తెలంగాణాలో అధికార పార్టీకి చెందిన ఓ నాయకున్ని మావోయిస్టు నక్సలైట్లు దారుణంగా హత్య చేశారు. ములుగు జిల్లా వెంకటాపురం మండలం అలుబాకలో గత అర్ధరాత్రి దాటాక నక్సలైట్లు ఈ ఘాతుకానికి పాల్పడ్డారు.
టీఆర్ఎస్ పార్టీకి చెందిన స్థానిక నేత మడూరి భీమేశ్వర్ తన ఇంట్లో నిద్రిస్తుండగా, నక్సలైట్లు అతన్ని బయటకు పిలిచి విచక్షణారహితంగా కత్తులతో పొడిచి చంపినట్లు ప్రాథమిక సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. ఈ హత్యోదంతంలో ఆరుగురు మావోయిస్టులు పాల్గొన్నట్లు సమాచారం.
కాగా ఘటనా స్థలంలో నక్సలైట్లు ఓ లేఖను కూడా వదిలి వెళ్లారు. భీమేశ్వర్ అధికార పార్టీలో కొనసాగుతూ, అమాయక ప్రజలను దోచుకుతింటున్నాడని నక్సలైట్లు ఆ లేఖలో ఆరోపించారు. టీఆర్ఎస్, బీజేపీ నాయకులు వెంటనే తమ పదవులకు రాజీనామా చేయాలని, లేకపోతే వారికీ ఇదే గతి పడుతుందని నక్సలైట్లు హెచ్చరించారు. ఈ హత్యోదంతం ఏజెన్సీలో తీవ్ర కలకలం కలిగించింది.
ఫొటో: నక్సల్స్ చేతిలో హత్యకు గురైన భీమేశ్వర్