ఉద్యోగాన్ని అర్థించిన ప్రజాగాయకుడు గద్దర్ దరఖాస్తును తెలంగాణా ప్రభుత్వం తిరస్కరించినట్లు తెలిసింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం…తమ సంస్థలో గద్దర్ కు ఉద్యోగం ఇచ్చే అవకాశాలే లేవని తెలంగాణా సంస్కతిక సారథి (టీఎస్ఎస్) కళాకారుల కమిటీ స్పష్టం చేసింది. ఏ రకంగా చూసినా ఉద్యోగం కోసం గద్దర్ చేసిన దరఖాస్తు ఫార్మేట్ ప్రకారం లేదని కూడా కమిటీ భావించింది. శనివారం నాటికే కళాకారుల నియామకానికి సంబంధించిన ప్రక్రియను టీఎస్ఎస్ దాదాపుగా పూర్తి చేసింది. ఇంటర్వ్యూల ప్రక్రియను కూడా ముగించింది. మొత్తం 550 కళాకారుల పోస్టుల భర్తీ కోసం దరఖాస్తులను ఆహ్వానించగా, 5,200 మంది కళాకారులు ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకున్నారు.
ఈ నేపథ్యంలోనే ఈనెల 3వ తేదీన 73 ఏళ్ల వయస్సు గల ప్రజాగాయకుడు గద్దర్ కూడా ప్రభుత్వ పథకాల ప్రచారం నిర్వహించేందుకు నిర్దేశించిన కళాకారుని ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకున్నారు. తన పేరు గద్దర్ అని, తాను గాయపడ్డ ప్రజల పాటనని, చిన్నప్పటి నుంచే పాటలు పాడుతున్నానని, రాయడం, పాడడం, ఆడడం తన వృత్తి అని, తన వద్ద ఎటువంటి సర్టిఫికెట్లు కూడా లేవని, కళాకారునిగా తనను నియమించాలని గద్దర్ క్లుప్తంగా దరఖాస్తు చేశారు. వాస్తవానికి ఈ ఉద్యోగ నియామకానికి సంబంధించి ప్రభుత్వం నిబంధనలను కూడా రూపొందించింది. ఏ ప్రాతిపదిన చూసినా గద్దర్ టీఎస్ఎస్ నిబంధనల పరిధిలోకి వచ్చే అవకాశమే లేదని నియామకపు కమిటీ అభిప్రాయపడినట్లు సమాచారం. ఆన్ లైన్ లో దరఖాస్తు చేయాల్సి ఉండగా, టీఎస్ఎస్ కో-ఆర్డినటర్ శివకుమార్ ను అడ్రస్ చేస్తూ గద్దర్ దరఖాస్తు చేసిన సంగతి తెలిసిందే. అయితే గద్దర్ దరఖాస్తును ఆసాంతం పరిశీలించిన కమిటీ కళాకారుని ఉద్యోగానికి గద్దర్ అర్హతలు (ముఖ్యంగా వయస్సు) సరిపోవని తేల్చినట్లు తెలిసింది. అయితే అధికారికంగా మాత్రం కమిటీ ఈ విషయాన్ని వెల్లడించకపోవడం గమనార్హం. కానీ తెలంగాణా ప్రభుత్వం ప్రతి కళాకారున్ని గౌరవిస్తుందని, ఈ దరఖాస్తును గద్దర్ నేరుగా ప్రభుత్వానికే చేసుకుంటే ఏదేని నామినేటెడ్ పదవి వచ్చే అవకాశముండేదని కమిటీ అభిప్రాయపడినట్లు విశ్వసనీయంగా తెలిసింది. అంతేకాదు గద్దర్ దరఖాస్తును టీఎస్ఎస్ కమిటీ ప్రభుత్వానికి పంపించినట్లు కూడా తెలిసింది. గద్దర్ ఉద్యోగ వ్యవహారాన్ని తేల్చవలసింది ఇక సీఎం కేసీఆర్ మాత్రమేనని కమిటీ అభిప్రాయపడినట్లు సమాచారం.
(గద్దర్ ఉద్యోగ దరఖాస్తుకు సంబంధించి ts29.in ఈనెల 4వ తేదీన ప్రచురించిన వార్తా కథనం కోసం ఈ కింది లింక్ ను క్లిక్ చేయండి)
ఇస్తే వ్యవహారం, ఇవ్వకుంటే వెటకారం, గద్దర్ ఉద్యోగ దరఖాస్తు ‘మతలబు’ ఇదేనా?