ఈనెల 1వ తేదీన మృతి చెందిన తన మాతృమూర్తి శ్రీమతి నామా వరలక్ష్మి దశదినకర్మ విషయంలో లోక్ సభలో టీఆర్ఎస్ పక్ష నేత, ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు కీలక నిర్ణయం తీసుకున్నారు. కోవిడ్-19 నిబంధనలకు లోబడి దశదినకర్మను నిర్వహించేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.
దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు కలిగి ఉన్న ఎంపీ నామా నాగేశ్వరరావుకు తన తల్లి దశదిన కర్మకు ప్రజలు వేలాదిగా తరలివచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కోవిడ్-19 నిబంధనల ప్రకారం గుంపులుగా ఉండరాదనే ఆదేశాలను పాటిస్తూ, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకుగాను ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం.
ఇదే క్రమంలో ఇటీవల కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో దశదినకర్మ నిర్వహణకై ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఎంపీ నామా కుటుంబం తీసుకున్న ఈ నిర్ణయాన్ని జిల్లా ప్రజలు ఆహ్వానిస్తున్నారు. ప్రజలకోసం తీసుకున్న ఈ నిర్ణయం సరైనదేనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
తన జీవింతాంతం జిల్లా ప్రజల సంక్షేమాన్ని, పేద ప్రజల మేలు కోరిన నామా వరలక్ష్మి దశదిన కర్మకు కోవిడ్-19 నిబంధనలు అడ్డు రావడం బాధాకరమని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. అయినప్పటికీ తమ కోసం నామా తీసుకున్న ఈ నిర్ణయం సబబేనని జిల్లా ప్రజలు, నామా అభిమానులు అంటున్నారు.
తమ మాతృమూర్తి శ్రీమతి వరలక్ష్మి ఈనెల 1వ తేదీన స్వర్గస్తులైన విషయాన్ని తెలుపుటకు చింతిస్తున్నామని నామా సోదరులు నామా నాగేశ్వరరావు, నామా రామారావు, నామా సీతయ్య, నామా కృష్ణయ్యలు తెలిపారు. ఈ విషాద సమయంలో తమ కుటుంబానికి మనోధైర్యాన్ని ఇస్తూ అండగా నిలిచిన బంధువులు, మిత్రులు, శ్రేయోభిలాషులు, అభిమానులు, ప్రజా ప్రతినిధులు, పలు రాజకీయ పార్టీల నాయకులకు, కార్యకర్తలకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు ఎంపీ నామా తెలిపారు.
ఈ నేపథ్యంలో ఒక బాధ్యత గల ప్రజాప్రతినిధిగా, టీఆర్ఎస్ లోక్ సభ ఫ్లోర్ లీడర్ గా, ఖమ్మం పార్లమెంట్ సభ్యునిగా ప్రజలే తమ కుటుంబ సభ్యులుగా అందరి క్షేమం కోరి ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ప్రస్తుతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నియమ, నిబంధనలకు అనుగుణంగా, ప్రజారోగ్య పరిరక్షణే ధ్యేయంగా కోవిడ్-19 సూచనలు పాటిస్తూ తమ మాతృమూర్తి వరలక్ష్మి పెద్దకర్మ (దశదిన) కార్యక్రమాన్ని కుటుంబ సభ్యులతో నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిసింది.
ఇదిలా ఉండగా, ఎల్ల వేళలా ప్రజల అభిమానాన్ని, ఆప్యాయతలను, ప్రేమను కోరుకునే తమ కుటుంబాన్ని పరామర్శించి సంతాపాన్ని, తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేసిన ప్రతి ఒక్కరికీ ఎంపీ నామా నాగేశ్వరరావు శుక్రవారం ఓ ప్రకటనలో కృతజ్ఞతలు చెప్పారు.
ఫొటో: తమ మాతృమూర్తి శ్రీమతి నామా వరలక్ష్మి చిత్రపటానికి నమస్కరిస్తున్న నామా నాగేశ్వరరావు సోదరులు