‘పాపమని పచ్చిపులుసు పోస్తే… కారమైందని కచ్చీరుకెక్కాడట’ అనేది తెలంగాణాలో బాగా పాపులర్ సామెత. తినేతిండిలో కూర కూడా లేదని కనిపెట్టిన ఓ తల్లి దయతలచి వెనకటికో వ్యక్తికి పల్లెంలో పచ్చిపులుసు వడ్డించిదట. అయితే పచ్చిపులుసు మరీ కారమైందని అతను కచ్చీర్ (పోలీస్ స్టేషన్)కు వెళ్లాడనేది సామెతలోని తాత్పర్యం.
ఇంతకీ విషయమేమిటంటే… బతుకమ్మ పండుగ సందర్భంగా తెలంగాణా ప్రభుత్వం ఆడబిడ్డలకు బతుకమ్మ చీరలను పంపిణీ చేస్తున్న సంగతి తెలిసిందే కదా? ఏటా మాదిరిగానే ఈసారి కూడా భారీ ఖర్చుతో, రూ. 317 కోట్ల వ్యయంతో బతుకమ్మ చీరలను తయారు చేయించారు. దాదాపు 287 డిజైన్లతో కూడిన బతుకమ్మ చీరలను సిరిసిల్ల చేనేత కార్మికులతో నేయించారు.
బతుకమ్మ పర్వదినానికి ముందే రాష్ట్రంలో పండుగ వాతావరణాన్ని తలపిస్తూ అన్ని జిల్లాల్లో చీరల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. రాష్ట్రంలో 19 ఏళ్లు దాటిన ప్రతి మహిళకూ బతుకమ్మ చీరను అందిస్తున్నట్లు మంత్రులు చెబుతున్నారు. తెలంగాణా వ్యాప్తంగా వివిధ జిల్లాల్లో మంత్రులు బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని శుక్రవారం ప్రారంభించారు.
కానీ వనపర్తి జిల్లాలో మాత్రం బతుకమ్మ చీరలను స్థానిక మహిళలు తిరస్కరించినట్లు వార్తలు వచ్చాయి. చీరలు నాణ్యతగా లేవని వాటిని స్వీకరించకుడానే వనపర్తి జిల్లా గోపాల్ పేట మండల కేంద్రంలో మహిళలు వెనుదిరిగారుట. ఇదేం నాణ్యత అంటూ చీదరించుకున్నంత పని చేశారుట. చీరల నాణ్యతపై అసంతృప్తిని వ్యక్తం చేస్తూ 130 మంది మహిళలు వాటిని తీసుకోకుండా వెళ్లిపోయినట్లు వార్తల సారాంశం.
ఔ మల్ల…? అయిదేండ్లకోసారి మనం ఓటు ఏసినందుకే యేటేటా బతుకమ్మ చీరలు పంచుతున్నరు గదా. కోట్లకు కోట్లు ఖర్చుజేసి మరీ తెలంగాణా ఆడబిడ్డలను మస్త్ సంబురంగ ఉంచుతున్నరు. ఖుషీ జేస్తున్నరు గద? మరి గీ చీరెలల్ల క్వాలిటీ లేదని బద్నాం జేస్తె ఎట్ల…? పండుగ పూట సిరిసిల్ల చీరెలు గాకుండ ఉప్పాడ పట్టు చీరెలను తీసుకొచ్చి పంచుతరా ఏంది? గట్లయితే ఇంకా శాన డబ్బులు గావాలె మరి. మంచిగ లేవని మండిపడితె ఎట్ల. గిట్ల అలిగితె మరెట్ల…? చీరెను సారెగా ఇచ్చి తెలంగాణా ఆడబిడ్డను సర్కారు మంచిగ సత్కరిస్తున్నదా? లేదా? అనేది అర్దం జేసుకోవాలె. గమ్మునుండాలె. బతుకమ్మ శీరెల సంగతి ఖుల్లం ఖుల్లగ సమజైతున్నట్లే గదా!