వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా అధికార పార్టీ సరికొత్తగా యోచిస్తున్నదా? ఎన్నికల బరిలోకి తమ పార్టీ అభ్యర్ధిగా కారం రవీందర్ రెడ్డి పేరును పరిశీలిస్తున్నదా? అనే ప్రశ్నలకు ఔననే సమాచారం విశ్వాసనీయ వర్గాల నుంచి వస్తోంది.
ఈ స్థానం నుంచి మళ్లీ పల్లా రాజేశ్వర్ రెడ్డి అభ్యర్థిత్వంవైపే సీఎం కేసీఆర్ మొగ్గు చూపినట్లు, అందుకు సంకేతం కూడా ఇచ్చినట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో తెరపైకి కారం రవీందర్ రెడ్డి పేరు రావడం గమనార్హం.
ఇదే స్థానం నుంచి పోటీ చేయాలని టిజేఏస్ అధ్యక్షుడు కోదండరాం నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే రాజకీయ సమీకరణలు, బలాబలాలు, సర్వే ఫలితాలను పరిగణనలోకి తీసుకుని కేసీఆర్ పునరాలోచన చేస్తున్నారనే సమాచారం వస్తోంది.
ఉద్యోగ వర్గాలతో పరిచయాలు, సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నట్లు భావిస్తున్న రవీందర్ రెడ్డిని బరిలోకి దించేందుకు సీఎం కేసీఆర్ యోచిస్తున్నట్లు పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. వరంగల్ , ఖమ్మం , నల్గొండ జిల్లాల్లో రవీందర్ రెడ్డికి అన్ని వర్గాల్లో పట్టు ఉన్నట్లు కూడా పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.