ఫొటోలో మీరు చూస్తున్నది అధికార పార్టీకి చెందిన నాయకులైన ఇద్దరు కవితలు. ఈ ఇద్దరూ తండ్రుల ప్రోత్సాహం నుంచి రాజకీయంగా ఎదిగిన తనయలే. ఒకామె కల్వకుంట్ల కవిత. తెలంగాణా సీఎం కేసీఆర్ కూతురు. మరొకామె మాలోత్ కవిత. మాజీ మంత్రి డీఎస్ రెడ్యానాయక్ కుమార్తె. రాజకీయంగా ఈ ఇద్దరు మహిళా నేతల జాతకాలు ప్రస్తుతం తారుమారుకావడమే వార్తాంశం.
కల్వకుంట్ల కవిత 2014లో నిజామాబాద్ స్థానం నుంచి నేరుగా ఎంపీగా ఎన్నికై పార్లమెంటులో అడుగిడారు. ఏడాదిన్నర క్రితం 2019లో జరిగిన ఎన్నికల్లో నిజామాబాద్ నుంచే మళ్లీ పోటీ చేసి అనూహ్యంగా ఓటమి పాలయ్యారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ రెండోసారి అధికారంలోకి వచ్చాక జరిగిన ఎన్నికల్లో సీఎం కూతురు ఓటమి పాలు కావడం జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది.
దాదాపు ఏడాదిన్నరగా కవిత రాజకీయ భవితపై భిన్నకథనాలు వినిపించాయి. కానీ తాజాగా జరిగిన నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో ఆమె పోటీ చేశారు. సోమవారం నిర్వహించిన ఓట్ల లెక్కింపులో కల్వకుంట్ల కవిత భారీ ఆధిక్యతతో విజయం సాధించారు. ప్రస్తుతం ఆమెను కాబోయే మంత్రిగా టీఆర్ఎస్ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.
అదేవిధంగా మాలోత్ కవిత 2009లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మహబూబాబాద్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అయితే 2014 ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి, ప్రస్తుత ఎమ్మెల్యే శంకర్ నాయక్ చేతిలో ఓటమి పాలయ్యారు. అనంతరం తన తండ్రి రెడ్యానాయక్ తోపాటు మాలోత్ కవిత కూడా టీఆర్ఎస్ పార్టీలో చేరారు. గత ఎన్నికల్లో ఆమె మానుకోట నుంచి టీఆర్ఎస్ ఎమ్మెల్యే టికెట్ ను ఆశించినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. కానీ గత ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ఆమెకు ఏకంగా మహబూబాబాద్ ఎంపీ టికెట్ కేటాయించగా, విజయం సాధించి పార్లమెంటులో అడుగిడారు.
ఒకే పార్టీకి చెందిన ఇద్దరు కవితల రాజకీయ జాతకం ప్రస్తుతం తారుమారైనట్లుగా పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత ఎమ్మెల్సీగా, మాజీ ఎమ్మెల్యే మాలోత్ కవిత ఎంపీ కావడం రాజకీయంగా కాకతాళీయమే కావచ్చు. కానీ అధికార పార్టీలో ఈ ఇద్దరు కవితల విషయంలో చోటుచేసుకున్న రాజకీయ జాతకాల మార్పు ఘటనలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి.