వర్ష పరిస్థితిపై ఉన్నతస్థాయి సమీక్షలు జరిపారు.
ఎడతెగని వర్షాల నేపథ్యంలో మంగళవారం అర్ధరాత్రి సీఎం కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగారు. అటు వర్షాలపై అర్ధరాత్రి నుంచే అధికారులతో మాట్లాడుతూ ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహించారు. ఇటు సీఎస్ సోమేశ్‌కుమార్‌ను కూడా అప్రమత్తం చేశారు. అధికార యంత్రాంగం ఎప్పటికప్పుడు సహాయక చర్యలు చేపట్టే దిశగా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అన్ని జిల్లాల కలెక్టర్లనూ అప్రమత్తం చేసి వర్ష పరిస్థితిపై సమీక్షించారు.
మరో పక్క డీజీపీతో సమీక్ష నిర్వహించారు. ఆయనతో మాట్లాడి లోతట్టు ప్రాంతాల్లో రక్షణ చర్యలు చేపట్టాల్సిందిగా ఆదేశించారు. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలోని పలు లోతట్టు ప్రాంతాలు జలదిగ్భంధంలో చిక్కుకున్న నేపథ్యంలో తక్షణ చర్యలకు ఆదేశించారు.
గ్రేటర్ హైదరాబాద్ లో వర్ష పరిస్థితిపై మంత్రి కేటీఆర్ సమీక్ష చేపట్టారు. బుధవారం ఉదయమే జీహెచ్ఎంసీ కార్యాలయానికి చేరుకున్న ఆయన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్, పురపాలకశాఖ అధికారులు, పలు జిల్లాల కలెక్టర్లతో మాట్లాడారు. మేయర్, డిప్యూటీ మేయర్, కార్పొరేటర్లు తమ తమ ప్రాంతాల్లో పర్యటించి, పరిస్థితిని సమీక్షించాలని, ముంపు ప్రాంతాల్లో తక్షణ సహాయక చర్యలు చేపట్టాలని సూచించారు. అధికారులంతా క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండాలని ఆదేశించారు. ముంపు, లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు.